నటుడు చంద్రమోహన్ ఇక లేరు..

నటుడు చంద్రమోహన్ ఇక లేరు..
చంద్రమోహన్ గుండె సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ప్రముఖ నటుడు మల్లంపల్లి చంద్రమోహన్ ఈరోజు కన్నుమూశారు. ఆయనకు 82 ఏళ్లు. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం 9.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ గుండె సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతున్నారు. అనేక నంది అవార్డులను గెలుచుకున్న నటుడు.

1966లో రంగుల రాట్నం సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి నటీమణులతో నటించారు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన హీరోయిన్ చంద్రమోహన్ తో నటిస్తే తమ సినిమా కెరీర్ బావుంటుందని నమ్మేవారు. ఏ హీరోయిన్ తో నటించినా వారికి సరిజోడీగా ఉండేవారు చంద్రమోహన్.

చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ప్రముఖ సినీ నిర్మాత కె విశ్వనాథ్ కు చంద్రమోహన్ బంధువు. చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం అంటే నవంబర్ 13వ తేదీన నిర్వహించనున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి హఠాన్మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

1943 మే 23న జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు చంద్రశేఖరరావు మల్లంపల్లి. ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామం ఆయన స్వస్థలం.

చంద్ర మోహన్ 'పదహారేళ్ల వయసు'లో తన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు (1979) గెలుచుకున్నారు. అతను 1987లో చందమామ రావే చిత్రానికి నంది అవార్డును గెలుచుకున్నారు. అతనొక్కడే చిత్రానికి సహాయ నటుడిగా మరో నంది అవార్డును కూడా గెలుచుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించారు. చంద్రమోహన్ చివరి సినిమా ఆక్సిజన్.

Tags

Read MoreRead Less
Next Story