Karnataka: మార్చి 25 వరకు అన్ని థియేటర్లలో అదే చిత్రం.. ఖాళీగా పదిహేడో నెంబర్ సీటు

Karnataka: మార్చి 25 వరకు అన్ని థియేటర్లలో అదే చిత్రం.. ఖాళీగా పదిహేడో నెంబర్ సీటు
Karnataka: మార్చి 17 నుంచి మార్చి 20 వరకు పునీత్ అభిమానుల సంఘం సభ్యులు ప్రజలకు ఉచితంగా భోజనం పంపిణీ చేయనున్నారు.

Karnataka: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం 'జేమ్స్' ఈ రోజు థియేటర్లలలో సందడి చేసిన కారణంగా అభిమానులు బాణసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బిగ్గరగా అరుస్తూ చీర్స్ చెప్పుకున్నారు. ఈ రోజు పునీత్ పుట్టినరోజు కూడా కావడంతో అభిమానులు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. మార్చి 25 వరకు కర్ణాటకలో జేమ్స్ సినిమా మాత్రమే ప్రదర్శించబడుతుందని శాండల్ వుడ్ చిత్ర పరిశ్రమ పేర్కొంది.

పునీత్ చివరి చిత్రం జేమ్స్‌ను చూడటానికి ఉదయాన్నే అభిమానులు పెద్దఎత్తున థియేటర్లకు తరలిరావడంతో ఈరోజు కర్ణాటక అంతటా సందడి వాతావరణం నెలకొంది. కన్నడ ప్రజలు పునీత్ ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

తమ నటుడిని చివరిసారిగా వెండితెరపై చూసిన పలువురు అభిమానులు కంటతడి పెట్టారు. పునీత్ ని ముద్దుగా అప్పూ అని పిలుచుకుంటారు అభిమానులు. రాష్ట్రవ్యాప్తంగా పునీత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. వివిధ థియేటర్లలో అతడి మునుపటి చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు ఉంచారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మార్చి 17 నుంచి మార్చి 20 వరకు పునీత్ అభిమానుల సంఘం సభ్యులు ప్రజలకు ఉచితంగా భోజనం పంపిణీ చేయనున్నారు.

అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా రక్తదానం, అన్నదానం, నేత్రదాన శిబిరాలు నిర్వహించారు. చాలా థియేటర్లు మొదటి షో సమయంలో సీటు నెంబరు 17ను ఖాళీగా ఉంచుతున్నాయి., పునీత్ తన సినిమాలను ఆ సీటు నుంచే చూస్తారని చెబుతున్నారు.

బెంగళూరు వీరభద్రేశ్వర థియేటర్‌లో ఉదయం 6 గంటలకు షోకు హాజరైన వారికి అభిమానులు కాఫీ, బిస్కెట్లు అందించారు. ఉదయం 10 గంటల షో చూసిన అభిమానులకు దోసెలు, మధ్యాహ్నం 1 గంటకు చూసే వారికి చికెన్ బిర్యానీ అందిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు సమోసాలు, రాత్రి 7 గంటలకు గోబీ మంచూరియా అందిస్తున్నారు.

అభిమానులే కాదు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నలుమూలల నుండి ప్రముఖులు పునీత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మోహన్‌లాల్ నుండి వరుణ్ తేజ్ వరకు చాలా మంది ప్రముఖులు పునీత్ రాజ్‌కుమార్ కు ట్విట్టర్ ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు.

'వి మిస్ యూ అప్పూ,' 'లవ్ యూ అప్పూ,' 'హ్యాపీ బర్త్ డే అప్పూ' వంటి నినాదాలతో థియేటర్‌లంతా ప్రతిధ్వనిస్తుండగా, అప్పును చూస్తున్నప్పుడు అభిమానులు కంటతడిపెట్టారు.

జేమ్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4000 స్క్రీన్లలో విడుదలైంది. ఇది పునీత్ రాజ్‌కుమార్ కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచింది. జేమ్స్ లో పునీత్ ఇద్దరు అన్నలు, శివరాజ్‌కుమార్, రాఘవేంద్రలు అతిధి పాత్రల్లో కనిపిస్తారు. చేతన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీకాంత్, ఆర్. శరత్‌కుమార్, అను ప్రభాకర్, ఆదిత్య మీనన్ లు కీలక పాత్రలు పోషించారు. పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళిగా మార్చి 25 వరకు కర్ణాటకలో ప్రదర్శించబడే ఏకైక చిత్రం జేమ్స్.

Tags

Read MoreRead Less
Next Story