Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ను ఢీ కొంటున్న మోహన్ లాల్

ఈ సమ్మర్ ఆరంభమే అదిరిపోయే క్లాష్ కు వేదిక కాబోతోంది. మామూలుగానే సమ్మర్ అంటే స్టార్ హీరోలు వస్తుంటారు. వారి మధ్య పోటీ అంటే ఫ్యాన్స్ లోనూ కిక్ ఉంటుంది. ఆ పోటీ ప్యాన్ ఇండియా స్థాయిలో ఉంటే ఇంక చెప్పేదేముందీ..? అలాంటి ఓ పోటీకి 2025 మార్చి 28 వేదిక కాబోతోంది. మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు -1’ విడుదల కాబోతోంది. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నాడు. ఎప్పుడో పూర్తి కావాల్సినా.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాడు పవన్. ఆయనపై 500 మందితో కూడిన యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించబోతున్నారు. ఈ సినిమాను జనవరి వరకూ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే మార్చి 28న విడుదల అని రిలీజ్ డేట్ కూడా వేశారు.
అయితే ఇదే డేట్ కు ఒక్క రోజు ముందుగా ౨౭న మరో ప్యాన్ ఇండియా మూవీ రాబోతోంది. అదే ‘ఎంపూరన్’. మళయాలంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన లూసీఫర్ కు సీక్వెల్ గా వస్తోన్న సినిమా ఇది. అక్కడి స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సారి మోహన్ లాల్ తో పాటు పృథ్వీరాజ్ కూడా కీలక పాత్ర చేస్తున్నాడు. లూసీఫర్ ను తెలుగులో మెగాస్టార్ హీరోగా గాడ్ ఫాదర్ అంటూ రీమేక్ చేశారు. కానీ మళయాలం అంత హిట్ కాదు ఇక్కడ. ఈ సారి రీమేక్ కు ఛాన్స్ లేకుండా అన్ని భాషల్లో విడుదల చేస్తున్నారీ చిత్రాన్ని.
సో.. హరిహర వీరమల్లును కూడా ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. పవన్ కు ఇది ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ అవుతుంది. ఇలాంటి మూవీతో మోహన్ లాల్ పోటీ పడబోతున్నాడు. అంటే.. తెలుగు వరకూ పవన్ ను టచ్ కూడా చేయలేరు కానీ.. ఇతర భాషల్లో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com