Ustad Bhagat Singh: హరీష్-పవన్ సినిమా.. టైటిల్‌పై ఫ్యాన్స్ రచ్చ
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందంటే అభిమానుల్లోనే కాదు.. పరిశ్రమలో కూడా ఓ కొత్త ఊపు కనిపిస్తుంది. అందుకోసం చాలా కాలమే ఎదురుచూడాల్సి వచ్చింది. నిజంగా ఈ కాంబోలో మరో సినిమా రావాలని అభిమానులు కూడా చాలాకాలంగా అడుగుతున్నారు.. ఎదురుచూస్తున్నారు.
చివరికి వారి కోరిక మన్నించాడు పవన్ కళ్యాణ్. హరీశ్ శంకర్ తో సినిమా చాలాకాలం క్రితమే అనౌన్స్ అయింది. కానీ అనౌన్స్ మెంట్ తర్వాత పట్టాలెక్కడంలో మాత్రం అంత వేగం కనిపించలేదు. దాదాపు యేడాది కాలంగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. అయితే ఈ ప్రాజెక్ట్ ను ఆపేశారని.. పవన్ కళ్యాణ్ ఓ లైన్ చెప్పి దాన్ని డెవలప్ చేయమని హరీష్ కు ఇచ్చాడనే వార్తలు వచ్చాయి. దీంతో భవదీయుడు భగత్సింగ్ కథ అటకెక్కింది అనుకున్నారు.
కానీ ఆ టైటిల్ నే అటు ఇటుగా మార్చేసి సడెన్ గా అనౌన్స్ చేశాడు హరీశ్ శంకర్. ఈ సారి ఉస్తాద్ భగత్సింగ్ అంటున్నాడు. ఈ టైటిల్ సైతం ఏమంత గొప్పగా లేదు అనే టాక్ వచ్చింది. అయితే అసలు ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడం వెనక అసలు ఉద్దేశ్యం వేరే ఉందంటున్నారు.
అంటే కొన్ని రోజలుగా పవన్ కళ్యాణ్ తమిళ్ లో వచ్చిన తెరి చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా ఆల్రెడీ తెలుగులో పోలీసోడుగా డబ్ అయింది. డబ్ అయిన సినిమాను రీమేక్ చేయొద్దని అభిమానులంతా రిక్వెస్ట్ లు చేస్తున్నారు.
ఈ గొడవ పెరిగి ఏకంగా తెరిని రీమేక్ చేస్తే మేం ఆత్మహత్య చేసుకుంటాం అని బెదిరింపులకూ దిగుతున్నారు. సోషల్ మీడియాలో సైతం తెరి వద్దు అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. దీంతో ఈ గొడవను ఆపేందుకే హరీష్ శంకర్ ఇలా సడెన్ గా భవదీయుడు భగత్ సింగ్ ను ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చి ఫ్యాన్స్ ను డైవర్ట్ చేశాడు అనేవారూ లేకపోలేదు.
నిజానికి ఈ ప్రాజెక్టే కాదు.. కాంబినేషన్ పైనా చాలా అనుమానాలున్నాయి. ఈ టైమ్ లో ఈ దర్శకుడు చేసిన పనికి ఫ్యాన్స్ మరింత కన్ఫ్యూజ్ అవుతున్నారు తప్ప.. నిజంగా ఓ క్లారిటీ కనిపించడం లేదు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అనే పోస్టర్ వరకూ చూసుకుంటే This time Its not just entertainment ట్యాగ్ లైన్ మారలేదు.
చివర్లో మనల్ని ఎవడ్రా ఆపేది అనే లైన్ యాడ్ చేశారు. మొత్తంగా ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోన్న మాట ఏంటంటే.. ఇది తెరికి రీమేకే అని.. ఫ్యాన్స్ ను డైవర్ట్ చేయడానికే ఇలా చేశారు అని. మరి నిజంగా టైటిల్ మార్చి తెరినే రీమేక్ చేస్తున్నారా లేక కొత్త కథతో వస్తున్నారా అనే క్లారిటీ ఇస్తే ఫ్యాన్స్ కాస్త ఖుషీ అవుతారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com