కరోనా కనికరిస్తే 'వెండితెర' కళకళ.. 'లవ్‌స్టోరీ'తో లక్కీడేస్..
వేల వెలుగులు విరజిమ్మిన వెండితెర వెలవెలబోతోంది. రంగు రంగుల హంగులు పోయిన సినిమా థియేటర్ చిన్నబోయింది. కదిలే బొమ్మల కబుర్లను కథలు కథలుగా చెప్పే సిల్వర్ స్క్రీన్ కన్నీరు పెట్టుకుంటోంది. ఓ వైపు కరోనా వేవ్స్ కలకలం రేపుతోంటే మరోవైపు ఓటిటిల రూపంలో సినిమా థియేటర్‌కు ఉరి బిగుసుకుంటోంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ ఆగింది. మరి ఇకనైనా థియేటర్స్ ఓపెన్ అవుతాయా..? ప్రభుత్వాల నుంచి ఎగ్జిబిషన్ వ్యవస్థకు ఏమైనా ఆసరా దొరికేనా..? ఆడియన్స్ సినిమాలు చూడ్డానికి వస్తారా..? వస్తే ఎలాంటి జాగ్రత్తలు ఉంటాయి..? వెండితెర ఎదుర్కొంటోన్న సమస్యలేంటీ..? అనే పెద్ద ప్రశ్నలే ఇప్పుడు ఎగ్జిబిషన్ వ్యవస్థ ముందు కనిపిస్తున్నాయి.
ఎవరు అవునన్నా కాదన్నా.. ఏడెనిమిది దశాబ్దాలుగా భారతీయుల అతిపెద్ద వినోదం వెండితెరే. సినిమా అనేది భారతీయుల జీవన విధానంలో ఓ భాగం. అందుకే నటులను ఆరాధిస్తారు..? కథలను ప్రేమిస్తారు. సినిమా థియేటర్ ను ఓ గొప్ప వేడుకగా చూస్తారు. ఇప్పుడంటే వినోదం కోసం అనేక ఫార్మాట్స్ వచ్చాయి. ఒకప్పుడు అందరి కాలక్షేపం సినిమా థియేటరే. ఇంటిల్లిపాదీ వెళ్లి నచ్చిన సినిమా చూస్తూ పొందిన ఆనందం గుర్తు చేసుకుంటే.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పైనో స్మార్ట్ స్క్రీన్ పైనో సినిమాలు లేదా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్తున్నవారి ఆనందం అస్సలేం పనికిరాదు అంటారు. సినిమా థియేటర్ కు అంత గొప్ప స్థానం ఉంది మన జీవన విధానంలో.
టెక్నాలజీని ఎవరూ ఆపలేరు. అది పెరుగుతున్నప్పుడు అప్పటి వరకూ ఉన్న అనేక అంశాల్లో మార్పులు రాక తప్పదు. బుల్లితెర వచ్చినప్పుడు సినిమా కూడా ఇలాంటి ఇబ్బందులే పడుతుంది అనుకున్నారు. కానీ తట్టుకుని నిలబడింది. టీవీల్లో ఎన్ని సినిమాలు చూసినా వెండితెరపై చూసిన అనుభూతి రాదు. అయితే టెక్నాలజీ మరింత పెరిగింది. పైరసీ మొదలైంది. అటుపై ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలకు కొంత దూరమయ్యారు. ఇవన్నీ థియేటర్‌కు వచ్చిన సమస్యలే. ఈ పోటీలోనూ మేటిగా కాకపోయినా ధీటుగానే నిలబడింది థియేటర్. ముఖ్యంగా తెలుగు సినిమా ప్రపంచ సినిమాతో పోటీ పడుతోంది. స్టోరీ, టెక్నాలజీ, మేకింగ్ పరంగా మరో స్థాయికి ఎప్పుడో వెళ్లింది.
గతంలో వచ్చినవి సమస్యలు. కానీ ఇప్పుడు వచ్చింది విపత్తు. దీని ముందు సినిమానే కాదు.. అనేక రంగాలు కుదేలయ్యాయి. కాకపోతే కొందరు చిన్నచూపు చూసే వెండితెర మరింత ఇబ్బంది పడుతోంది. వేలమందికి ఉపాధి కల్పించే పరిశ్రమ.. వారందరి లక్ష్యానికి వేదిక అయిన వెండితెర.. వెన్ను విరిగిన చందంగా మారింది. కరోనా కారణంగా యేడాదికి పైగా సినిమా పరిశ్రమలు నానా బాధలు పడుతున్నాయి. వరుసగా వస్తోన్న వేవ్స్ తో అతలాకుతలం అవుతోంది సినిమా. ఫస్ట్ వేవ్ తర్వాత 'క్రాక్' సినిమాతో ఉత్సాహం వచ్చింది. 'ఉప్పెన'తో కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఇక అన్నీ మంచి రోజులే అనుకుని రాబోయే చిత్రాలు అంటూ రిలీజ్ డేట్స్ కూడా పోటీ పడి అనౌన్స్ చేశారు.
అన్నీ కుదిరితే వేసవి కొత్త సినిమాలతో కళకళలాడుతుంది అనుకున్నారు. బట్.. సెకండ్ వేవ్ రూపంలో థియేటర్స్ అన్నీ మళ్లీ మూతపడిపోయాయి. థియేటర్స్ మాత్రమే కాక షూటింగ్ లూ బంద్ అయ్యాయి. సెకండ్ వేవ్ తో మరోసారి అన్ని రిలీజ్ లూ ఆగిపోయాయి. ఈసారి జనంలోనే కాదు.. పరిశ్రమలో కూడా కాస్త ఎక్కువ జాగ్రత్తలే తీసుకున్నారు. పైగా వ్యాక్సిన్ వచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. నాలుగైదు అంచెల్లో విధించిన లాక్ డౌన్ ను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఎత్తేసింది. అలా వదలడంతోనే జనం ఒక్కసారిగా బయటకు వచ్చేస్తున్నారు. మరి థియేటర్స్ కు మాత్రమే ఆంక్షలు ఎందుకు అనుకున్నారు. మొత్తంగా తెలంగాణ మాత్రమే కాక.. ఇంకా కొన్ని ఆంక్షలున్న ఆంధ్రప్రదేశ్ కూడా థియేటర్స్ కు ఓకే చెబుతున్నాయి.
థియేటర్స్ ఓపెన్ చేసుకునే విధానంలో రెండు ప్రభుత్వాలూ భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చారు. కానీ ఆంధ్రలో మాత్రం 50శాతమే అంటున్నారు. ఇది పరిశ్రమకు కాస్త ఇబ్బంది కలిగించేదే. దీనికంటే ప్రధానమైన సమస్య ఆంధ్రప్రదేశ్ లో సవరించిన టికెట్ రేట్స్. గతంలో ఉన్న టికెట్ రేట్స్ ను సవరించి రూరల్, అర్బన్, సిటీ అంటూ కొత్త విధి విధానాలు రూపొందించి సగానికి సగం తగ్గించేశారు. ఇది ఆంధ్ర ప్రాంతం నుంచి అరవైశాతం షేర్ ఉన్న సినిమా పరిశ్రమకు ఓ పిడుగుపాటుగా మారింది. ఈ విషయంలో ఏపి ప్రభుత్వం పునరాలోచన చేయాలని కనీసం పాత రేట్లనైనా కొనసాగించాలని ఎగ్జిబిటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
నిజానికి ఇప్పుడు ఎగ్జిబిషన్ వ్యవస్థలో ఒకరకమైన నిస్తేజం ఉంది. నెలల తరబడి థియేటర్స్ మూతపడి ఉండడం వల్ల సింగిల్ స్క్రీన్స్ ఇంకా ఇబ్బంది పడుతున్నాయి. అందుకే ప్రభుత్వాల నుంచి వీరు కొంత రాయితీలు ఆశిస్తున్నారు. వీటిలో ప్రధానమైనది ఆంధ్రలో టికెట్ రేట్స్ పెంచడం, తెలంగాణలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే వెసులుబాటు మళ్లీ కల్పించడం వంటివి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇవే కాక కరెంట్ బిల్, మెయిన్టెనెన్స్‌కు సంబంధించిన రాయితీలను ఆశిస్తున్నారు. ఈ విషయంలో రెండు ప్రభుత్వాలూ గతంలోనే కొన్ని హామీలు ఇచ్చాయి. కానీ ఏవీ నెరవేరలేదు. జీవోలూ రాలేదు. ఈ కారణంగానే కేవలం సినిమా టికెట్స్ తో వచ్చే రెవిన్యూ మాత్రమే ఎగ్జిబిషన్ వ్యవస్థను కాపాడలేదు అనే భావన వారిలో కనిపిస్తోంది.
మొత్తంగా ఈ నెల 23నుంచి ఎలాగైనా థియేటర్స్ ప్రారంభం అవుతాయని చెబుతున్నారు. ఇప్పుడు విడుదలకు చాలా సినిమాలే ఉన్నాయి. వీటిలో సమ్మర్ రిలీజ్ లు ప్లాన్ చేసుకున్న చిత్రాల నుంచి ఈ ఆగస్ట్ లో ప్లాన్ చేసుకున్న చిత్రాల వరకూ ఉన్నాయి. ఎవరు ఉన్నా ఎన్ని సినిమాలు ఉన్నా.. ముందు థియేటర్స్ కు ఆడియన్స్ ను రప్పించే సత్తా ఉన్నవాళ్లు ముందుగా వస్తేనే.. కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఈ విషయంలో కొందరు ముందడుగు వేస్తున్నారు. మరికొందరు ఇండస్ట్రీ పెద్దలుగా చెప్పుకునేవాళ్లు ఓటిటిల వైపు వెళ్లి మళ్లీ వెనక్కి వస్తున్నారు.
ఏదేమైనా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ చూసినా థియేటర్స్ కు ఇబ్బందే. అందుకే ఈ నెల 23 నుంచి కొత్త సినిమా పోస్టర్స్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ రోజున కొన్ని చిన్న సినిమాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతి వారం జూలై 30న సత్యదేవ్ నటించిన 'తిమ్మరుసు' విడుదల ప్రకటించారు. ఇక ఆగస్ట్ నుంచి మళ్లీ థియేటర్స్ కు పాత కళ రాబోతోందనేందుకు సూచనగా ఆగస్ట్ 6న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' విడుదలవుతోంది. ఆ తర్వాత నాని 'టక్ జగదీష్' వస్తుందంటున్నారు. మరి ఈలోగా కరోనా నుంచి ఏ బ్యాడ్ న్యూస్ రాకపోతే ఇక అంతా శుభమే.. లేదంటే వెండితెర గమనం హారర్ సినిమా అవుతుందనుకోవచ్చు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com