రజనీ పొలిటికల్ ఎంట్రీ.. హాట్ టాపిక్‌గా మారిన ఆడియో!

రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానంటూ ఊరించి ఊరించి అభిమానులకు షాక్ ఇస్తూ ఇక పొలిటికల్ ఎంట్రీ లేదంటూ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆరోగ్యకారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇక, దీనిపై మరో నిర్ణయం ఉండదని స్పష్టం చేశారు. అయితే, రజనీ ప్రకటనను జీర్ణించుకోలేకపోయారు ఆయన ఫ్యాన్స్. ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ నినదించారు.
అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ ఇటీవల నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి ఆయన భార్య లత పరోక్షంగా సాయం చేశారంటూ అభిమాన సంఘం నిర్వాహకుడు ఓ ఆడియో విడుదల చేశారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది. మన వెనక రజనీసార్ మేడమ్ ఉన్నారు. ఆందోళనలు చేద్దాం అనేది ఆ ఆడియో సారాంశం.
ఫ్యాన్స్ ఎవరూ ఆందోళనలకు దిగొద్దంటూ రజనీ మక్కల్ మండ్రం నోటీస్ కూడా ఇచ్చింది. రజనీ అభిమతానికి వ్యతిరేకంగా జిల్లాల్లో ఎక్కడా ఆందోళనలు చేయకూడదని జిల్లా అధ్యక్షులు సైతం ప్రకటన జారీ చేశారు. అయినప్పటికీ మొన్న ఆదివారం చెన్నైలో భారీ ఆందోళనలకు పిలుపిచ్చారు. వేయి మందికిపైగా అభిమానులు జెండాలు, ఫ్లెక్సీలతో ఆందోళనలు చేపట్టారు. దీంతో రజనీకాంత్ మరోసారి ఫ్రేమ్‌లోకి రావాల్సి వచ్చింది. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు సూపర్‌స్టార్.
రజనీకాంత్ స్టాండ్ పక్కా క్లియర్. రాజకీయాల్లోకి రాలేను అనేది రజనీ వర్షన్. కాని, లతా రజనీకాంత్ ఆలోచనలు వేరేలా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. తన భర్తను సీఎంగా చూసుకోవాలనుకుంటున్నారా అనే అనుమానాలు వచ్చేలా తాజా ఆడియో ఉంది. ఫ్యాన్స్ ఆందోళనలకు లత రజనీకాంత్ పరోక్షంగా సాయం చేశారని అభిమాన సంఘం నిర్వాహకుడు భాస్కర్ ఓ ఆడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. మొన్నీమధ్య భారీస్థాయిలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి అవసరమైన వేదికను, 500 వాటర్ క్యాన్లు, మొబైల్ టాయ్‌లెట్లు వంటివి రజనీకాంత్ సతీమణి లత పరోక్షంగా అందించారని, ఆమె అసిస్టెంట్ సంతోష్ కూడా వీటిని స్వయంగా పరిశీలించి వెళ్లారని ఆ ఆడియోలో ఉంది.
ఓ వైపు ఇక రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని రజనీ స్పష్టం చేస్తే.. ఆయన పొలిటికల్ ఎంట్రీ చేయాల్సిందేనంటూ అభిమానులు నిర్వహించిన ఆందోళనకు లత సహాయం చేయడం ఏంటి? అనే చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com