Varahi Radh: పవన్ కల్యాణ్ ప్రచార రథం.. వారాహిపై ఫుల్‌ క్లారిటీ

Pawan Kalyan Full Clarity about Varahi Radh
Varahi Radh: పవన్ కల్యాణ్ ప్రచార రథం.. వారాహిపై ఫుల్‌ క్లారిటీ
Varahi Radh: పవన్ కల్యాణ్ ప్రచార రథం వారాహిపై ఫుల్‌ క్లారిటీతో ఉంది జనసేన. మోటార్ వాహన చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుని మరీ వాహనాన్ని రూపొందించామని చెబుతోంది.

Varahi Radh: పవన్ కల్యాణ్ ప్రచార రథం వారాహిపై ఫుల్‌ క్లారిటీతో ఉంది జనసేన. మోటార్ వాహన చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, నిపుణుల అభిప్రాయాలు తెలుసుకుని మరీ వాహనాన్ని రూపొందించామని చెబుతోంది. ప్రభుత్వం అడ్డొచ్చినా సరే.. వెనక్కి తగ్గేదే లేదని చెబుతున్నారు జనసేన నేతలు. రంగు కాదు కదా.. వారాహి వాహనానికి సంబంధించి ఏ ఒక్క పార్ట్‌ కూడా తొలగించేది లేదని స్పష్టం చేసింది. అటు నిపుణులు కూడా వాహన చట్టానికి అనుగుణంగా, నిబంధనలకు తగ్గట్టే ప్రచార రథం ఉందని స్పష్టం చేస్తున్నారు. వారాహి కలర్‌పై అధికార పార్టీ నేతలు మాట్లాడడం అంటే.. కోడిగుడ్డుపై ఈకలు పీకడమేనని ఘాటుగా స్పందిస్తున్నారు.


నిజానికి ఆలివ్ గ్రీన్ కలర్ మిలటరీ వాహనాలకు మాత్రమే వాడాలి. కాని, వారాహి వాహనం రంగుకు, మిలటరీ వాహనాల రంగుకు తేడా ఉందంటున్నారు నిపుణులు. కొద్దిపాటి తేడాలతో ఆలివ్ గ్రీన్ రంగును ఇతర వాహనాలకు వాడుకోవచ్చని చెబుతున్నారు. ఆలివ్ గ్రీన్ రంగు మోటార్ వాహనాలను కొద్దిపాటి తేడాలతో ప్రముఖ కంపెనీలే తయారుచేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. అటు మార్కెట్లోనూ ఆలివ్ గ్రీన్ కలర్‌తో ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్లు యథావిధిగానే జరుగుతున్నాయన్నారు.



మిలటరీ వాహనాల రంగుతో ప్రైవేటు వాహనాలు దేశమంతా తిరుగుతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. వేలంలో మిలటరీ వాహనాలను కొనుగోలు చేసిన వారికి.. రిజిస్ట్రేషన్‌లో ఎలాంటి అభ్యంతరాలు పెట్టడంలేదని గట్టిగా వాదిస్తున్నారు. ఇక వారాహిని లారీ ఛాసిస్‌తో తయారు చేయడంలోనూ ఎలాంటి తప్పు లేదంటున్నారు నిపుణులు. దేశంలో లారీ ఛాసిస్‌తో తయారు చేసిన బస్సులు అనేకం ఉన్నాయని చెబుతున్నారు.


వారాహిపై ప్రజాప్రతినిధులు చేస్తున్న విమర్శలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవేనని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలకు అధికారపార్టీ నాయకులు ఏం సమాధానం చెబుతారని జనసేన ప్రశ్నిస్తోంది. కొందరు అధికార పార్టీ నాయకులు అక్రమ మట్టి తవ్వకాలలో వినియోగిస్తున్న లారీలన్నీ.. నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసినవేనని విమర్శిస్తున్నారు.



5 అడుగులు ఉండాల్సిన లారీ బాడీని 8 అడుగులకు పెంచి వినియోగిస్తున్న రవాణాశాఖ కళ్లు మూసుకుని ఉండంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. 17 టన్నుల కెపాసిటీ ఉన్న లారీలో.. 25 టన్నులు నింపి అధికార పార్టీ నేతలు రవాణా చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తోంది జనసేన. నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిన ఆ వాహనాల కారణంగానే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. అసలు నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిన రవాణా వాహనాల కారణంగానే రోడ్లు కూడా దెబ్బతింటున్నాయని విమర్శిస్తున్నారు.


ఇకవారాహి వాహన ఎత్తు విషయంలోనూ ఫుల్ క్లారిటీ ఇస్తున్నారు వాహనరంగు నిపుణులు. వారాహి ఎత్తు విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని తేల్చి చెబుతున్నారు. ఎత్తునే పరిగణనలోకి తీసుకుంటే.. పలు ఆలయాల ప్రచార రథాలు వారాహి కంటే ఎత్తుగా ఉంటాయని గుర్తుచేస్తున్నారు. మొత్తానికి వారాహి వాహన రిజిస్ట్రేషన్‌కు ఎటువంటి ఆటంకాలు ఉండవని స్పష్టంగా చెబుతున్నారు రవాణా రంగ నిపుణులు.


అయితే, ఆలివ్ గ్రీన్ రంగును మోటార్ వెహికల్ చట్టం 1989లోని చాప్టర్ 121 ప్రకారం ఇండియన్ డిఫెన్స్ విభాగం మినహా ఇతరులు వినియోగించే అవకాశం లేదు. వారాహి వాహనానికి వినియోగించిన రంగు కూడా మిలటరీ రంగేనని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. లారీ ఛాసిస్‌ను బస్సుగా మార్చడం, ఉండాల్సిన ఎత్తు కంటే ఎక్కువ ఉండటం, మైన్స్‌లో వాడాల్సిన వాహనాల టైర్లను రోడ్డుపై వెళ్లే వాహనానికి వాడటం, ఆర్మీకి సంబంధించిన కలర్‌ను సివిల్ వాహనానికి వాడటం వంటివి నిబంధనలకు విరుద్ధమంటూ వాదిస్తున్నారు. అధికార పార్టీ నేతల అభ్యంతరాలన్నింటికీ వాహనరంగ నిపుణులతోనే సమాధానం చెప్పిస్తోంది జనసేన.

Tags

Read MoreRead Less
Next Story