Satyadev : రావు బహద్దూర్ గా సత్యదేవ్

Satyadev :  రావు బహద్దూర్ గా సత్యదేవ్
X

టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న సత్యదేవ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కాకపోతే స్టార్డమ్ మాత్రం రావడం లేదు. తను హీరోగా చేసే సినిమాలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. మరోవైపు తను హీరో మెటీరియల్ కాదు.. కాకపోతే మంచి నటుడుగా సత్తా చాటొచ్చు అంటున్నారు. అవన్నీ ఎలా ఉన్నా.. సత్యదేవ్ నుంచి అటు క్యారెక్టర్స్, ఇటు హీరోగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా కింగ్ డమ్ లో చాలా కీలకమైన పాత్రలో సత్తా చాటాడు. అరేబియా కడలి అనే వెబ్ సిరీస్ త్వరలోనే వస్తోంది. తాజాగా అతను ప్రధాన పాత్రలో మరో మూవీ అనౌన్స్ అయింది. ఈ మూవీ పేరు ‘రావు బహద్దూర్’.

సత్యదేవ్ తో గతంలో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాతో ఆకట్టుకున్న వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకుడు. వెంకటేష్ మొదట కేరాఫ్ కంచరపాలెంతో మెప్పించాడు. కాకపోతే రెగ్యులర్ గా సినిమాలు డైరెక్ట్ చేయడం లేదు. కొంత గ్యాప్ తర్వాత ఈ మూవీ చేస్తున్నాడు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రాన్ని మహేష్ బాబు బ్యానర్ ప్రెజెంట్ చేస్తోంది. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ మూవీస్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ తో పాటు సత్యదేవ్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

సత్యదేవ్ మేకోవర్ బావుంది. టైటిల్ కు తగ్గట్టుగా కాస్త ఓల్డేజ్ గెటప్ తో ఉన్నాడు. దీనికి ‘అనుమానం పెనుభూతం’అనే క్యాప్షన్ పెట్టారు. మరి ఆ అనుమానాల చుట్టూ తిరిగే కంటెంట్ అయి ఉంటుంది. ఎవరు ఎవరిని అనుమానించారు.. ఎందుకు అనుమానించారు.. తద్వారా ఏర్పడిన పరిణామాలేంటీ అనేది సినిమాలో చూడాల్సి ఉంటుందేమో. గట్టి బ్యానర్స్ ఉన్నాయి కాబట్టి సత్యదేవ్ కు ఈ రావు బహద్దూర్ అయినా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

Tags

Next Story