Kinnera Mogulaiah, వైద్యం చేయించడానికి డబ్బులు లేక భార్యాబిడ్డని పోగొట్టుకున్నా: మొగులయ్య

Kinnera Mogulaiah: తర తరాలని నించి వచ్చిన ఆస్తిని కాపాడుకోవాలన్న తాపత్రయం చాలా మందికి ఉంటుంది.. కానీ తాత ముత్తాల నుంచి వస్తున్న కళని కాపాడుకోవాలని తపన పడ్డాడు మొగులయ్య. అదే ఆయనకు పద్మశ్రీని తెచ్చిపెట్టింది. 12 మెట్ల కిన్నెరను వాయించడంలో మొగులయ్య నేర్పరి.
దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అందుకోనున్న అతడి జీవితం వడ్డించిన విస్తరి కాదు.. పూట గడవని జీవితం. దుర్భర దారిద్ర్యం. భార్య, 9మంది పిల్లలను పోషించడం కోసం చాలా కష్టాలు పడ్డాడు. కళను గుర్తించి అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు.. తాను జీవితంలో అనుభవించిన కష్టాలను ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.
ఎన్నో ఒడిదుడుకులు.. మరెన్నో కష్టాలు, చేతిలో చిల్లిగవ్వలేక భార్య బస్టాండ్‌లో అడుక్కున్న పరిస్థితిని తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యాడు. ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చి తాను ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే డబ్బులు లేక ఆమె బస్టాండ్‌లో అడుక్కుని చివరికి తిండిలేక చనిపోయింది. శవాన్ని ఊరికి తీసుకువెళ్లేందుకు కూడా చేతిలో రూపాయి లేదు.
విషయం తెలుసుకున్న కేవీ రమణాచారి గారు 10వేలు ఇస్తే అవి తీసుకుని ఇంటికి తీసుకువెళ్లాను. మూడేళ్ల కిందట ఆమె చనిపోయింది. తొమ్మిది మంది పిల్లలు. కొడుకు గుండెలో నీరొస్తే హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించమన్నారు. కానీ డబ్బులు లేక అతడు కూడా చనిపోయాడు.
ఇల్లు లేదు, ఆధారం లేదు, ఎక్కడికైనా వెళ్లాలంటే ఎవరో ఒకరు డబ్బులిచ్చి సాయం చేస్తున్నారు. ఈ కళను బతికించాలన్నదే తన కోరిక అని మొగులయ్య తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com