ఎన్టీఆర్ - చరణ్ ఫ్యాన్స్‌కు మరో షాక్ ఇచ్చిన రాజమౌళి

ఎన్టీఆర్ - చరణ్ ఫ్యాన్స్‌కు మరో షాక్ ఇచ్చిన రాజమౌళి
రాజమౌళి.. ప్యాన్ ఇండియన్ డైరెక్టర్‌గా.. ఆ మాటకొస్తే.. ఇండియాస్ టాప్ డైరెక్టర్‌గా వెలుగుతున్నాడు.

రాజమౌళి.. ప్యాన్ ఇండియన్ డైరెక్టర్‌గా.. ఆ మాటకొస్తే.. ఇండియాస్ టాప్ డైరెక్టర్‌గా వెలుగుతున్నాడు. మగధీర, ఈగ, బాహుబలి సినిమాలతో మేకర్‌గా హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లాడు. కానీ వేగంలో మాత్రం అతను నిజంగానే జక్కన్న. మేకింగ్ చాలా స్లోగా ఉంటుంది. ఈ కారణంగానూ, ప్రకృతి సహకరించకపోవడం వంటి రీజన్స్ తో ఆర్ఆర్ఆర్ కరోనాకు ముందే ఆలస్యం అయింది. కరోనా సెకండ్ వేవ్‌తో మరోసారి రిలీజ్ డేట్ మారిపోయిందంటున్నారు. మరి ఈ సారి కొత్త డేట్ ఏంటో తెలుసా..?

బాహుబలి వంటి ఎపిక్ మూవీ తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఎదురుచూసిన వారికి ఏకంగా టాలీవుడ్ టాప్ స్టార్స్ తో మల్టీస్టారర్ అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ మూవీ టైటిల్ కూడా ఆర్ఆర్ఆర్ అంటూ చిత్రంగా పెట్టాడు. స్వాతంత్రానికి పూర్వం ఆంధ్ర ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమురం భీమ్ ల కథలను ఫిక్షన్ గా మార్చి రూపొందిస్తోన్న ఈ చిత్రానికి రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ తో మరింత ఆకట్టుకున్నాడు.

రాజమౌళి మొదలుపెట్టిన టైమ్ కు ఈ మూవీ గతేడాది జూలై 31న విడుదల కావాలి. అనేక కారణాలతో ఈ యేడాది సంక్రాంతికి అన్నారు. బట్ అనూహ్యంగా కరోనా రావడంతో అదీ పోయింది. దీంతో దసరా బరిలో నిలిచారు రాజమౌళి. కానీ సెకండ్ వేవ్ వల్ల ఈ డేట్‌ కు రావడం ఇంపాజిబుల్ అని అర్థం అవుతోంది. సినిమా షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. అలియా భట్ కు సంబంధించిన పార్ట్ చాలా వరకూ పెండింగ్ లో ఉంది. ఎన్టీఆర్ - చరణ్ ల పార్ట్ కూడా కొంత బ్యాలన్స్ ఉందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు చాలా టైమ్ పడుతుంది. అంటే ఈ యేడాది అక్టోబర్ 13న రావడం అసాధ్యం అనే చెప్పాలి.

ఇతర సినిమాల్లా ఆర్ఆర్ఆర్ షూటింగ్ సాధ్యం కాదు. దీనికి ఆర్టిస్టులే కాదు టెక్నీషియన్స్ కూడా చాలామంది ఉంటారు. అందుకే కోవిడ్ నిబంధనలతో చేయడం కష్టం. అయినా వచ్చే నెల లేదా ఆగస్ట్ లో షూటింగ్ స్టార్ట్ చేసినా.. అక్టోబర్ రిలీజ్ కుదరదు. అందుకే మళ్లీ సంక్రాంతికే అనుకున్నారు చాలామంది. బట్.. సంక్రాంతికి కూడా ఈ సినిమా రావడం లేదట. కాకపోతే జనవరిలోనే రిపబ్లిక్ డే సందర్భంగా 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. మొత్తంగా ఆర్ఆర్ఆర్ కోసం ఎదురు చూడటం కంటే అది వచ్చినప్పుడే చూద్దాం అని ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయితే బెటర్ అంటున్నారు.

YJ Rambabu

TV5 Entertainment Editor


Tags

Read MoreRead Less
Next Story