PALAK MUCHHAL : పాటలతో ప్రాణం పోసే పాలక్ ముచ్చల్

సినిమాలే కాదు సమాజసేవలోనూ పాలు పంచుకుంటోన్న హీరోలు, హీరోయిన్లు చాలా మందే ఉన్నారు మన ఇండస్ట్రీలో. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీలోని నటులు తమ సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవకు ఉపయోగిస్తున్నారు. కొందరు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఏర్పాటుచేస్తున్నారు. మరికొందరు పేద పిల్లలను ఉచితంగా చదివిపిస్తున్నారు. ఇంకొందరు బ్లడ్ బ్యాంకులు, ఐ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్టార్ సింగర్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. తన తీయనైన పాటలతో సంగీతాభిమానులను ఉర్రూతలూగించే ఆమె తన సేవా గుణంతోనూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. తన ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తోంది. తద్వారా వారి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతుంది. అలా ఇప్పటివరకు సుమారు 3800 మంది పిల్లలకు ప్రాణం పోసిందీ స్టార్ సింగర్. తన సామాజిక సేవా కార్యక్రమాలతో ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న ఆమె తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ తన పేరును లిఖించుకుంది.
పాలక్ ముచ్చల్.. తెలుగు ఆడియెన్స్ కు పెద్దగా ఈ పేరు తెలియకపోవచ్చు.. కానీ హిందీ సినిమాలు చూసే వారు మాత్రం ఇట్టే గుర్తు పడతారు. ‘మేరీ ఆషికి’, ‘కౌన్ తుఝే’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ వంటి పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటిఫుల్ సింగర్. అయితే తన పాటల కంటే తన సామాజిక సేవా కార్యక్రమాలతోనే బాగా ఫేమస్ అయ్యింది పాలక్. ఇప్పటి వరకు సుమారు 3,800 మందికి పైగా పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించింది. గతంలో కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు లక్షల రూపాయలు విరాళమిచ్చిన పాలక్ ముచ్చల్ గుజరాత్ భూకంప బాధితుల కోసం రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చింది.
1992, మార్చి 30న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పుట్టిన పాలక్ ముచ్చల్, తన నాలుగో ఏట నుంచే పాడడం మొదలెట్టింది. పాలక్, ఆమె అన్న పలాష్ ముచ్చల్ ఇద్దరూ కలిసి 2000, మార్చి నుంచే స్టేజ్ షోస్ ఇవ్వడం మొదలుపెట్టారు. అలా తమ షోస్ ద్వారా వచ్చిన మొత్తాన్ని గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న నిరుపేద చిన్నారుల వైద్యం కోసం ఉపయోగించేవారు. ఇప్పటికే ఆమె చేస్తున్న సేవను ప్రభుత్వం గుర్తించి, పలు అవార్డులను కూడా ఇచ్చింది. పాలక్ ఫౌండేషన్ ద్వారా వచ్చిన మొత్తంతో పాటు సింగర్‌గా ఆమె సంపాదించిన మొత్తాన్ని కూడా పిల్లల హార్ట్ సర్జరీలకు ఉపయోగించడం మొదలెట్టింది పాలక్ ముచ్చల్.. చిన్నతనంలో వీధివీధి తిరుగుతూ పాటలు పాడుతూ చందాలు వసూలు చేసి, ఆ మొత్తాన్ని కార్గిల్ యుద్ధ వీరుల కోసం విరాళం ఇచ్చింది పాలక్ ముచ్చల్.. అలాగే గుజరాత్ భూకంపం సమయంలో రూ.10 లక్షల విరాళం ఇచ్చింది. 2013లోనే ఆమె రూ.2.5 కోట్లు సేకరించి, వాటిని 572 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లను నిర్వహించడానికి ఉపయోగించినట్టుగా NDTV రాసుకొచ్చింది. ఇలా 25 ఏళ్లుగా దాతల నుంచి సేకరించిన మొత్తంతో 3800 హార్ట్ సర్జరీలను చేయించి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోనూ పాలక్ ముచ్చల్‌కి చోటు దక్కింది.
డబ్బులు లేక ఏ ఒక్క పసి గుండె ఆగకూడదనేది నా సంకల్పం. దాతల నుంచి ఎంత వీలైతే అంత విరాళం స్వీకరిస్తాం. రూ.100 ఇచ్చేవాళ్లు కూడా ఉన్నారు. ఆ మొత్తం కూడా కొన్నిసార్లు ఎంతో ఉపయోగపడొచ్చు. అత్యవసర చికిత్సలకు మొదటి ప్రాధాన్యం ఇస్తాం.. స్టేజ్ షోస్ నిర్వహించలేనప్పుడు నేను దాచుకున్న డబ్బులను కూడా వాడేస్తాను.. అవీ కూడా సరిపోకపోతే సోషల్ మీడియా ద్వారా దాతల నుంచి సాయం కోరతాను.. మనకి కావాల్సింది ఓ ప్రాణం నిలవడమే!’ అంటూ చెప్పుకొచ్చింది పాలక్ ముచ్చల్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

