Bengaluru: పునీత్ జీవితం మాకు ఒక ఉదాహరణ.. : ముఖ్యమంత్రి నివాళి

Bengaluru: మరణం ఎంత విచిత్రమైనది.. మంచి వాళ్లని త్వరగా తన దరికి చేర్చుకుంటుంది. దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కళామతల్లికి, అశేష అభిమానులకు దూరమై అయిదు నెలలు అయినా ఆయన జ్ఞాపకాలు అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి.
స్నేహితులు, అభిమానులమధ్య జరుపుకోవాల్సిన తన 47వ పుట్టినరోజు వేడుకలు అతడి స్మృతులను నెమరువేసుకోవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. పునీత్ చివరి చిత్రం జేమ్స్ గురువారం అతడి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది చిత్ర యూనిట్. కన్నడ సినీ లెజెండ్‌కు ప్రజలు, ప్రముఖులు నివాళులర్పించారు.
"మా అత్యంత ప్రియమైన పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జీవితం, ప్రజల పట్ల ఆయన చూపించిన ప్రేమాభిమానాలు, అణగారిన వర్గాలకు ఆయన చేసిన సహాయం ఆదర్శప్రాయం. ఆయన జీవితం మాలాంటి వారికి ప్రేరణ కలిగించింది" అని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యాఖ్యానించారు.
మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బొమ్మై మాట్లాడుతూ.. 'ఇంత చిన్న వయసులో ఆయన చేసిన అద్భుతమైన విజయాలను, కష్టాన్ని మనం ఎప్పటికీ మరచిపోకూడదని అన్నారు. ఆయన జీవించి ఉంటే ఈరోజు ఆయన 47వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేవారు అభిమానులు. అతని మరణం, అతని జీవితం మాకు ఒక ఉదాహరణ. పునీత్ చివరి చిత్రం 'జేమ్స్' విజయం సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
పునీత్‌కు మరణానంతరం 'కర్ణాటక రత్న' అవార్డును ఎప్పుడు అందజేయాలో నిర్ణయించేందుకు అతడి కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నామని అన్నారు. పునీత్, అతడి తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్‌ల గౌరవానికి తగిన విధంగా బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు.
అక్టోబర్ 29, 2021న పునీత్ రాజ్‌కుమార్ మరణించారు. కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్ చిన్న కుమారుడు పునీత్ రాజ్ కుమార్. చిత్ర సీమలో ఆయన సాధించిన విజయం, అతడి డైనమిక్ వ్యక్తిత్వం అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలబెట్టింది. పునీత్ రాజ్ కుమార్ తన దాతృత్వం కారణంగా పేద ప్రజలు అతడిని దేవుడిలా కొలుస్తుంటారు. మనిషి మరణించిన తరువాత కూడా జీవించడం అంటే ఇదేనేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com