Jani Master : జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు

Jani Master : జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు
X

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. మైనర్ గా ఉన్న సమయంలోనే ముంబయి హోటల్ లో జానీ తనపై అత్యాచారం చేశారని పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్​ఐఆర్ లో పోక్స్ యాక్ట్ ను నార్సింగి పోలీసులు యాడ్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న జానీ మాస్టర్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జానీ మాస్టర్​ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఇటీవల ఆయన అసిస్టెంట్ గా ఉన్న ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వేధింపులు 2019 నుంచి ఉన్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. జానీ ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లోని లడఖ్‌లో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం స్పెషల్ టీమ్ లడఖ్‌ బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే, జానీమాస్టర్ పై చర్యలు తీసుకోవాలని బుధవారం మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదకు మహిళా సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు.

అసిస్టెంట్​ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతిపై లైంగిక వేధింపుల ఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నామని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి తెలిపారు. ఆ యువతికి ఐదేళ్లపాటు నరకం చూపించడంతో పాటు వేధింపులు, దాడులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది లవ్​ జిహాద్​ కేసుగా ఆమె పేర్కొన్నారు. హిందూ అమ్మాయిని ట్రాప్​ చేసినట్లుగా స్పష్టంగా ఎఫ్​ఐఆర్ లో నమోదు చేసినప్పటికీ కేసును నీరుగార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. ఇంతవరకు జానీమాస్టర్ ను అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ ఘటనకు కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు.

Tags

Next Story