Tollywood: 'రజాకర్' పోస్టర్ రిలీజ్

‘రజాకార్’ పోస్టర్ ను రిలీజ్ చేశారు బీజేపీ నేతలు విద్యాసాగర్ రావు, బండి సంజయ్ . ఈ సినిమాలో బాబీ సింహా, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే నటిస్తున్నారు. సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై యాటా సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ‘‘అప్పట్లో ఇక్కడ 8 జిల్లాలుండేవి. ఇక మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు అన్నీ కలిసి హైదరాబాద్ సంస్థానంలో ఉండేవి. ఇవన్నీ ఓ దేశంగా ఉండాలంటూ బ్రిటీష్ ప్రభుత్వం బలహీనమైన చట్టాన్ని విడుదల చేసిన కారణంగా నిజాం ప్రభువు స్వతంత్య్ర రాజ్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతని బలంగా లక్ష, రెండు లక్షలు మంది కలిసి రజాకార్స్ సైన్యంగా ఏర్పడ్డారు. ఎన్నో అకృత్యాలు చేశారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 17 నెలల తర్వాత హైదరాబాద్‌కు స్వాతంత్య్రం వచ్చింది. అప్పుడు ప్రజలందరూ ఏకం కావటంతోనే స్వతంత్య్రం వచ్చింది. ఇస్లాంవేరు, రజాకార్లు వేరు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో ముస్లిం సోదరులు చాలా మందే ఉన్నారు. మౌలానా, తురేబాజ్ ఖాన్ వంటి ఎందరో హైదరాబాద్ స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారు. ఇలాంటి చరిత్ర భావి తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చరిత్రతో చేసిన రజాకర్ సినిమాను చూసి ఎంకరేజ్ చేయాలి’’ అన్నారు. చిత్రం విజయం సాధించాలని అతిథులు కోరారు. ప్రతీ ఒక్కరికి జరిగిన చరిత్ర తెలుసుకోవాలని అన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసినప్పుడు.. పాతబస్తీ ఫైల్స్ అనే సినిమా చేద్దామని నేను, నారాయణ రెడ్డన్న అనుకున్నాం. అయితే ముందు రజాకార్ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడున్న యువతకు మన చరిత్ర గురించి తెలియదు. చరిత్రను చూపెట్టటానికి చాలా మంచి ఆలోచిస్తారు. కానీ.. కొందరేమో నైజాం పాలనను స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. కానీ అది తప్పు. చరిత్రను చరిత్రగా చూపెట్టాలంటే కూడా దాన్ని ఓ మతం కోణంలో చూపెట్టాలనే ప్రయత్నం చేస్తారు. అందువల్ల కొంత మందికి ఇబ్బంది వస్తుందనే భయంతో ఆలోచిస్తారు. జరిగిన చరిత్రను మతం కోణంలో కాకుండా జరిగింది జరిగినట్లు చూపెట్టటానికి గూడూరు నారాయణరెడ్డిగారు, యాటా సత్యనారాయణగారు కలిసి రజాకార్ సినిమా చేశారు. వాళ్లు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మనకు ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం అనే సంగతి తెలిసిందే. కానీ హైదరాబాద్‌కు స్వాతంత్య్రం వచ్చింది మాత్రం సెప్టెంబర్ 17. నీచమైన నిజాం చరిత్ర గురించి ఎవరికీ తెలియదు. దాన్ని తెలియజేసే ప్రయత్నమే రజాకార్ సినిమా. ఇందులో నిజమైన చరిత్రను చూపెట్టే ప్రయత్నం చేశారు. కశ్మీర్ ఫైల్స్ గురించి ఎలాగైతే ప్రచారం చేశారో, ఇప్పుడు రజాకార్ సినిమా గురించి ప్రచారం చేయాలి. ఈ సినిమాను ఆదరిస్తేనే గూడూరు నారాయణ రెడ్డిగారు, సత్యనారాయణగారు మరిన్ని సినిమాలు చేస్తారు. ఎంటైర్ టీమ్‌కు అభినందనలు’’ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com