Divya Bharti : ఆమె అందమే ఆమెకి శాపమైంది.. దివ్యభారతి చనిపోయి నేటికి 29 ఏళ్ళు..!

Divya Bharti : 19 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి అభిమానులకి తీరని శోకాన్ని మిగిల్చిన దివ్యభారతి మరణించి నేటికి ముప్పై ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా ఆమెను ఓ సారి స్మరించుకుందాం..!
తెర మీద వెలుగులు విరజిమ్మి అర్ధాంతరంగా రాలిపోయి కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో తీయని బాధగా మిగిలిన తారలు చాలా మందే ఉన్నారు. శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్లాక తెలుగు తెర మీద మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ అనిపించుకున్న తార దివ్యభారతి. తను కూడా అర్ధంతరంగానే ఈలోకాన్ని వీడింది. తొంభై దశకం తొలినాళ్లలో ఆనాటి యువ హృదయాలను తాకిన పిల్ల సమీరం దివ్యభారతి...స్మృతులు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. ఇవాళ దివ్యభారతి వర్ధంతి..
సినిమా మేకింగ్ లో మూవీ మొఘల్ రామానాయుడుది కాస్త భిన్నమైన శైలి. వర్కౌట్ అవుతుందని కథ మీద కాన్ఫిడెన్స్ కుదిరితే ఎంత ఖర్చుకైనా వెనుకాడని తత్వం ఆయనది. ప్రేక్షకులను వేరేలోకాల్లోకి తీసుకుపోవడమే సినిమా పరమావధి అనేది నాయుడు గారి కాన్సెప్ట్. బొబ్బిలిరాజా కథ వినగానే అందులో హీరోయిన్ పాత్రకున్న ప్రాధాన్యత తో పాటు కావాల్సిన గ్లామర్ కూడా ఆయన మదిలో మెదిలింది. అప్పుడే దివ్యభారతి ఆయన ముందుకు వచ్చింది. పసితనం ఛాయలు వీడని ముఖంలో నాయుడుగారు ఫ్యూచర్ హోప్ ఆప్ ఇండస్ట్రీ అవదగ్గ హీరోయిన్ ను చూశారు.
వెంకటేశ్ హీరోగా వచ్చిన బొబ్బిలిరాజా సెన్సేషనల్ హిట్ కొట్టడంలో దివ్యభారతి షేర్ ఎక్కువే. దివ్య ఎంట్రన్స్ సీన్ రాగానే ధియేటర్లు చప్పట్లు, విజిల్స్ తో మోతెక్కిపోయేవి. అలా ప్రేక్షకుల్లో తన గ్లామర్ తో ప్రకంపనలు పుట్టించింది దివ్య బారతి. మాస్ ఫార్ములా చిత్రాలకు అద్భుతమైన మసాలా లా కనిపించింది దివ్య బారతి. బొబ్బిలిరాజాలో బలపం పట్టి భామ వళ్లో పాటకు యూత్ లో రెస్పాన్స్ అసాధారణం.
1974లో ఓంప్రకాశ్ భారతి అనే ఓ ఇన్సూరెన్స్ ఆఫీసర్ కూతురుగా ముంబైలోనే పుట్టింది దివ్య భారతి. చదువులో యావరేజ్ స్టూడెంట్ అయిన దివ్య తొమ్మిదో తరగతి నాటికే సినిమా ప్రవేశానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే అవేవీ కల్సి రాలేదు. ఫైనల్ గా రామానాయుడు చేతుల్లో పడింది. బొబ్బిలిరాజా ఇమేజ్ తో తెలుగులో ఆనాటి టాప్ స్టార్స్ అందరూ దివ్య భారతితో సినిమాలు చేయడానికి సై అన్నారు. వరస హిట్స్ తో లక్కీ లెగ్ అనిపించుకుంది.
పద్నాలుగేళ్ల వయసులోనే సినిమా ప్రయత్నాలు మొదలయ్యాయి. శ్రీదేవితో పోల్చడం తనకు విపరీతంగా నచ్చేది. అయితే బాలీవుడ్ లో ఛాన్స్ ఇస్తామని వెంటపడ్డ ప్రతి ఒక్కరూ చేయిచ్చారు. పసితనం వీడలేదని కొందరు...ఆడియన్స్ కు పట్టదేమో అని ఇంకొందరూ అనుమానించి...జూహీ, తబూ అంటూ వెళ్లిపోయారు. సరిగ్గా అప్పుడే టాలీవుడ్ బ్రహ్మరథం పట్టింది. అసెంబ్లీ రౌడీ సక్సస్ తో దివ్య హాట్ కేక్ అయిపోయింది.
తెలుగు సినిమాలతో పాటు తమిళ మళయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది దివ్య. అక్కడా జయకేతనం ఎగరేసింది. దక్షిణాదిన విజయ దుంధుభి మోగిస్తున్న క్షణాల్లో...బాలీవుడ్ నుంచి ఆఫర్స్ మొదలయ్యాయి. సన్నీ డియోల్ సరసన విశ్వాత్మ లో చాన్స్ వచ్చింది. అదే టైమ్ లో తెలుగులో కూడా బిజీగా ఉంది. కోదండరామిరెడ్డి డైరక్షన్ లో వచ్చిన నందమూరి బాలకృష్ణ చిత్రం ధర్మక్షేత్రంలో హీరోయిన్ గా చేసింది.
నిజానికి ఆ టైమ్ లో టాలీవుడ్ లో పవర్ ఫుల్ హీరోయిన్స్ అవసరం చాలా ఉంది. చిరంజీవితో దివ్యభారతి చేసింది ఒక్క సినిమాయే గానీ...తన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఫాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది దివ్యభారతి. తను కూడా బాలీవుడ్ తో పాటు తెలుగుకూ తగిన ప్రాధాన్యత ఇచ్చింది.
మోహన్ బాబు కోదండరామిరెడ్డిల కాంబినేషన్ లో తెరకెక్కిన చిట్టెమ్మ మొగుడు చిత్రంలో కూడా దివ్యభారతే హీరోయిన్. మోహన్ బాబు కు జోడీగా అప్పటికే అసెంబ్లీ రౌడీ చేసి ఉంది దివ్య. దివ్య భారతి ఉంటే సినిమా సక్సస్సే అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో బలంగా ఉండేది. అయితే... చిట్టెమ్మమొగుడు కూడా బాక్సాపీసు దగ్గర ఓ మోస్తరు విజయాన్నే నమోదు చేసుకుంది.
నిజానికి బాలీవుడ్ లో కూడా నటించిన రెండు చిత్రాల్లో ఒకటి యావరేజ్ కాగా రెండోది ఫ్లాప్ అయ్యింది. అయితే దివ్య భారతి అంటే ఆడియన్స్ లో ఓ గుర్తింపు మాత్రం వచ్చింది. స్టార్ డస్ట్ కి ఇచ్చిన ఓ ఇంటర్యూలో తను ఫెయిల్యూర్స్ గురించి బాధ పడడం లేదని స్పష్టంగా చెప్పింది దివ్య. ఫ్లాప్స్ తన విజయానికి మెట్లు అని వ్యాఖ్యానించింది. డెఫినెట్ గా తను నంబర్ ఒన్ కావడం తద్యం అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించింది.
దివ్య భారతి నటించిన కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యి ఉండచ్చు. అందుకు కారణం తను కాదు. నిజానికి ఫ్లాప్ కావాల్సిన సినిమాలను తన గ్లామర్ తో రక్షించిన సందర్భాలూ ఉన్నాయి. స్టార్ గా తను మాత్రం ఫెయిల్ కాలేదు. అలా జరిగి ఉంటే ఒకే సంవత్సరం తొమ్మిది బాలీవుడ్ మూవీస్ కు తను సైన్ చేసి ఉండేది కాదు.
నిర్మాత సాజిద్ నాడియావాలా తో ప్రేమ...పెళ్లి...ఆ వెంటనే మరణం...అన్ని కూడా తన కెరీర్ ఎంత స్పీడ్ గా రేజ్ అయ్యిందో అంత స్పీడ్ గా జరిగిపోయాయి. దివ్య మరణం మీద అనేక అనుమానాలున్నాయి. వేటికీ సమాధానాలు దొరకలేదు. ప్రేక్షకుల కలలరాణి అలా వెళ్లిపోయింది. దివ్య అలా అర్ధాంతరంగా వెళ్లిపోడానికి అసలు కారణాలు తెలియక న్యూమరాలజీలనీ జాతక చక్రాలనీ ఆశ్రయించి అనునయాన్ని పొందారు ప్రేక్షకులు.
ఫిలింఫేర్ మ్యాగజైన్ టాప్ 10 హీరోయిన్స్ లో ఒకరుగా దివ్యను ప్రకటించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ కు డెబ్యూ మూవీలో దివ్యే కథానాయిక. 1992లో అన్ని టాప్ రేటెడ్ ఫిలిం మ్యాగజైన్ల కవర్ పేజీల మీదా దివ్యే రొటేట్ అయ్యేది. నో ఆర్గ్యుమెంట్స్ దివ్య టోటల్ ఇండియా గ్లామర్ సామ్రాజ్యాన్ని దున్నేసింది.
విజయాలు దివ్యకి కిక్ ఇవ్వడం మానేశాయి. అప్పుడే ఫ్లాపులూ బాధపెట్టడం మానేశాయి. జీవితం ఇంకేదో కోరుకుంటోంది. దాన్ని అందుకోవాలనే తపనే...దొరకడం లేదనే ఆవేదనే దివ్యని డిప్రెషన్ లోకి తీసుకెళ్లింది. చాలా సందర్భాల్లో తను కాస్త ఓవర్ గా బిహేవ్ చేసేది. తన చుట్టూ బొంగరంలా తిరిగిన సాజిద్ ను పెళ్లాడింది. అంతలోనే ఏమైందో...1993 ఏప్రిల్ ఐదో తేదీ..రాత్రి ముంబై తుల్ఫి టూ అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి రాలిపడిపోయింది. అంతటా నిశ్శబ్దం...ఓ గ్లామర్ కథ అలా ముగిసింది.
1993 ఏప్రిల్ ఆరోతేదీ పేపర్లలో అనేక కథనాలు...అండర్ వరల్డ్ తో ఉన్న సంబంధాలే ప్రాణం తీసాయా అన్నదగ్గర మొదలై...సాజిద్ మీద అనుమానాల దాకా బోల్డు రాతలు... తన మరణం మిస్టరీగా మిలిగిన విషయాన్ని పక్కన పెడితే...ప్రేక్షకులకు మాత్రం తీరని వేదనే మిగిలింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com