Pawan Kalyan: అన్నయ్య.. తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదం: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: చిరంజీవి అంటే చిన్నా పెద్దా అందరికీ ఇష్టమైన హీరో. ఆయన సినిమాలు, ఆయన డ్యాన్సులు.. ఆయన సినిమాలు చూసి ఎదిగిన వాళ్లు, సినిమాల్లోకి వచ్చిన వాళ్లు.. ఎందరికో స్పూర్తిగా నిలిచిన మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకుని తమ్ముడు పవన్ కళ్యాణ్.. అన్నయ్య చిరుకు ప్రేమ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నయ్య అని ఆయనని పిలిచిన ప్రతిసారి అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. అలాంటి ఆయనకు జన్మదినం సందర్భంగా మనసా వాచా కర్మణా అనురాగపూర్వక శుభాకాంక్షలు.
ఆయన గురించి చెప్పాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఆయన జీవితం తెరిచిన పుస్తకం. ఆయన సాధించిన విజయాలు, కీర్తి ప్రతిష్టలు, సేవాతత్పరత గురించి తెలుగు వారితో పాటు యావత్ భారతదేశానికి తెలుసు. అన్నయ్యలోని గొప్ప మానవతావాది గురించి చెప్పడమే నాకు ఇష్టం. ఆయన జీవన విధానాన్ని ఎంత పొగిడినా తక్కువే. సాయం కోరితే తక్షణమే స్పందించే సహృదయుడు అన్నయ్య.
కోవిడ్ సమయంలో పనులు లేక సినీ కార్మికులు ఆకలితో అలమటిస్తున్న సమయంలో ఆయన చూపిన దాతృత్వం.. బ్లడ్ బ్యాంక్ స్థాపించి లక్షలాది మందితో ఏర్పరుచుకున్న రక్తసంబంధం.. వేలాది గుప్త దానాలు, ఇలా ఒకటీ రెండూ కాదు ఎన్నో.. ఇటీవల ప్రకటించిన ఉచిత ఆస్పత్రి స్థాపన వరకు చేస్తున్న కార్యక్రమాలు ఆయనలోని మానవతామూర్తిని తెలియజేస్తాయి. అన్నిటికన్నా మిన్న ఆయనలోని ఒదిగి ఉండే లక్షణం. తాను కలవబోయే వ్యక్తి ప్రతి నమస్కారం కూడా చేయలేని కుసంస్కారి అయినప్పటికీ తను చేతులెత్తి నమస్కరించే సంస్కారం చిరంజీవి సొంతం.
వయసు తారతమ్యాలు, వర్గ వైరుధ్యాలు, కులమతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకునే విశాల హృదయుడు అన్నయ్య. అలాంటి సుగుణాలు ఉన్న అన్నయ్యకు నేను తమ్ముణ్ణి కావటం నా పూర్వజన్మ సుకృతం. ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, నాకు తల్లిలాంటి మా వదినమ్మ సహచర్యంలో నిండు నూరేళ్లు చిరాయువుగా వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అన్న రూపంలో ఉన్న మా నాన్నకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా.
తెలుగు భాషలో అత్యంత ఇష్టమైన పదం అన్నయ్య. ప్రేమ, ఆప్యాయతలకు ప్రతిరూపాలు అన్నయ్య వదినలు.. అమ్మలా ఆదరించే వదినమ్మ, నాన్నలా అక్కున చేర్చుకునే అన్నయ్య అంటే నాకెంతో ఇష్టం అని పవన్ కళ్యాణ్ తనకు అన్నయ్య మీద ఉన్న ప్రేమను పదాల రూపంలో వ్యక్తీకరించాడు.
My Wholehearted Birthday wishes to my Beloved Brother whom I love ,respect & adore.. @KChiruTweets
— Pawan Kalyan (@PawanKalyan) August 22, 2022
Wishing you Good Health,Success & Glory on this special day.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com