Harshvardhan Rane : రిలీజ్ కంటే రీ రిలీజ్ లో అదరగొట్టిన సినిమా

కొన్ని సినిమాలంతే.. రిలీజ్ టైమ్ లో పెద్దగా అర్థం కావు. తర్వాతెప్పుడో టివిల్లోనో ఓటిటిల్లోనో చూస్తున్నప్పుడు అరె ఇంత మంచి సినిమాను ఎలా మిస్ అయ్యాం థియేటర్స్ లో అనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగులో ఆరెంజ్ మూవీపై అదే టాక్. అయితే ఓ బాలీవుడ్ మూవీ కూడా ఇదే టాక్ తో ఏకంగా రిలీజ్ టైమ్ కంటే డబుల్ వసూళ్లు సాధించి ట్రేడ్ ను తెల్లబోయేలా చేసింది. ఆ సినిమా పేరు 'సనమ్ తేరీ కసమ్'. రాధికారావు దర్శకురాలు. తెలుగులో నటుడుగా ప్రస్థానం మొదలుపెట్టి ఇక్కడ ఫెయిల్ అయ్యి బాలీవుడ్ లో ప్రయత్నిస్తోన్న హర్షవర్ధన్ రాణే ఈ చిత్రంలో హీరో. మౌరా హొకేన్ హీరోయిన్. ఇదో విషాద ప్రేమకథ.
ఓ తెలుగు అమ్మాయి, హిందీ అబ్బాయికి మధ్య సాగే కథ. హృద్యంగా సాగే కథనం, ఆకట్టుకునే పాటలు, మంచి నటన ఇవన్నీ కలిపి సినిమాను ఫీల్ గుడ్ అనేలా చేశాయి. కానీ 2016 ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రానికి ఆ టైమ్ లో కేవలం 16.03 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇదే ఫిబ్రవరిలో రీసెంట్ గా 7న విడుదల చేశారు. ఈ సారి మాత్రం సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 30.67 కోట్లు వసూలయ్యాయి. అంటే ఫస్ట్ రిలీజ్ కంటే ఆల్మోస్ట్ డబుల్. పైగా సినిమాను చూస్తూ ప్రేక్షకులు ఈ సారి తెగ ఫీలయ్యారు. ఓ కుర్రాడు సినిమాలోని ఓ సీన్ ను థియేటర్ లోనే రీ క్రియేట్ చేస్తూ చేతిలో మందు గ్లాస్ ను పగలగొట్టి రక్తం కారుతున్న చేతులతో థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఆ వీడియో కూడా వైరల్ అయింది. మొత్తంగా కొన్నిసార్లు అసలు కంటే కొసరు మేలు అంటాం కదా. అలా రిలీజ్ కంటే రీ రిలీజ్ మేలు అనేలా చేసిందీ మూవీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com