సినిమా

Shyam Singha Roy: దేవదాసీగా సాయిపల్లవి.. అసలు ఎవరీ దేవదాసీలు? ఎందుకలా మారుతారు?

Sai Pallavi: ఒకప్పుడు సమాజం దేవదాసీలను గౌరవించేది. దేవుని బిడ్డలుగా వారికి తగిన గుర్తింపు ఉండేది.

Shyam Singha Roy: దేవదాసీగా సాయిపల్లవి.. అసలు ఎవరీ దేవదాసీలు? ఎందుకలా మారుతారు?
X

'శ్యామ్ సింగరాయ్' సినిమాలో సాయిపల్లవి ఓ డిఫరెంట్ రోల్ పోషిస్తోంది.. అదే దేవదాసీ పాత్ర. దాంతో అందరికీ దేవదాసీలు అంటే ఎవరు? వాళ్లు ఎక్కడ ఉంటారు? వాళ్ల లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుంది అనే అంశాలపై అసక్తి పెరిగింది.. వాళ్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది చాలా పాతకాలం పద్దతి. ఇప్పటి తరానికి దేవదాసీల గురించి తెలిసే అవకాశం చాలా తక్కువ. కానీ సినిమాలో సాయిపల్లవి ఆ పాత్ర పోషిస్తుందనేసరికి అందరికీ వారి గురించి తెలుసుకోవాలనే ఇంట్రస్ట్ పెరిగింది.

దేవదాసీలు అంటే దేవునికి అంకితమైన స్త్రీలు. దేవతను ప్రసన్నం చేసుకునేందుకు తమ చిన్నారులను దేవాలయాలకు అంకితం చేస్తారు తల్లిదండ్రులు. చిన్నప్పుడే తమ కుమార్తెను దేవదాసీలుగా మారుస్తారు. సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగున ఉన్న వర్గానికి చెందిన బాలికలు ఈ ఆచారానికి బలవుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ దేవదాసీ వ్యవస్థను నిషేధించినా, మరికొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సంప్రదాయం ఇంకా కొనసాగడం దురదృష్టకరం.

ఒకప్పుడు సమాజం దేవదాసీలను గౌరవించేది. దేవుని బిడ్డలుగా వారికి గుర్తింపు ఉండేది. కానీ కాలక్రమంలో వారిని సెక్స్ రాకెట్‌లోకి బలవంతంగా నెట్టేస్తున్నారు. దీంతో ఆ వ్యవస్థలోకి తమ పిల్లలను పంపించడానికి ఎవరూ సాహసించడం లేదు. గ్రామంలోని సంపన్నవర్గానికి చెందిన పురుషులకు గ్రామ దేవదాసీలపై అధికారం ఉంటుంది. కానీ ఆమె ఆర్ధికంగా వారిపై ఆధారపడానికి ఇష్టపడదు. దేవదాసీలకు సంగీతం, నృత్యం వంటి కళల్లో ప్రావీణ్యం ఉంటుంది. వారు దేవాలయాలలో ఆడి పాడి.. బహుమతిగా బంగారం, భూమిని సంపాదించుకుంటారు. కొందరు దేవదాసీలు దేవునికి మాత్రమే తమ జీవితాన్ని సమర్పించుకోవాలని నిర్ణయించుకుంటారు. జీవితాంతం జీవిత భాగస్వామి లేకుండా ఉంటారు.

నిజానికి ఈ దేవదాసీ సంస్కృతి 7వ శతాబ్దంలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా చోళులు, పాండ్యుల పాలనలో దేవదాసీ వ్యవస్థ బలంగా ఉండేది. రాజమందిరంలో వారికి తగిన గౌరవ మర్యాదలు లభించేవి. పవిత్రమైన మతపరమైన ఆచారాలకు వారికి ప్రత్యేక ఆహ్వానం అందించేవారు. సామ్రాజ్యాలు అభివృద్ధి చెందినంత కాలం దేవదాసీలకు తగిన గుర్తింపు లభించేది.

ఆధునిక భారతదేశంలోని దేవదాసీలు..

ప్రస్తుతం దేవదాసీలను లైంగిక బానిసలుగా చూస్తున్నారు. భారతదేశంలోని అత్యంత వెనుకబడిన సామాజికవర్గాల వారు ఆధునిక భారతదేశంలో దేవదాసీలుగా మిగిలిపోతున్నారు. వీరు ఎక్కువగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో ఉన్నారు. వీరిని మహారాష్ట్రలో మాతంగి అని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జోగిని లేదా మాతమ్మ అని, కర్ణాటకలో దేవదాసి అని పిలుస్తారు. తల్లిదండ్రులే తమ పిల్లలని బలవంతంగా దేవదాసీలుగా మార్చడం అత్యంత విషాదం. ఎందుకంటే ఈ అమ్మాయిలు చాలా సందర్భాలలో వారి ఏకైక ఆదాయ వనరు కూడా అవుతుంది. కుటుంబ మనుగడకు మార్గం దొరుకుతుందనే ఆశతో వారిని దేవదాసీలుగా మార్చేందుకు ఏమాత్రం సంకోచించరు బాలిక తల్లిదండ్రులు.

అమ్మాయికి యుక్తవయస్సు వచ్చిన తర్వాత.. ఆమె తల్లిదండ్రులు సంఘానికి, లేదా ఊరి పెద్దలకు తెలియజేస్తారు. ఇది ఆమెను భూస్వామి లేదా ఊరి సంపన్నులు తీసుకెళ్ళడానికి సహాయపడుతుంది. ప్రతిఫలంగా పురుషులు ఆమె కుటుంబ ఆర్థిక అవసరాలను తీరుస్తారు. వారితో సంబంధం నెరిపినంత కాలం ఆ కుటుంబ పోషణ బాధ్యత వారే చూసుకుంటారు.

చట్టపరమైన చర్యలు ఏమయ్యాయి?

స్వాతంత్ర్యానికి ముందు తరువాత, ప్రభుత్వం దేవదాసీ వ్యవస్థను నిషేధిస్తూ చట్టాలను రూపొందించింది. భారతదేశం అంతటా ఈ ఆచారాన్ని నిషేధించి 20 ఏళ్లు దాటింది. అయితే, జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రకారం, 2013లో భారతదేశంలో 4,50,000 మంది దేవదాసీలు ఉన్నారని తేలింది. జస్టిస్ రఘునాథరావు నేతృత్వంలోని మరో కమిషన్ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే దాదాపు 80,000 మంది దేవదాసీలు ఉన్నారని చెప్పింది.

ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేవదాసీ కుటుంబాలకు ఈ చట్టాలు, నిషేధాల గురించి ఏ మాత్రం అవగాహన ఉండదు. ఈ కమ్యూనిటీలకు ప్రాథమిక విద్యను అందించడంతో పాటు, ఆర్థికంగా బలోపేతం చేస్తేనే తల్లిదండ్రులు తమ చిన్నారులను జోగినులుగా మార్చరు. అది జరగనంతకాలం ఇలాంటి దురాచారాలకు అడ్డుకట్ట పడదని విశ్లేషకుల అభిప్రాయం.

పదిహేనేళ్లు కూడా నిండని పసి ప్రాయంలోనే మొదటి భాగస్వామిని పొందుతారు దేవదాసీలు. అందుకే వారు చిన్న వయస్సులోనే ఎయిడ్స్ వంటి అనారోగ్య సమస్యల బారినపడతారు. అయినా ఆ వ్యవస్థ నుండి బయటపడలేరు. అణగారిన వర్గాలు, ఆర్థికంగా బలహీనులు కావడంతో సమాజం వెలివేసినా.. బ్రతుకు పోరాటం సాగించేందుకు వారు ఎంచుకున్న ఏకైక మార్గం అదే కావడం వ్యవస్థల వైఫల్యానికి అద్దం పడుతుంది.

Next Story

RELATED STORIES