Sandeep Kishan : సందీప్ కిషన్ ఆ అర్హత ఉందా..?

ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉంటున్నా.. హిట్ అనే మాట ఎప్పుడో కాని వినిపించని హీరో సందీప్ కిషన్. తను టాలెంటెడ్ అన్న పేరుంది. కానీ విజయాలను ఇచ్చే కథలను ఎంచుకోలేడు. అప్పుడెప్పుడో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే సినిమా హిట్ అయింది. మళ్లీ రీసెంట్ గా ఊరు పేరు భైరవకోన హిట్టైంది. తమిళ్ లో రాయన్ కూడా హిట్టే. కానీ అతను హీరో కాదు. కాబట్టి అతని అకౌంట్ లోకి వెళ్లదు. ఊరుపేరు భైరవకోన కూడా యావరేజ్ మూవీ అయినా ఆ టైమ్ కు పెద్దగా ఆకట్టుకునే సినిమాలేం లేకపోవడంతో కమర్షియల్ గా వర్కవుట్ అయింది.
ప్రస్తుతం అతను త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది సందీప్ కి 30వ సినిమా కావడం విశేషం. త్రినాథరావు ధమాకా మూవీ తర్వాత చేస్తోన్న సినిమా ఇది. లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ‘మజాకా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ బావుంది. సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే భారీ మొత్తంలో డిజిటల్ రైట్స్ రూపంలో బడ్జెట్ రికవర్ అయింది. ఇప్పటి వరకూ బానే ఉంది కానీ... ఈ మూవీ పోస్టర్ లో సందీప్ కిషన్ కోసం ఒక బిరుదు వేశారు.
‘పీపుల్స్ స్టార్’ సందీప్ కిషన్ అన్నారు. ఇది చూడగానే నవ్వొస్తుందని చెప్పాలి. ఏ పీపుల్ కి స్టార్ అతను. ఎన్ని బ్లాక్ బస్టర్స్ కొట్టాడు.. ఎన్ని ఫ్యాన్ క్లబ్ లు ఉన్నాయి.. ఎంత ఓపెనింగ్స్ తెచ్చుకోగలడు. అసలే మాత్రం స్టార్డమ్ లేని సందీప్ ను పీపుల్స్ స్టార్ అనడం చూస్తే ఇది పిచ్చో వెర్రో అర్థం కావడం లేదు అనిపిస్తే తప్పేం లేదు. అందరికీ ఉన్నాయి కాబట్టి తనకూ ఓ బిరుదు కావాలనుకోవడం తప్పేం లేదు. కానీ బిరుదుకు తగ్గ అర్హత తనలో ఏముందో కూడా చూసుకోవాలి కదా. ఇప్పటికే ఈ బిరుదు ఆర్ నారాయణమూర్తికి ఉంది. అతను తీసిన సినిమాలు ఎంచుకున్న నేపథ్యాలు అందుకు సరిగ్గా సరిపోతాయి. ఈ శకంలో లేదు కానీ.. 90ల్లో నారాయణమూర్తి సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. బడ్జెట్ కు 20 -30 రెట్లకు పైగా లాభాలు తెచ్చిన సినిమాలెన్నో ఉన్నాయి. పైగా తను బహుముఖ ప్రజ్ఞాశాలి. అతన్ని పీపుల్స్ స్టార్ అంటే జనం ఆమోదించారు. ఇంకా చెబితే జనమే నారాయణమూర్తిని పీపుల్స్ స్టార్ అన్నారు.
అలాంటి ట్యాగ్ ను 30 సినిమాల్లో కనీసం 20 శాతం కూడా విజయాలు లేని సందీప్ కు ఆపాదించడం ఖచ్చితంగా వెర్రితనమే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com