Robin Hood : రాబిన్ హుడ్ ట్రైలర్.. సిల్లీ పంచ్ లు, ఫుల్ మాస్ డోస్

Robin Hood :  రాబిన్ హుడ్ ట్రైలర్.. సిల్లీ పంచ్ లు, ఫుల్ మాస్ డోస్
X

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన సినిమా రాబిన్ హుడ్. ఈ నెల 28న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ చిత్రంలో ఆయన కూడా ఓ కేమియో రోల్ చేశాడు. ఈ సినిమా కోసం నితిన్ తో పాటు దర్శకుడు వెంకీ విపరీతమైన ప్రమోషన్స్ చేస్తున్నారు.ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని సినిమా ప్రమోషన్ కోసం వాడేస్తున్నారు. చివరికి ప్రస్తుతం ఇండియాలో సెన్సేషన్ గా ఉన్న 'గ్రోక్' కూడా వీరి ప్రమోషన్స్ హైలెట్ అని చెప్పింది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే టైటిల్ కు తగ్గట్టుగానే పెద్దోళ్లను కొట్టే ఓ దొంగ కథలా కనిపిస్తోంది. అతను రకరకాల వేషాల్లో కనిపిస్తున్నాడు. వేర్వేరు దేశాల్లోనూ దొంగతనాలు చేస్తున్నట్టు చూపించారు.ఏబి ఫార్మాసూటికల్ కంపెనీ డాటర్, ఎమ్. డి నీరా వాసుదేవ్ ఇండియాకు వస్తున్నారని ఆమెకు జడ్ ప్లస్ కేటగిరీ రక్షణ కల్పించాలని చెబుతారు. అందుకోసం సెక్యూరిటీ గార్డ్స్ ఏజెన్సీ నడుపుకునే రాజేంద్ర ప్రసాద్ ను నియమిస్తారు. ఈ టీమ్ లో నితిన్ కూడా ఉన్నాడు. మరి హీరో హీరోయిన్ ఒకే చోట చేరారు అంటే లవ్ వచ్చేస్తుంది కదా. ఇక్కడి వరకూ రొటీన్ గా సిల్లీ పంచ్ లతో సాగిన ట్రైలర్ సడెన్ గా మాస్ టర్న్ తీసుకుంది. ఓ ఏజెన్సీలో గంజాయి పండిస్తోన్న రౌడీ వద్దకు చేరుతుంది. అదే ప్లేస్ కు హీరో కూడా వెళతాడు. యధావిధిగా విలన్ కు వార్నింగ్ లు గట్రా ఇచ్చేస్తాడు. కాకపోతే ఈ విలన్ కు, హీరోకు మధ్య ఉన్న పంచాయితీ ఏంటనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

మొత్తంగా చూస్తే వెంకీ కుడుముడల ఛలో కాలంలోనే ఆగిపోయాడు అనిపిస్తోంది. అదే తరహాలో సిల్లీ పంచ్ లు,సిల్లీ సీన్స్ కనిపిస్తున్నాయి. 'ఏం చేస్తావు అంటే ఉదయం లేట్ గా లేస్తా అనడం.. జడ్ ప్లస్ కేటగిరీ అంటే కూడా తెలియని వారిని అందుకోసం నియమించడం.. ఫోర్ ఫాదర్స్ అంటే నలుగురు తండ్రులా అని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించడం.. దాని అర్థం పూర్వీకులు అని చెబితే అదో కులం కదా అనడం చూస్తుంటే రైటింగ్ ఎంత సిల్లీగా ఉందో అర్థం అవుతుంది.

కాకపోతే ట్రైలర్ సెకండ్ హాఫ్ మాత్రం మాస్ తో విజిల్స్ కొట్టించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రభాస్ ఆదిపురుష్ లో హనుమంతుడుగా నటించిన దేవ్ దత్త నాగే విలన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. శ్రీలీల ఎప్పట్లానే హుషారుగా కనిపిస్తోంది. వెంకీ ఆస్థాన హాస్య నటుడు వెన్నెల కిశోర్ తో పాటు షైన్ టామ్ చాకో కనిపిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే సిల్లీ కామెడీతో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తున్నాడీ రాబిన్ హుడ్.

Tags

Next Story