Sekhar Kammula : గోదావరి మళ్లీ వస్తోంది

సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ గా తిరుగులేని పేరుతో పాటు విజయాలూ అందుకున్నాడు శేఖర్ కమ్ముల. ఆ క్రమంలో అతను అందించిన మరో అందమైన సినిమా ‘గోదావరి’. సుమంత్, కమలిని ముఖర్జీ జంటగా నటించిన ఈ మూవీని ఓ మాస్టర్ పీస్ అనొచ్చు. ఏ సినిమా కథైనా, కథనమైనా ప్రేక్షకులను అందులో లీనం చేయాలి. అప్పుడే అది గొప్ప సినిమా అవుతుంది. అలా చూస్తే గోదావరి మూవీ చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు కూడా ఆ నావలో విహారం చేస్తుంటారు. థియేటర్స్ నుంచే నదీ ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. అంద గొప్ప కథనంతో మెస్మరైజ్ చేశాడు శేఖర్ కమ్ముల. ప్రధాన పాత్రలు సైతం పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపించుకోవడం.. ఇతరత్రా హడావిడీ లేకుండానే హాయిగా సాగే సినిమాను అందించాడు.
కథగా చూస్తే .. తనదైన సంపాదనతోనే బ్రతకాలి.. ఎవరి సాయం తీసుకోకూడదు అనుకున్న ఆధునిక వ్యక్తిత్వం ఉన్న యువతి.. సమాజం కోసం ఏదో చేయాలని తపిస్తూ.. తను ప్రేమించిన అమ్మాయి కాదని వెళ్లినా మెచ్యూర్డ్ గా స్వీకరించే కుర్రాడు.. బావను ప్రేమించినా.. పెద్దలు చెప్పిన మాటలు విని మరో పెద్ద ఉద్యోగం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుని తర్వాత బావ వ్యక్తిత్వంతో కంపేర్ చేస్తే అతను గొప్పగా లేడని మళ్లీ బావనే కోరుకునే కన్ఫ్యూజ్డ్ మనస్తత్వం ఉన్న అమ్మాయి. వీళ్లంతా కలిసి ఆమె పెళ్లికే రాజమండ్రి నుంచి భద్రచాలం ప్రయాణం కావడం.. ఆ ప్రయాణంలో సాగే మెచ్యూర్డ్ కుర్రాడు, ఆధునిక భావాలున్న అమ్మాయికి నచ్చడం.. అపార్థాలు, అలకలు, ఆనందాలు, కాసిని కన్నీళ్లు.. వెరసి ఓ గొప్ప సినిమా చూసిన అనుభూతితో శుభం కార్డ్ పడటం.. ఇదీ సినిమా.ఈ చిత్రానికి కేఎమ్ రాధాకృష్ణన్ అందించిన సంగీతం ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ప్రతి పాటా గోదావరిని స్వరఝరీలో ముంచెత్తింది.
ఇక 2006 మే 19న విడుదలైన ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయబోతున్నారు. యస్.. ఎప్పుడు చూసినా బోర్ కొట్టిన స్వచ్ఛమైన గోదావరి ప్రవాహం లాంటి ఈ మూవీని మార్చి 1న రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం రీ రిలీజ్ లో ఇలాంటి సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. గోదావరి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో.. మంచి అప్లాజ్ రావొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com