Prakash Raj: మా సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా..

Prakash Raj: మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు గెలుచారు. లోకల్, నాన్ లోకల్ అనే గొడవ బాగా ప్రభావం చూపిందనే చెప్పాలి. దీంతో ప్రకాశ్ రాజ్ తాను మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. మా ఎన్నికల్లో గెలిచిన ప్రతీ ఒక్కరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
తాను దూరమవుతుంది మా కు మాత్రమే కానీ తెలుగు సినిమాకు కాదని ప్రకాశ్ రాజ్ చెప్పారు. తెలుగు సినిమాల్లో తన నటనను కొనసాగిస్తానని ఆయన అన్నారు. కళాకారుడిగా తనకు ఆత్మగౌరవం ఉందని, అందుకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తన ఓటమిని అంగీకరిస్తున్నానని ప్రకాశ్ రాజ్ చెప్పారు. తన తల్లిదండ్రులు తెలుగువారు కాకపోవడం తన తప్పు కాదు అని ఆయన అన్నారు. అతిథిగా వచ్చానని, అతిథిగానే తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతానని చెప్పారు ప్రకాశ్ రాజ్.
ప్రాంతీయ, జాతీయభావంతో ఎన్నికలు జరిగాయని, ఇలాంటి అజెండా ఉన్న అసోసియేషన్‌లో తాను కొనసాగలేనని స్పష్టం చేశారు. మా అధ్యక్షుడిగా తెలుగు వ్యక్తే ఉండాలనుకున్నారని, అందుకే విష్ణును గెలిపించారన్నారు. అబద్దాలు చెప్పడం తనకు అలవాటు లేదన్న ప్రకాశ్ రాజ్.. కళాకారుడిగా తనకంటూ ఆత్మగౌరవం ఉందని, లోకల్-నాన్ లోకల్ అజెండాల మధ్య ఉండలేనని, అందుకే ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్నారు. ఈసారి ఎన్నికల ప్రక్రియ సజావుగానే సాగిందని, ఓటు వేయడానికి ఎక్కువ మంది వచ్చారని చెప్పుకొచ్చారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com