Pushpa 2 : రాజేంద్ర ప్రసాద్ గారూ.. ఇదే మాట లక్కీ భాస్కర్ అనగలరా..?

సినిమా అంటేనే అసంబద్ధమైన అంశాల కలయిక. ఎక్కడో కొన్ని తప్ప వాస్తవానికి దగ్గరగా ఉండే మూవీస్ అరుదైపోయాయి. తెలుగులో మరీ తక్కువ. ఎక్కువగా కమర్షియల్ సినిమాలదే హవా మనదగ్గర. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ లార్జర్ దన్ లైఫ్ స్టోరీస్ ను రాసుకుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు చెడ్డ పనులు చేసేవాళ్లు కూడా హీరోలుగా కనిపిస్తారు. దీనికి ఇప్పుడు పుష్ప 2 అనే కాదు.. దొంగ టైటిల్స్ తో వచ్చిన ఎన్నో సినిమాలు ఉదాహరణలున్నాయి. చట్టప్రకారం చూస్తే రాబిన్ హుడ్ కూడా పెద్ద హీరో ఏం కాదు కదా. అలాంటిది తన కెరీర్ లోనూ ఎన్నో అసంబద్ధమైన సినిమాలు చేసిన రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడు పుష్ప సినిమాపై విమర్శ చేయడం ఎంత వరకు సబబు అనేది ఇప్పుడు ప్రేక్షకుల ప్రశ్న. ఆ మాటకొస్తే.. ఈ మధ్య కాలంలో నెగెటివ్ పనులు చేస్తేనే హీరో అంటున్నారు కదా. కేజీఎఫ్ ను అందుకే ప్యాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టారు. అస్సలే మాత్రం సంబంధం లేని కొమురం భీమ్, అల్లూరి పాత్రలను కలిపి సినిమా చేస్తే హిట్ ఇచ్చారు. సో.. ఫిక్షన్ వరల్డ్ లో వర్క్ చేసుకుంటూ ఆ వర్క్ నే అవమానించేలా మాట్లాడితే ‘‘కొందరు’’ హర్షిస్తారేమో కానీ అందరూ కాదు.
రాజేంద్ర ప్రసాద్ మంచి నటుడే. తనలోని నటుడిని మరోసారి చూపించేలా సినిమా తీశారు అంటూ తాజాగా ‘హరికథ’ అనే సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడాడు. ఈ సందర్భంగానే ‘నిన్నగాక మొన్న చూశాం.. వాడెవడో చందనం దొంగ .. దొంగ వాడు హీరో’.. అంటూ పుష్ప 2పై విమర్శ చేశాడు. తర్వాత తను చేసిన లేడీస్ టైలర్, ఏప్రిల్ ఒకటి విడుదల, అప్పుల అప్పారావు చిత్రాలను ప్రస్తావించినా.. పుష్ప 2 పై చేసిన కామెంట్ హైలెట్ అయ్యింది. ఇదే విషయాన్ని ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ కూడా కర్ణాటకలో పుష్ప చిత్రాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఏదైనా ప్రేక్షకులకు ఏది నచ్చితే అదే హిట్ అంటున్నారు కాబట్టి పుష్ప విజయాన్ని స్వాగతించకపోయినా ఫర్వాలేదు కానీ.. విమర్శించడం మాత్రం తగదు.
ఆ మాటకొస్తే లక్కీ భాస్కర్ కూడా అలాంటి దొంగ కథే కదా. ఇదే మాట ఆ సినిమాను అనగలరా..? అతనో పెద్ద ఫ్రాడ్ కదా. మోసం చేసే కదా కోట్లు కొల్లగొట్టాడు. కానీ అతన్ని మాత్రం ఆహా ఓహో అంటున్నారు. పుష్ప ను మాత్రం దొంగ అంటున్నారు ఇదేం న్యాయమో మరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com