Sirivennela Seetharama Sastry: స్నేహితుడే వియ్యంకుడైన వేళ..

Sirivennela Seetharama Sastry: సాహిత్యంలో సరిజోడి, ఇద్దరి అభిరుచులు ఒక్కటి కావడంతో వారి స్నేహం బలపడింది. దాన్ని బంధుత్వంగా మార్చుకోవాలనుకున్నారు సిరివెన్నెల.. స్నేహితుడి కొడుక్కి తన కూతురునిచ్చి వివాహం జరిపించారు. ఆ విధంగా స్నేహితులిద్దరూ వియ్యంకులుగా మారారు.
విశాఖకు చెందిన నండూరి రామకృష్ణకు సాహిత్యాభిలాష ఎక్కువ. అదే సిరివెన్నెలతో సాన్నిహిత్యానికి దారి తీసింది. 1977 నుంచి మామధ్య స్నేహం కొనసాగుతోంది అని ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు రామకృష్ణ. మిమ్మల్ని కలిసేందుకే చెన్నై వచ్చానని చెప్పడంతో ఆయన ఎంతో సంతోషించారు.
తరువాత అనేక సాహిత్య సమావేశాల్లో ఇరువురం వేదికను పంచుకునేవాళ్లం. 1995లో గాయం సినిమా ప్రివ్యూ సమయంలో ఆంధ్రా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సిరివెన్నెల పాల్గొన్నారు. అప్పుడు సిరివెన్నెలతో పాటు వేటూరి, భువనచంద్ర, జొన్నవిత్తులతో కలిసి వేదిక పంచుకునే అవకాశం నాకు కల్పించారు.
నా కుమారుడు నండూరి సాయిప్రసాద్ ఒడుగు ఫంక్షన్‌కు సీతారామశాస్త్రి కూడా హాజరయ్యారు. అప్పుడే తన కూతురు లలితను నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అలా 2001లో మా అబ్బాయి, వాళ్ల అమ్మాయితో వివాహం జరిగింది.
ఆ విధంగా స్నేహితులం కాస్తా వియ్యంకులుగా మారాము అని సిరివెన్నెల ఇక లేరని తెలిసి తీవ్రంగా దు:ఖిస్తున్నారు రామకృష్ణ. సీతారామశాస్త్రి విలువలతో కూడిన సాహిత్యాన్ని సమాజానికి అందించారు. అశ్లీలతకు ఆయన సాహిత్యంలో చోటు లేదు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం సినిమా పరిశ్రమకే కాదు సమాజానికీ తీరని లోటు అని రామకృష్ణ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com