Pawan Kalyan Birthday Special: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే స్పెషల్.. ఫ్యాన్స్‌లో తగ్గని క్రేజ్

Pawan Kalyan Birthday Special: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే స్పెషల్.. ఫ్యాన్స్‌లో తగ్గని క్రేజ్
Pawan Kalyan Birthday Special: పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడుగా పరిశ్రమలోకి వచ్చి ఒక తరంతో పవన్ కళ్యాణ్ అన్నయ్యే చిరంజీవి అనిపించుకున్న స్టార్.

Pawan Kalyan Birthday Special: పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడుగా పరిశ్రమలోకి వచ్చి ఒక తరంతో పవన్ కళ్యాణ్ అన్నయ్యే చిరంజీవి అనిపించుకున్న స్టార్. భిన్నమైన ఆలోచనా ధోరణి ఉన్న పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో భారీ విజయాలున్నాయి. అతను సాధించిన విజయాలన్నీ ట్రెండ్ సెట్ చేసినవే.

ఈ కారణంగానే అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఒకవైపు నటన చేస్తూనే.. దర్శకుడుగా ఆకట్టుకున్నాడు. ఫైట్స్, డ్యాన్స్ కంపోజ్ చేయగలడు. పాటలూ పాడతాడు. ప్రస్తుతం జనసేన పార్తీ పెట్టి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. పొలిటికల్ ఎంట్రీ కారణంగా కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ ఇప్పుడు మళ్ళీ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే.

పవన్ కళ్యాణ్ కెరీర్ చాలా నెమ్మదిగా ప్రారంభమైంది. తొలినాళ్లలో చాలా చురుకుగా ఉండేవాడు. రెండో సినిమాతోనే ఛాలెజింగ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఓవర్ నైట్ కాకుండా సినిమా సినిమాకు ఎదిగిన స్టార్ పవన్ కళ్యాణ్. చిరంజీవి ప్రాభవాన్ని మరీ ఎక్కువగా వాడుకోలేదు కానీ.. కథల ఎంపికలో ఆయన ప్రభావం కూడా ఉంది. తొలిప్రేమతో ఓవర్ నైట్ యూత్ స్టార్ గా మారిన పవన్ కళ్యాణ్ ఖుషీతో టాప్ స్టార్ గా ఎదిగిపోయాడు.

పవన్ కళ్యాణ్ కి పర్టిక్యులర్ గా యూత్ లో ఫాలోయింగ్ పెరగడానికి కారణం. ఆయన స్టైల్. తనదైన పిక్చరైజేషన్ లో తెరకెక్కించిన పాటలు. తాను స్పెషల్ గా కంపోజ్ చేసుకున్న ఫైట్స్. వీటివల్ల అప్పటి యూత్ ఆడియన్స్ కి పవన్ కళ్యాణ్ చాలా బాగా నచ్చాడు.

తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషీ ఇలా వరుస చిత్రాల్లోని పవన్ పాటలు, ఫైట్స్ యూత్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి. దీంతో అప్పటి యూత్ అంతా పవన్ కళ్యాణ్ అంటే మిగతా హీరోలకంటే ఎక్కువగా అభిమానాన్ని చూపించేవారు.

చిరంజీవి మెగాస్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న టైమ్ లోనే తన రెండో సినీ వారసుడిగా కళ్యాణ్ బాబును రంగంలోకి దించాడు. చూడగానే పక్కింటి కుర్రాడిలా కనిపించిన పవన్ పై భారీ అంచనాలే పెట్టుకున్నారు మెగా అభిమానులు. వారి కోసమే కాకుండా ఇండస్ట్రీకి తానేంటో నిరూపించాలనే తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో అదిరిపోయే మార్షల్ ఆర్ట్స్, రియల్ స్టంట్స్ చేసి వారెవ్వా అనిపించాడు పవన్. ఆపై గోకులంలో సీత అంటూ సాఫ్ట్ స్టోరీ చేసీ మెప్పించాడు..

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత గోకులంలో సీత సినిమా చేశాడు పవన్. ఇందులో పవన్ పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. తొలి రెండు సినిమాలతో ఇండస్ట్రీని ఆకట్టుకున్నా.. కమర్షియల్ గా అద్భుతమైన విజయాలైతే కాదు. మూడో సినిమా సుస్వాగతం.

ఓ తమిళ చిత్రానికి అనువాదంగా వచ్చిన మూవీ. సినిమా హిట్ అయింది కానీ.. క్రెడిట్ అంతా కామెడీకే వెళ్లిపోయింది. కానీ ఆఖర్లో రియలైజ్ అయ్యే ఒన్ సైడ్ లవర్ గా పవన్ నటన ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.

తొలిప్రేమ.. చాలామంది ప్రేక్షకులు పవన్ ను తమ ఆరాధ్య నాయకుడిగా మార్చుకున్న సినిమా అది. ఇప్పటికీ న్యూ కమర్స్ ఇలాంటి కథ కోసం చూస్తుంటారు. తొలి ప్రేమలోని మాధుర్యాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ఇది. ఆ మాధుర్యాన్ని తన నటనతో ప్రతి కుర్రాడు తనను తాను చూసుకునేలా చేశాడు పవన్.. అందుకే ఆ సినిమా అంత స్పెషల్ అయింది.. లక్షలమంది కుర్రాళ్లు పవన్ అంటే పడిచచ్చేంత అభిమానానికీ కారణమైంది.

పవన్ కళ్యాణ్ ముందు నుంచీ భిన్నమైన ధోరణిలోనే ఉండేవాడు. కామ్ గోయింగ్. సినిమాల్లో కనిపించే హడావిడీ అతని లైఫ్ స్టైల్ లో కనిపించదు. అభిమానులు పెరుగుతున్నా అతనిలో అహంకారం పెరగలేదు. అది ఫ్యాన్స్ కు ఇంకా బాగా నచ్చింది. తనకు తెలిసిన అన్ని విద్యలను వెండితెరపై ప్రదర్శించడం పవన్ స్టైల్. తమ్ముడు, జానీ సినిమాల్లో జానపద శైలిలో పాడినా.. బద్రిలో రెండు పాటలకు డ్యాన్స్ కంపోజింగ్ చేసుకున్నా అది అవి తనకు నచ్చితేనే చేసుకున్నాడు.

చిరంజీవి తమ్ముడుగా కాకుండా తొలి ప్రేమతో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు పవన్. ఇక తమ్ముడు సినిమా తర్వాత ఎంతో మంది కుర్రాళ్లు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. క్లైమాక్స్ ఫైట్ లో పవన్ చేసిన స్టంట్స్ టాలీవుడ్ కే కొత్తగా అనిపించాయి..

తొలిప్రేమతో అతన్ని అభిమానించడం మొదలుపెట్టిన ఎంతో మందికి అతని మేనియా సోకింది మాత్రం ఖుషీతోనే. కాలేజ్ స్టూడెంట్ గా పవన్ చేసిన ఖుషీ టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలోనే పూర్తిగా హిందీ లిరిక్స్ తో పాట పెట్టి ఆశ్చర్యపరిచాడు. సిద్దూ సిద్ధార్థ్ రాయ్.. బెంగాల్ టైగర్ అంటూ పవన్ చెప్పిన డైలాగులు కుర్రకారును ఊపేశాయి. పాటలు కూడా ఆడియోపరంగానూ, పిక్చరైజేషన్ పరంగానూ ఎవర్ గ్రీన్ గా నిలుస్తాయి.

ఫస్ట్ మూవీ నుంచి తరచి చూస్తే పవన్ లో ఓ మంచి టెక్నీషియన్ కూడా కనిపిస్తాడు. మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్ పర్ట్ కావడమే కాదు.. వాటిని పిక్చరైజ్ చేయడంలోనూ అతని ప్రతిభ కనిపిస్తుంది. అందుకేనేమో ఈ నేపథ్యంలో కథ రాసుకుని చాలా త్వరగా మెగాఫోన్ పట్టుకున్నాడు. జానీ సినిమాతో దర్శకుడుగా మారాడు.

ఖుషీలాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత పవన్ కాన్ఫిడెన్స్ పెరిగిందో లేక, అదే సరైన టైమ్ అనుకున్నాడో కానీ, సడెన్ గా మెగా ఫోన్ పట్టేశాడు. బద్రి హీరోయిన్ రేణుదేశాయ్ హీరోయిన్ గా.. మొదలైన ఆ సినిమా విడుదలయ్యేంత వరకూ నిత్యం వార్తల్లో సంచలనంగానే ఉంది. కానీ పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ నేపథ్యంలో వచ్చిన జానీ రిజల్ట్ నిరుత్సాహపరిచింది.

చాలా తక్కువ టైమ్ లోనే పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించాడు. ఆ స్టార్డమ్ కు తోడు తన వ్యక్తిత్వంతో మరింత ఆకట్టుకునేవాడు. అయితే జానీ తర్వాత వరుసగా ఫ్లాపులు వచ్చాయి. అయినా ఫ్యాన్స్ తగ్గకపోవడానికి కారణం ఇదే. జయాపజయాలు ఎవరికైనా కామన్.. కానీ పవన్ కు కాదు అన్నట్టుగా ఫ్లాపులు పట్టుకున్నాయి.

ఆశ్చర్యంగా ఎన్ని ఫ్లాపులు వస్తున్నా పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా ఇంకా పెరుగుతూనే ఉంది. అతని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్యాడ్ ఫేజ్ అది. గబ్బర్ సింగ్ కు ముందు వరకూ జల్సా ను మినిహాయిస్తే ఖాతాలోదాదాపు ఎనిమిది ఫ్లాపులు ఉన్నాయి..

విశేషం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ ది కేవలం రీల్ హీరో ఇమేజ్ మాత్రమే కాదు. రియల్ హీరో ఇమేజ్. అందుకే ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా.. కమర్షియల్ గా భారీ లాస్ అన్నమాట చాలా అంటే చాలా తక్కువగా వినిపించింది. ఇలాంటి ఇమేజ్ చాలా అరుదు అనే చెప్పాలి. కాకపోతే హిట్ కూడా ఇంపార్టెంట్ కదా.. అందుకే యాక్షన్ నుంచి అన్నవరం లాంటి సిస్టర్ సెంటిమెంట్ సినిమాల వరకూ.. హీరోయిన్ లేని బంగారం నుంచి మాఫియా డాన్ లాంటి పంజా వరకూ ఎన్నో ప్రయోగాలు చేశాడు. కానీ అవేవి ఆకట్టుకోలేకపోయాయి.

దాదాపు పదేళ్ల తర్వాత పవన్ కు అతని స్థాయికి తగ్గ హిట్ వచ్చింది. 2012లో వచ్చిన ఆ కలెక్షన్ సునామీ గబ్బర్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది. గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కుంభవృష్టి కురిపించింది.. అన్ని రికార్డులను తిరగరాసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం మొదలైంది. గబ్బర్ సింగ్ కు ముందు పవన్ ఆలోచనా విధానినికి తర్వాత పవన్ ఆలోచనా విధానానికి ఓ స్పష్టమైన తేడాను ఫ్యాన్స్ తో పాట పరిశ్రమ కూడా గుర్తించడం మొదలైంది.

చాలా గ్యాప్ తర్వాత బద్రి దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేశాడు. అది అంచనాలను అందుకోలేకపోయింది. కానీ పవన్ లోని ఫైర్ ను మాత్రం అంతో ఇంతో చూపించగలిగాడు పూరీ. ఇక 2013లో వచ్చిన అత్తారింటికి దారేదీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అయింది. మళ్లీ అన్ని రికార్డులను తుడిచిపెట్టేసిందీ మూవీ.

విడుదలకు ముందే గంటన్నర సినిమా పైరసీకి గురైనా అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసిందంటే కారణం పవన్ కళ్యాణ్ క్రేజే. ఇక అత్తారింటికి దారేదీ క్లైమాక్స్ లో తన ఇమేజ్ భిన్నమైన నటనతో తొలిప్రేమ తర్వాత ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించాడు పవన్.

రాజకీయంగా అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువనేతగా కీలక బాధ్యతలే చూసుకున్నాడు పవన్. కానీ ప్రజారాజ్యం అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడం, ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో అన్నయ్యతోనే విభేదించాడు. మధ్యలో రేణుదేశాయ్ తో విడాకులు.. మళ్లీ పెళ్లి చేసుకోవడం వంటివి ఎంతో మందిని ఆశ్చర్యపరిచాయి. చివరగా తనే జనసేన పార్టీని స్థాపించి.. రియల్ పవర్ స్టార్ అనిపించుకున్నాడు. పార్టీ స్థాపించాక కూడా కొన్ని సినిమాలు చేశాడు.

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో విమర్శలు ఫేస్ చేయాల్సి వచ్చింది. అన్నిటినీ మౌనంగా భరిస్తూనే సినిమాలూ చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ కామెడీ చేశాడు. కాటమరాయుడు అంటూ సీరియస్ లవ్ స్టోరీ చేశాడు. ఈ రెండూ టాక్ తో సంబంధం లేకుండా కమర్షియల్ గా వసూళ్ళను రాబట్టాయి.

త్రివిక్రమ్ తో కలిసి చేసిన మూడో సినిమా అజ్ఞాతవాసి మాత్రం బాగా నిరాశపరిచింది. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి 2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ ఆశించిన ఫలితం రాలేదు. అయినా నిరాశ పడకుండా నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళతానంటూ ప్రజా క్షేత్రంలోనే ఉన్నాడు పవన్ కళ్యాణ్.

సినిమా అనేది అంత సులువుగా వదులుకునే ప్యాషన్ కాదు. పైగా రాజకీయాల్లో ఉన్న పవన్ కి... ఆర్ధిక అవసరాలు కూడా ఉంటాయి కదా అందుకే.. పవన్ కళ్యాణ్ కూడా కొంత గ్యాప్ ఇచ్చినా.. సినిమాలూ చేస్తున్నాడు. రీ ఎంట్రీ ఇచ్చి వకీల్ సాబ్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా టైమ్ లో ఆంధ్రాలో టిక్కెట్ల రేట్ల విషయం కాస్త ఇబ్బంది పెట్టినా వకీల్ సాబ్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత సితార సంస్థలో భీమ్లా నాయక్ మూవీ చేసి మరో మంచి విజయాన్ని అందుకున్నాడు పవన్ కళ్యాణ్ ...

పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు పడవలమీద కాలేసి ఉన్నాడు. ఓ పక్క కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేయాలి. మరోవైపు రెండేళ్ళలో రాబోతున్న సార్వత్రిక ఎలక్షన్స్ కోసం రెడీ అవ్వాలి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నాడు పవన్. ఈ చిత్రం నుంచి పవన్ బర్త్ డే కానుకగా ఓ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ చిత్రం తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో 'భవదీయుడు భగత్ సింగ్' మూవీ చేయబోతున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లోనూ ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఇంకా ఒకటి రెండు రీమేక్ చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. మొత్తంగా ఇటు సినిమాలతో సక్సెస్ అందుకుంటూనే... అటు పొలిటికల్ గానూ రాణించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు..

Tags

Read MoreRead Less
Next Story