సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం
దక్షిణ భారతం నుంచి ఈ పురస్కారానికి అందుకుంటున్న 12వ వ్యక్తి రజనీకాంత్‌ కావడం విశేషం.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2020కి దాదాసాహెబ్ ఫాల్కె అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సినీ రంగంలో విశేష కృషి చేసినందుకు గాను ఈ అవార్డు ప్రకటించారు. 2019వ సంవత్సరానికి గాను ఈ 51వ దాదా సాహెబ్ ఫాల్కె అవార్డును రజనీకి ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేవర్‌ ప్రకటించారు. నటుడిగాను, నిర్మాతగానే కాకుండా విభిన్న పాత్రల్లో సినిమా రంగం అభివృద్ధికి విశేష కృషి చేసినందుకే తలైవాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు చెప్పారు.

70 ఏళ్ల రజనీకాంత్.. ఆలిండియా సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు 2000 సంవత్సరంలో పద్మభూషణ్‌, 2016లో పద్మవిభూషణ్‌ పురస్కారాల్ని కేంద్రం అందించి గౌరవించింది. దక్షిణాదినే కాకుండా పాన్ ఇండియా చిత్రాలతో బాలీవుడ్‌లోనూ ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. అవార్డులు తలైవాకి కొత్త కాకపోయినా.. భారతీయ సినిమారంగంలో అత్యుత్తమ పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోబోతుండడం పట్ల అభిమానులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ చలనచిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే స్మారకంగా 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తోంది. దక్షిణ భారతం నుంచి ఈ పురస్కారానికి అందుకుంటున్న 12వ వ్యక్తి రజనీకాంత్‌ కావడం విశేషం.

ఇక తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. రజనీకాంత్‌కు అత్యున్నత అవార్డు ప్రకటించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తమిళ రాజకీయాల్లోకి ఎంటరయ్యేందుకు గతంలో సిద్ధమైన రజనీ.. పార్టీ పేరు కూడా ప్రకటించేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఐతే అనూహ్యంగా.. గతేడాది డిసెంబర్‌ చివర్లో రజనీ ఆనారోగ్యం పాలవడంతో.. రాజకీయాల్లోకి రాకముందే వాటికి గుడ్‌బై చెప్పేశారు. ప్రస్తుతం తమిళనాట ఎన్నికల సందడి ఓ రేంజ్‌లో ఉన్నా ఆయన మౌనంగానే ఉండిపోయారు. అటు, అన్నాడీఎంకే కూటమితో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్తోంది. రసవత్తరంగా మారిన తమిళనాడు ఎన్నికల సమయంలో.. రజనీ అభిమానుల్ని తమవైపు తిప్పుకునేందుకే కేంద్రం ఈ ప్రకటన చేసిందా అనే ఊహాగానాలూ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఐతే.. సిల్వల్ స్క్రీన్‌పై ఎవర్ గ్రీన్ హీరో అయిన రజనీ.. ఈ పురస్కారానికి అన్నివిధాలా అర్హులే అయినా.. ఈ ప్రకటన చేసిన సమయం, సందర్భం మాత్రం ఇక్కడ చర్చనీయాంశమయ్యాయి.

1975లో సినీరంగ ప్రవేశం చేసిన రజనీకాంత్.. తన గురువు కె.బాలచందర్‌ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి వెనుక దిరిగి చూసుకోలేదు. తనదైన మేనరిజంతో సౌత్‌ఇండియాను షేక్ చేశారు. ముఖ్యంగా ఆయన సిగ్నేచర్ మూమెంట్స్‌కి అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. 45 ఏళ్లకుపైగా ఇండస్ట్రీలో అగ్రస్థానంలో వెలుగొందుతున్న రజనీకి.. వినయంలోనూ వేరొకరు సాటిలేరు అంటే అతిశయోక్తి కాదు. ప్రొడ్యూసర్ ఫ్లెండ్లీ యాక్టర్‌గానూ ఆయనకు పేరుంది. తన సినిమా వల్ల ఎవరూ నష్టపోకూడదనే సిద్ధాంతాన్ని రజనీ ఇప్పటికీ ఫాలోఅవుతుంటారు. అందుకే.. కష్టకాలంలో ఆదుకునే విషయంలో ముందుంటారు.

శివాజీరావ్ గైక్వాడ్ అలియాస్‌ రజనీకాంత్‌ కేరీర్‌లో ఎన్నో సూపర్‌ హిట్ బ్లాక్‌బస్టర్‌లున్నాయి. మరెన్నో అవార్డులూ వచ్చాయి. దళపతి, బాషా, ముత్తు, నరసింహ, శివాజీ, రోబో ఒకటేంటి ఈ హిట్ చిత్రాల లిస్టు పదుల కొద్దీ ఉంటుంది. ప్రాంతాలకు అతీతంగా కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రజనీ ఖాతాలో ఇప్పుడు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం రూపంలో మరో అవార్డు చేరబోతోంది.

Tags

Next Story