RRR Review : ఆర్ఆర్ఆర్ విజువల్ ఫీస్ట్... మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్..!

RRR Review :  ఆర్ఆర్ఆర్ విజువల్ ఫీస్ట్... మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్..!
RRR Review : ఆర్ఆర్ఆర్.. గత మూడేళ్లుగా ఇద్దరు టాప్ హీరోల అభిమానులకు ఇదో మంత్రం అయింది.

RRR Review : ఆర్ఆర్ఆర్.. గత మూడేళ్లుగా ఇద్దరు టాప్ హీరోల అభిమానులకు ఇదో మంత్రం అయింది. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించడం ఓ కారణమైతే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి మాస్ హీరోలు కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మరో కారణంగా ఈ సినిమా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. చాలాకాలం తర్వాత మార్కెట్ లోనూ అదే స్థాయిలో హైప్ తెచ్చుకుని భారీ అంచనాల మధ్య ఇవాళ విడుదలైంది. మరి ఇన్నాళ్లుగా ఊరించిన ఆర్ఆర్ఆర్ ఎలా ఉంది. అంచనాలను అందుకుందా..? అనేది చూద్దాం.

కథ:

1920ల కాలంలో ఆదిలాబాద్ అడవుల నుంచి కొందరు తెల్లదొరలు ఓ గోండు పాపను బలవంతంగా తీసుకువెళతారు. కలిసికట్టుగా బ్రతికే వాళ్లు ఆ పాప కోసం తమ నాయకుడిని పంపిస్తారు. అడవి దొరలా పులిని సైతం ఎదురించగల ఆ మొనగాడు వచ్చాడని తెలిసిన బ్రిటీష్ ప్రభుత్వం అతనిపై నిఘా పెడుతుంది. తన ఐడెంటినీ దాచి.. ఆ నగరంలో పాప కోసం వెదుకుతుంటాడు ఆ గిరిజన నాయకుడు. మరోవైపు బ్రిటీష్ ప్రభుత్వంలో పోలీస్ గా పనిచేస్తూ.. వారి ఆదేశాల కోసం మన దేశవాసులను కూడా కుళ్లబొడిచేంత సిన్సియర్ గా ఉంటాడు రాజు. అలాంటి రాజుకు గిరిజన నాయకుడు భీమ్ ను పట్టుకునే డ్యూటీ ఇస్తారు. భిన్న ధృవాల్లాంటి ఈ ఇద్దరూ ఎలా కలిశారు. స్నేహితులయ్యారా.. లేక శతృవులుగా మిగిలిపోయారా..? రాజులో అంత కసి ఎందుకు ఉంటుంది.. అతని నేపథ్యం ఏంటీ అనేది మిగతా కథ.

రాజమౌళి సినిమా అనగానే సరికొత్త నేపథ్యాలు కనిపిస్తుండటం సహజం. ఇది స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన ఫిక్షనల్ స్టోరీగా ముందు నుంచీ చెప్పినా.. రెండు ప్రధాన పాత్రలకూ రెండు బలమైన ఐడెంటిటీస్ ను ఇవ్వడంతో ఓ అద్భుతమైన కథ చూస్తున్నాం అని ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. ఆ విధంగానే ఎక్కువ టైమ్ తీసుకోకుండానే డైరెక్ట్ గా స్టోరీలోకి ఎంటర్ అయిపోతాడు. ఇద్దరు హీరోలను పరిచయం చేయడం నుంచి.. వారి స్నేహం, వైరం అన్నిటినీ అద్భుతంగా రాసుకున్నారు. ఈ రెండు కోణాలు చూస్తున్నంత సేపూ ఓ రేంజ్ లో ఉండేలా విజువల్ గ్రాండియర్ ను సెట్ చేయడం వల్ల.. ఆర్ఆర్ఆర్ అంచనాలను అందుకోబోతోంది అని మొదటి అరగంటలోనే అర్థమైపోతుంది.

ఢిల్లీకి వెల్లి తమ గూడె నుంచి తీసుకువెళ్లిన మల్లిని వెదుకుతూ.. అక్తర్ గా పేరు మార్చుకున్న భీమ్.. ఒక ఆశయం కోసం పనిచేస్తూ.. దానికోసం కొంత కౄరంగా వ్యవహరించడానికి కూడా వెనుకాడని రాజు.. ఇద్దరినీ ఓ రైల్ యాక్సిడెంట్ కలుపుతుంది. ఓ పిల్లాడిని కాపాడే క్రమంలో కలుసుకుని స్నేహితులవుతారు. రాజు భీమ్ ను వెదుకుతూ.. అక్తర్ తో గొప్ప స్నేహితుడుగా ఉంటాడు. ఇటు భీమ్ కూడా బ్రిటీష్ వారికి తెలియకుండా పాపను కాపాడేందుకు ప్రయత్నిస్తోన్న క్రమంలో బ్రిటీష్ రాణి కూతురుతో స్నేహం చేస్తాడు. ఆమె అతన్ని ప్రేమిస్తుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలన్నీ అటు ఎంటర్టైనింగ్ గా ఉంటూనే కథను ముందుకు తీసుకువెళుతుంటాయి. ముఖ్యంగా చదువు రాని భీమ్.. ఇంగ్లీష్ అమ్మాయితో ఇబ్బంది పడే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. అలాగే నాటు నాటు పాట సిట్యుయేషన్ అద్భుతంగా కుదిరింది. ఇప్పటి వరకూ పాటలో చూసిన దానికంటే ఎక్కువ ఊరమాస్ స్పెప్స్ తో థియేటర్స్ దద్దరిల్లిపోయేలా చేశారు ఎన్టీఆర్, చరణ్.

టాప్ హీరోల మల్టీస్టారర్ అనగానే.. ఎవరి పాత్ర ఎలా ఉంది..? ఎవరి ఎలివేషన్ ఎలా ఉంది..? ఎవరిది పై చేయి..? అంటూ ఇలా ఎన్నో డౌట్స్ వస్తుంటాయి. ఈ విషయంలో రాజమౌళికీ భయం ఉంది. అందుకే రెండు పాత్రలకూ సమాన ప్రధాన్యం ఉంటుందని చెబుతూ వచ్చాడు. ఒకరు నిప్పైతే ఒకరు నీరు అన్నాడు. కానీ తెరమీద మాత్రం నిప్పు లాంటి పాత్ర నీరులా ఉంటే.. నీరు లాంటి పాత్ర నిప్పులా భగభగమని కనిపించింది.

నిజానికి ఓ మంచి సినిమా చూడాలంటే పాత్రల మధ్య కొలతలు, సన్నివేశాల మధ్య బేరీజులు ఉండకూడదు. ఏ పాత్ర ఎలా ప్రవర్తించాలో, ఏ పాత్ర పరిధి ఏంటో అక్కడే ఆయా క్యారెక్టర్స్ ఉండాలి. క్యారెక్టరైజేషన్స్ కనిపించాలి. రాజమౌళి కూడా అదే చేశాడు. తన మాస్ హీరోలిద్దరికీ భిన్నమైన నేపథ్యాలతో పాటు భిన్నమైన పాత్రలను అందించాడు. ఈ రెండు పాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ చెలరేగిపోయారు. ఇద్దరి ఎంట్రీ సీన్స్ కు థియేటర్స్ మోతెక్కిపోతాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మగధీర సినిమాలో వందమందిని ఒకే సారి రమ్మను అనే డైలాగ్ తో చరణ్ ఇమేజ్ ను మార్చిన రాజమౌళి.. ఈ సారి వెయ్యి మందిలోకి అతన్నే పంపించి.. అదరగొట్టాడు. ఇటు ఎన్టీఆర్ ఒక జంతువు కోసం వేట మొదలుపెడితే.. అనూహ్యంగా పులి కనిపించడం.. దాన్నే వేటాడటం వంటివి కళ్లు తిప్పుకోనివ్వని సీక్వెన్స్ లు.

ఇద్దరు టాప్ హీరోలు యాక్ట్ చేస్తే.. ఎంత కాదనుకున్నా.. నటన విషయంలో బేరీజులు వేస్తారు. ఎవరి తూకం ఎలా ఉందనేది చూస్తారు. ఈ విషయంలో రాజమౌళి తీసుకున్న జాగ్రత్తలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇద్దరిలోని గొప్ప నటులను ఆయా పాత్రలకు తగ్గట్టుగా అద్భుతంగా రాబట్టుకున్నాడు. భీమ్ గా కాస్త మొండోడి పాత్రలో ఎన్టీఆర్ జీవిస్తే.. తెలివైనవాడు, మెచ్యూర్డ్ మేన్ గా రామ్ చరణ్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఇద్దరి మధ్య వచ్చే అన్ని సీన్స్ లోనూ పోటీ పడి మరీ అదరగొట్టారు.

రాజమౌళి సినిమాల్లో కథకంటే కథనం ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఎస్టాబ్లిష్ కంటే ఎలివేషన్ ఎక్కువగా ఉంటుంది. మాస్ ను మెస్మరైజ్ చేయడానికి యాక్షన్ సీక్వెన్స్ లను అద్భుతంగా చేయించుకుంటాడు. ఇవన్నీ ఇప్పటి వరకూ కనిపించనంత హై లెవల్లో ఆర్ఆర్ఆర్ లో కనిపిస్తాయి. ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఎపిసోడ్ ఎవరి ఊహలకు అందదు. ఇద్దరు హీరోల మధ్య ఫైట్ చూస్తోంటే.. మాస్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ లా కనిపిస్తుంది. ఇలాంటి గ్రేట్ యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాలో ఏడెనిమిది వరకూ ఉంటాయి. దీంతో ప్రేక్షకులంతా తెలియకుండానే కథలో లీనమైపోతారు.

దర్శకుడుగా రాజమౌళి విజన్ కేవలం ఎంటర్టైన్ చేయడం. అది కూడా వీలైనంత మాసివ్ గా. సాధారణ హీరోలతోనే సత్తా చాటిన వాడు ఇలాంటి అసాధారణ స్టార్స్ దొరికితే ఊరుకుంటాడా.. అదరగొట్టాడు. హీరోల నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తామో.. అది డబుల్ కాదు త్రిబుల్ డోస్ అనేలా చేశాడు. ఎవరి హీరో అభిమాని కూడా మరో హీరో గురించి తక్కువగా మాట్లాడుకునే అవకాశం ఇవ్వకుండా వారి పాత్రలను మాసివ్ గా తీర్చిదిద్దాడు.

ఇలాంటి కథలకు టెక్నీషియన్స్ ఎంత ముఖ్యం అనేది అందరికీ తెలుసు. అయితే రాజమౌళికి ఈ విషయంలో ఆస్థాన టెక్నీషియన్స్ ఉంటారు కాబట్టి ఎప్పట్లానే వారి నుంచీ బెస్ట్ అవుట్ పుట్ తీసుకున్నాడు. సినిమాటోగ్రఫీ అయితే నెక్ట్స్ లెవల్. ఎన్నో సీజీ షాట్స్ ఉన్నా.. అవన్నీ సహజంగానే కనిపించాయంటే ముందుగా మెచ్చుకోవాల్సింది సినిమాటోగ్రఫీనే. అది పర్ఫెక్ట్ గా క్యాప్చర్ కాకపోతే ఎంత విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నా.. గొప్పగా అనిపించదు. కీరవాణి సంగీతం మాత్రం ఈ సారి అద్భుతం అనే మాటకు కాస్త వెనక్కి తగ్గిందనే చెప్పాలి.

కథనం ఎంత మాయ చేస్తున్నా.. కథ విషయంలో ఇంకాస్త కసరత్తు చేయాల్సింది అనిపిస్తుంది. అలాగే బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ లో మునుపటి పదును కనిపించలేదు. గొప్ప డైలాగ్స్ కు తక్కువ అవకాశమే ఉన్నా.. ఆ తక్కువనూ ఎక్కువగా వాడుకోలేదాయన. సాధారణ డైలాగ్స్ తోనే సరిపెట్టేశారు. కొంచెం ట్రిమ్ చేసే అవకాశం కూడా ఉందనిపిస్తుంది. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్, సెట్స్ అన్నీ లోకల్ గానే ఉన్నాయనే ఫీలింగ్ కూడా కొన్నిసార్లు కలుగుతుంది. ముఖ్యంగా ఢిల్లీ సెట్స్ అంత గొప్పగా లేవు.

ఆర్టిస్టుల విషయంలో అలియాభట్ ను అన్యాయం జరిగింది. ఓ జూనియర్ ఆర్టిస్ట్ రేంజ్ పాత్ర అది. ఈ పాత్రకు ఏ ఔచిత్యం కనిపించదు. కేవలం బాలీవుడ్ క్రేజ్ కోసం తీసుకున్నట్టు అనిపిస్తుంది. అలాగే అజయ్ దేవ్ గణ్ పాత్రను కూడా అర్థాంతరంగా ముగించారు. సముద్రఖని ఉన్నాడా అసలు అనిపించాడంటే అతని పాత్ర ఎంత పేలవంగా ఉందో తెలుస్తుంది. ఇతర పాత్రల్లోనూ మెరిపించినవారు లేరు. అందుకు ప్రధాన కారణం కూడా లేకపోలేదు.

ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఈ ఇద్దరూ సినిమాకు ప్రధాన బలం. ఆ బలం ముందు ఇతర బలాలతో పెద్దగా పని ఉండదు అనుకున్నారో ఏమో కానీ.. వేరే పాత్రల విషయంలో శ్రద్ధ పెట్టలేదు. బట్.. ఇద్దరు హీరోలూ సినిమాను భుజాలపై మోశారు. దర్శకుడు విజన్ ను మించిన అవుట్ పుట్ ఇచ్చారనే చెప్పాలి.

ఏ నటుడైనా తమ పాత్రను అర్థం చేసుకుంటే అందులోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అదే చేశారు. మొత్తంగా కొన్ని మైనస్ లు ఉన్నా.. ఆర్ఆర్ఆర్ ఓ విజువల్ ఫీస్ట్. ఊహించ దగిన కథలోనూ అనూహ్యమైన యాక్షన్ సీక్వెన్స్ లతో ఆద్యంతం కట్టిపడేశాడు రాజమౌళి. కమర్షియల్ సినిమాల విషయంలో తనెంత పవర్ ఫుల్ డైరెక్టర్ అనేది మరోసారి ప్రూవ్ చేసుకుని తనకు తిరుగులేదనిపించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ పై ఓ రేంజ్ మానియా నడుస్తోంది. మరి ఇది సినిమాను కమర్షియల్ గా ఏ రేంజ్ కు తీసుకువెళుతుందనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది. అప్పటి వరకూ సినిమా సాధిస్తోన్న వసూళ్లు చూద్దాం.

Tags

Read MoreRead Less
Next Story