Pakistan : శత్రుదేశానికి వెళ్లి.. కడిగిపారేశారు...

Pakistan : శత్రుదేశానికి వెళ్లి.. కడిగిపారేశారు...
26/11 దాడులను కళ్లారా చూశాము; దాడులు చేసిన వారు నార్వే, ఈజిప్ట్ నుంచి రాలేదు; వాళ్లు ఇప్పటికీ పాకిస్థాన్ లో మీ మధ్య స్వేచ్చగా తిరుగుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు

ప్రముఖ కవి, బాలీవుడ్ గేయ రచయిత జావెద్ అక్తర్ పాకిస్థాన్ లో పర్యటిస్తూ ఆ దేశాన్నే విమర్శించారు. ముంబై దాడులు చేసిన వారు లాహోర్ లో స్వేచ్చగా తిరుగుతున్నారని ఆరోపించారు. పాకిస్ధాన్ కు చెందిన ఉర్ధూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ సంస్మరణార్థం లాహోర్ లో ఓ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు జావెద్ అక్తర్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఓ విలేఖరి జావెద్ అక్తర్ కు ఓ ప్రశ్నను సంధించారు.


"మీరు పాకిస్థాన్ కు చాలా సార్లు వచ్చారు. ఇక్కడి ఆతిథ్యాన్ని పొందారు. భారత్ కు వెళ్లినప్పుడు అక్కడి వారికి ఎప్పుడు ఇక్కడి వాళ్ల ఆతిథ్యం గురించి చెప్పారా .?. పాకిస్థాన్ ప్రజలు కేవలం బాంబులు వేయరని ప్రేమను కూడా చూపిస్తారని ఎప్పుడైనా చెప్పారా" అని అడిగారు ఓ వ్యక్తి.

అందుకు సమాధానంగా... జావెద్ అక్తర్ మాట్లాడుతూ... ఇరు దేశాల మధ్య ఉత్కంఠభరితమైన వాతావరణ ఉన్న సంగతి నిజమే. అయితే, ముంబై వాసులమైన మేము, 26/11 దాడులను కళ్లారా చూశాము. దాడులు చేసిన వారు ఏ నార్వే నుంచో, ఈజిప్ట్ నుంచో రాలేదు. వాళ్లు ఇప్పటికీ పాకిస్థాన్ లో మీ మధ్య స్వేచ్చగా తిరుగుతున్నారు. అలాంటి పరిస్థితిలో భారతీయులు సహజంగానే పాకిస్థాన్ పై కోపాన్ని ప్రదర్శించడంలో అర్థం ఉందని అన్నారు.

పాకిస్థాన్ కు చెందిన ప్రముఖులకు భారత్ లో ఘనమైన ఆతిథ్యం లభించిందని అన్నారు. ఉదాహరణగా... ఫైజ్ సాబ్ భారత్ కు వచ్చినప్పుడు భారత ప్రభుత్వం ఆయన్ని గౌరవించిందని తెలిపారు. అదే మీరు ఇక్కడ లతా మంగేష్కర్ కోసం ఏమైనా వేడుక నిర్వహించి ఆహ్వానించారా అని ఆయన పాకిస్థాన్ ప్రజలను ప్రశ్నించారు. ఈ విషయంపై జావెద్ అక్తర్ పై భారత్ లో ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి.

తాజాగా కంగనా రనౌత్ కూడా జావెద్ అక్తర్ ను ప్రశంసించారు. "జావెద్ సాబ్ పోయెట్రీ చదువుతున్నప్పుడు అనిపించేది, వీరికి మాతా సరస్వతి కృప ఉందని. ప్రతీ మనిషిలో నిజం అనేది తప్పకుండా ఉంటుంది. ఆ నిజాన్నే జావెద్ సాబ్ ఇప్పుడు మాట్లాడారు. జైహింద్. నేరుగా శత్రువుల ఇంట్లోకి వెళ్లి దాడి చేయడమంటే ఇదే " అని అన్నారు కంగనా.

Tags

Read MoreRead Less
Next Story