RRR టీమ్‌కు అరుదైన గౌరవం... ఆస్కార్‌ కమిటీలో చోటు

RRR టీమ్‌కు అరుదైన గౌరవం... ఆస్కార్‌ కమిటీలో చోటు
ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు మరో అరుదైన గౌరవం.. ఆస్కార్‌ కమిటీలో చోటు... అభినందనలతో హోరెత్తిపోయిన సోషల్‌ మీడియా...

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్‌ పురస్కారాలు అందజేసే అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌లో ప్యానెల్‌ సభ్యులుగా ఆరుగురు ఎంపికయ్యారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి ఆస్కార్‌ కమిటీలో అవకాశం లభించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డులను ప్రదానం చేసే ద అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ కొత్తగా ఆస్కార్‌ కమిటీలో 398 మందికి సభ్యత్వం కల్పించింది. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు చెందిన ఆరుగురు ఉండడం విశేషం. స్టార్‌ హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌తో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్‌, సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సిరిల్‌లకు ఈ కమిటీలో స్థానం దక్కింది.





మణిరత్నం, కరణ్‌జోహార్‌, సిద్ధార్థ్ రాయ్ కపూర్‌లకు కూడా ఆస్కార్‌ కమిటీ ఆహ్వానం పలికింది. ఈ కళాకారులు, నిపుణులను మా సభ్యత్వంలోకి స్వాగతిస్తున్నందుకు అకాడమీ గర్విస్తోందని అకాడమీ CEO బిల్ క్రామెర్, అకాడమీ ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. తమ విభాగాలలో అసాధారణమైన ప్రతిభను చూపిన వీరంతా... ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికులపై ఎంతో ప్రభావాన్ని చూపారని కొనియాడారు. ఆహ్వానితులందరూ సభ్యత్వాన్ని అంగీకరిస్తే, అది మొత్తం అకాడమీ సభ్యుల సంఖ్య ఈ ఏడాది 10 వేల 817కి పెరగనుందని వెల్లడించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి ఆస్కార్‌ కమిటీలో అవకాశం లభించడంతో సోషల్‌ మీడియా హోరెత్తిపోతుంది.







నెటిజన్టలు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్‌ చేస్తున్నారు. రామ్‌చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్‌ అభిమానులు ట్వీట్లను హోరెత్తిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గతేడాది విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమాలోని పాటను అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌ అవార్డు వరించింది. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే రికార్డు సాధించిన వీరికి ఆస్కార్‌ కమిటీలో చోటు కల్పించడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దర్శకధీరుడు రాజమౌళికి కూడా స్థానం కల్పించి ఉంటే బాగుండేదంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాదికిగానూ ఆస్కార్‌ ఆర్గనైజర్స్‌ మెంబర్‌ షిప్‌ దక్కించుకున్న వారిలో 40శాతం మహిళలు ఉన్నారు. అలాగే వచ్చే ఏడాది ఆస్కార్‌ వేడుక మార్చి 10న నిర్వహించనున్నారు.

Tags

Next Story