Republic Movie Review: రిపబ్లిక్ సినిమాపై ఇలాంటి రివ్యూను ఇంకెక్కడా చదివుండరు..

Republic Movie Review: సమాజానికి తన నగ్నత్వాన్ని తనకే పబ్లిక్ గా చూపించిన నిలువుటద్దం ఈ 'రిపబ్లిక్'. దర్శకుడు దేవా కట్టా సెల్యులాయిడ్ తో 'నిగ్గదీసి అడిగాడు సిగ్గులేని జనాన్ని…అగ్గితోటి కడిగాడు సమాజ జీవచ్ఛవాన్ని'. ఏ రాజకీయ పార్టీని, ఏ నాయకుడిని, ఏ వర్గాన్ని టార్గెట్ చేయలేదు..స్వతంత్ర భారతంలో ఉందనుకుంటున్న ప్రజాస్వామ్యాన్ని లేదని రుజువులతో చూపించాడు.
తను బతుకుతున్న సినిమా మీద కంటే కూడా తనకు జన్మనిచ్చిన ఈ దేశం మీద ప్రేమ, తపన ఉన్నట్లు స్పష్టమవుతుంది మూవీ చూస్తే. వాళ్లనీ వీళ్లనీ తిట్టడం కాదు.. అలా తిట్టే సమాజంలోనే వ్యవస్థలను కబళిస్తున్న వైరస్ ఉందనే పచ్చి నిజాన్ని నగ్నంగా చూపించాడు. సమాజంలో ఒక పౌరుడిగా ఎలా బతకాలో నేర్పించిన కలెక్టర్ పాత్రలో హీరో సాయి ధరమ్ తేజ్ కనపడలేదు, వ్యవస్థలను కాపాడాలని, జీవితాన్ని పణంగా పెట్టే యువ ఐఏఎస్ అధికారి కనిపించాడు.
తను చెప్పాలనుకున్నది నిజాయితీగా, ధైర్యంగా చెప్పిన 'రిపబ్లిక్' దర్శకుడు దేవా కట్టా. సినిమాకు తెర వెనక హీరో. ఇలాంటి స్క్రిప్టు ఓకే చేయడానికి సాహసించని యువ హీరోలకు ఒక దర్శకుడిలా దారి చూపాడు హీరో తేజ్. సినిమా మీదే కాదు..సమాజం మీద ప్రేమ ఉన్నవారు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా 'రిపబ్లిక్'.
మూర్తి
ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, టీవీ5
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com