Sampoorna Ramayanam: 'సంపూర్ణ రామాయణం' సినిమాకు 50 ఏళ్లు.. రెండు వారాల వరకు ఫ్లాప్ టాక్.. తరువాత..

Sampoorna Ramayanam (tv5news.in)

Sampoorna Ramayanam (tv5news.in)

Sampoorna Ramayanam: శోభన్ బాబు పేరు చెప్పగానే మనకు ముందుగా ఓ రొమాంటిక్ హీరోగానే గుర్తొస్తారు.

Sampoorna Ramayanam: మామూలుగా సినిమాల్లో దేవుడు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు ఎన్‌టీఆర్. ఈ సీనియర్ నటుడు ఎన్నో సినిమాల్లో దేవుడి పాత్రల్లో, పౌరాణిక పాత్రల్లో నటించి దేవుడంటే ఇలాగే ఉంటాడేమో అనిపించేలా చేశారు. అందుకే కొన్నాళ్ల వరకు ప్రేక్షకులు దేవుడి పాత్రలో ఎన్‌టీఆర్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేకపోయారు. కానీ 'సంపూర్ణ రామాయణం' చిత్రంతో రాముడిగా మొదటిసారి ప్రేక్షకులను పలకరించారు శోభన్ బాబు. ఈ సినిమాకు నేటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి.


శోభన్ బాబు పేరు చెప్పగానే మనకు ముందుగా ఓ రొమాంటిక్ హీరోగానే గుర్తొస్తారు. అప్పటి హీరోల్లో ఎవరికైనా లవర్ బాయ్ అనే ఇమేజ్ ఉంది అంటే చాలామంది శోభన్ బాబు పేరే చెప్తారు. అయితే అలాంటి శోభన్ బాబు ఒక్కసారిగా రాముడిగా కనిపిస్తాడు అనగానే ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అంతే కాక రొమాంటిక్ హీరో శోభన్ బాబును ఆ పాత్రలో చూడడానికి కూడా ముందుకు రాలేదు.


దర్శకుడు బాపు పౌరాణిక సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట అని పేరు సంపాదించుకున్నారు. కానీ ఆయన పౌరాణిక సినిమాల ప్రస్థానం మొదలయ్యిందే 'సంపూర్ణ రామాయణం' నుండి. ఆరుద్ర, ముళ్లపూడి రమణతో కలిసి సంపూర్ణ రామాయణాన్ని తెరకెక్కించాలి అనుకున్నారు బాపు. ఇందులో రాముడిగా నటించేందుకు ఎన్‌టీఆర్‌ను సంప్రదించగా.. అప్పటికే ఆయన 'శ్రీరామ పట్టాభిషేకం' సినిమాకు కమిట్ అయ్యి ఉండడంతో సంపూర్ణ రామాయణాన్ని రిజెక్ట్ చేశారట.


బాపు ఎలాగైనా ఈ సినిమాను తెరకెక్కించాలి అని బలంగా నిర్ణయించుకోవడంతో శోభన్ బాబును రాముడిగా తయారు చేశారు. పైగా ఈ సినిమాలో రావణాసురుడి పాత్ర చేయడం కోసం సీనియర్ నటుడు ఎస్.వి.రంగారావు ఆరు నెలలు మందు ముట్టలేదట. ఇంతా కష్టపడి సంపూర్ణ రామాయణాన్ని పూర్తి చేసిన తర్వాత విడుదలయిన రెండు రోజుల వరకు థియేటర్లలో జనమే లేరట.


రొమాంటిక్ హీరో శోభన్ బాబును రాముడిగా చూడడం ఇష్టం లేని ప్రేక్షకులు సంపూర్ణ రామాయణం సినిమా చూడడానికే ఇష్టపడలేదట. కానీ ఈ సినిమా చూసిన కొందరు బాగుంది అని చెప్పడంతో రెండు వారాల తర్వాత సంపూర్ణ రామాయణం హౌజ్ ఫుల్ షోస్‌తో రన్ అయ్యిందట. ఇప్పటికే బాపు తీసిన పౌరాణిక చిత్రాల్లో 'సంపూర్ణ రామాయణం' ఒక ఆణిముత్యం.

Tags

Next Story