Suriya's Karuppu : సూర్య కరుప్పును కొనేవాళ్లే లేరా..?

సినిమా షూటింగ్ పూర్తయింది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి సిద్ధం. అయినా చేయడం లేదు. కారణం.. ఆ సినిమాను ఇంకా ఎవరూ తీసుకోలేదు. దానికీ రీజన్స్ ఉన్నాయేమో. అవేంటంటే.. ఫ్లాప్స్. స్టార్ హీరోగా సూర్యకు తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. సౌత్ మొత్తం అతనికి అభిమానులు ఉన్నారు. తెలుగులో అయితే మరీ ఎక్కువ ఫ్యాన్సే ఉన్నారు. బట్ ఆ అభిమానులను అలరించే సినిమాలే అతన్నుంచి రావడం లేదు. ఓటిటి మూవీస్ పక్కన పెడితే సూర్య నుంచి సాలిడ్ థియేట్రికల్ బ్లాక్ బస్టర్ లేక, రాక ఏళ్లవుతోందంటే అతిశయోక్తి కాదు. ఈయేడాది వచ్చిన రెట్రోతో మరో డిజాస్టర్ చూశాడు. ప్రస్తుతం అతను ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష నటిస్తుండటం విశేషం. ఆల్రెడీ పూర్తయిన ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ అవుతుందేమో అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా చూస్తున్నారు. అయినా చేయడం లేదు. అందుకు కారణం.. ఇంకా మూవీకి ఓటిటి డీల్స్ పూర్తి కాలేదు.
కరుప్పు చిత్రానికి ఇప్పటి వరకూ ఓటిటి డీల్ ఫైనల్ కాలేదు. ఆ డీల్స్ అయిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. అంటే సూర్య నుంచి వచ్చే మూవీ టీజర్స్, ట్రైలర్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. తీరా సినిమా చూస్తే దారుణంగా పరాజయం అవుతోంది. దీంతో ఓటిటి వాళ్లు కూడా అతని సినిమాలకు భారీ ధర పెట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. అదే ఈ సినిమాకూ కనిపిస్తోన్న సమస్య అంటున్నారు. మేకర్స్ అడుగుతున్న దానికీ, ఓటిటి వాళ్లు చెబుతున్న దానికీ చాలా వ్యత్యాసం కనిపిస్తోందట. ఆ కారణంగానే ఇప్పటి వరకూ డీల్ సెట్ కాలేదని టాక్.
ఆ మధ్య కరుప్పు టీజర్ విడుదలైంది. ఎప్పట్లానే సూపర్బ్ అనిపించుకుంది. సూర్య బ్లాక్ బస్టర్స్ లోని ఐకనిక్ షాట్స్ ను కూడా రీ క్రియేట్ చేశాడు దర్శకుడు ఆర్జే బాలాజీ. వాటికీ మంచి స్పందన వచ్చింది. బట్ సినిమా ఎలా ఉంటుందనేది ఎవరి అంచనాలకూ అందేలా లేదు. అదే మూవీకి మైనస్ అయింది. మరోవైపు తమిళ్ సినిమాల వాళ్లు కొన్నాళ్లుగా వాళ్ల టైటిల్స్ ను మార్చకుండా తెలుగులో అలాగే రిలీజ్ చేస్తున్నారు. ఈ కరుప్పును కూడా తెలుగులో అదే టైటిల్ తో చూపిస్తున్నారు. కరుప్పు అంటే నలుపు అని అర్థం. మరి ఇందులో మార్చకుండా ఉండేందుకు ఇబ్బందేంటో తెలియడం లేదు. ఇదీ తెలుగు బిజినెస్ కు సమస్య అవుతుంది. ఏదేమైనా ఈ మధ్య ఓటిటి సంస్థల ఓనర్స్ కూడా బ్లైండ్ గా కాంబినేషన్స్ ను చూసి టెంప్ట్ కావడం లేదు. బలమైన కంటెంట్ నే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అందుకే సూర్య లాంటి స్టార్ హీరో మూవీకి ఇప్పటి వరకూ ఓటిటి డీల్ సెట్ కాలేదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com