సిగరెట్ విసిరితే కరెక్ట్‌గా నోట్లో పడాలి.. 'పూరీ మ్యూజింగ్స్' నుంచి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్..

ఏదైనా రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా నిత్య సాధన మరవకూడదంటారు దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈసారి పూరీ మ్యూజింగ్స్ కోసం ఆయన ఎంచుకున్న టాపిక్ ప్రాక్టీస్. దీని గురించిన పలు ఆసక్తి కర విషయాలు ఆయన మాటల్లోనే..
బ్రూస్లీ ఒక మాట చెప్పాడు. నాకు 10వేల కిక్స్ తెలిసిన వాడంటే భయం లేదు. కానీ ఒక కిక్‌ని 10వేల సార్లు ప్రాక్టీస్ చేసిన వాడితో చాలా జాగ్రత్తగా ఉంటానని. ఎందుకంటే ఆ కిక్‌లో వాడు మాస్టర్ అయి ఉంటాడు. అలాంటి వాడు కొడితే మన కాలు విరిగిపోద్ది. అందుకే మనకు ఏ పని తెలిస్తే అందులో మాస్టర్ అయిపోవాలి. దానికోసం సాధన చాలా అవసరం. నువ్వు ఎంత గొప్ప సింగర్‌వి అయినా రోజూ ప్రాక్టీస్ చేయాలి. కొండెక్కి అరువు.. గొంతు చించుకో. నువ్వు బాక్సర్ అయితే రోజూ కిక్ బ్యాగ్‌ని కొట్టు. నీకు బోలెడు నాలెడ్జ్ ఉండొచ్చు. కానీ ప్రాక్టీస్‌లో పెట్టకపోతే అది ఎందుకూ పనికి రాదు.
కుంగ్ ఫూ టెక్నిక్స్ ఎన్ని తెలిసినా ప్రాక్టీస్ లేకపోతే కుమ్మేస్తారు. గ్రేట్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారితో నేను పని చేశా. ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు రోజూ షూటింగ్ అయిపోగానే అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గరికి స్వయంగా తానే వెళ్లి మరుసటి రోజు సీన్ పేపర్ తీసుకుంటారు. ఉదయం లేవగానే అద్ధం ముందు నిలబడి డైలాగ్ ప్రాక్టీస్ చేస్తారు. షూటింగ్ స్పాట్‌కి వచ్చాక డైరెక్టర్ దగ్గరికి వెళ్లి అదే సీన్ పేపర్ ఇచ్చి చదవమంటారు. తన ఎక్స్‌ప్రెషన్‌ని చెక్ చేసుకుంటారు.
ఆ సీన్‌లో తనతో పాటు ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారో తెలుసుకుని, అవతలి వాళ్లు చిన్న యాక్టర్ అయినా సరే వాళ్ల దగ్గరికి వెళ్లి సీన్ ప్రాక్టీస్ చేద్దామా అని అడిగి వాళ్లతో కలిసి డైలాగ్ మరోసారి ప్రాక్టీస్ చేస్తారు. అవతలి వారు డైలాగ్ ఎలా చెప్తున్నారో చూస్తారు. ఎదుటివారు ఎలా చెప్తే ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలో ఫిక్స్ అవుతారాయన. మామూలుగా ఏ యాక్టర్ అయినా తమ డైలాగ్‌ని చదువుకుని కారావ్యాన్‌లో వెయిట్ చేస్తారు షాట్ కోసం. కానీ అమితాబ్ అలా కాదు. అందుకే ఆయన అమితాబ్ బచ్చన్ అయ్యారు. ఆయనతో పోలిస్తే మనం ఎంత. అందుకే ప్రాక్టీస్ చేయండి. పనిలో ఉన్నా.. పని లేకుండా ఖాళీగా ఉన్నా. ఏది తెలిస్తే దాన్ని సాధన చేయండి. సిగరెట్ విసిరితే కరెక్ట్‌గా నోట్లో పడాలి. అప్పుడే నువ్వు రజనీకాంత్ అవుతావు'' అని పూరీ వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com