Renu Desai : ఆడాళ్లూ మీకు జోహార్లు

Renu Desai :  ఆడాళ్లూ మీకు జోహార్లు
X

ఎక్కడో అమెజాన్ అడవి తగలబడిపోతోందంటే మన సెలబ్రిటీల గుండెలు తల్లడిల్లిపోయాయి. సినిమా వాళ్ల నుంచి ఇతర సెలబ్రిటీస్ వరకూ అయ్యో పాపం అంటూ సోషల్ మీడియాస్ లో అమెజాన్ ను కాపాడమని పోస్ట్ లు పెట్టారు. అదే పెద్ద మనుషులు.. నల్లమల విషయంలో సైలెంట్ అయిపోయారు. అప్పట్లో శేఖర్ కమ్ముల మాత్రమే ఈ విషయంపై ముందుగా మాట్లాడాడు. ఇక ఇప్పుడు హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్శిటీ ప్రాంతంలో ఉన్న 400 ఎకరాల అటవీ భూములను ప్రభుత్వం అక్రమంగా(అనేది అక్కడివారి వాదన) లాగేసుకుంటోంది. కార్పోరేట్ కంపెనీలకు కట్టబెడుతోంది అంటూ విద్యార్థులతో పాటు ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు. కానీ టాలీవుడ్ నుంచి ఈ విషయంపై ఒక్క హీరో కూడా స్పందించలేదు. ఏమన్నా అంటే రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనే భయమా.. లేక ఇంకేవైనా రాజకీయ కారణాలున్నాయా అనేది తెలియదు కానీ.. ఈ అడవి జంతువుల ఆక్రందన, ఆ మూగ జీవాల అరణ్య రోదన ప్రజా క్షేత్రంలో బలంగా వెళ్లి ప్రభుత్వ నిర్ణయాల్లో మార్పులు రావాలంటే కనీసం ప్రకృతి కోసం అయినా నిలబడాలంటే సెలబ్రిటీలే స్పందించాలి. హైదరాబాద్ నగరానికి ఎంతో ఆక్సీజన్ అందిస్తోన్న అడవి ఇది. ఇప్పటికే ఆ ప్రాంతంలోని నెమళ్లు, జింకలు, దుప్పులు, లేళ్లు.. కకావికలం అయిపోతున్నాయి. అర్ధరాత్రి పూట బుల్డోజర్ల్ మోతకు భయపడి ఆర్తనాదాలు చేస్తున్నాయి.

అయితే ఈ విషయంపై ముందుగా స్పందించింది రేణూ దేశాయ్. ఒక తల్లిగా విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని ఉపసంహరించుకోవాలి అంటూ ఆమె ప్రభుత్వానికి విన్నవించుకుంది. అలాగే బుల్లితెర యాంకర్ యానిమల్ లవర్ రష్మీ గౌతమ్ సైతం ఈ అంశంపై స్పందించింది. అలాంటి ఆర్తనాదాలు ఆడవారికే అర్థం అవుతాయి అనే రీతిలో వీరు స్పందించడం చూసి చాలామంది శెభాష్ అంటున్నారు. ఆడాళ్లూ మీకు జోహార్లు అంటూ అభినందిస్తున్నారు. వీరి బాటలోనే టాప్ సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అయితే బావుంటుందేమో.

Tags

Next Story