Shah Rukh Khan : షారూఖ్, దీపికలకు ముందస్తు బెయిల్. ఆ కేసులో బిగ్ రిలీఫ్.

హ్యుందాయ్ కార్ల బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, నటి దీపికా పదుకొణె లకు రాజస్థాన్ హైకోర్టులో ఊరట లభించింది. భరత్పూర్ ప్రాంతానికి చెందిన ఒక న్యాయవాది దాఖలు చేసిన కేసులో వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ కేసులో మరో ఆరుగురికి కూడా బెయిల్ లభించింది.
భరత్పూర్‌కు చెందిన అడ్వకట్ కీర్తి సింగ్, తాను కొనుగోలు చేసిన హ్యుందాయ్ కారులో కొన్ని లోపాలు ఉన్నాయని ఆరోపించారు. బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న షారూఖ్, దీపికలను చూసి తాను ఆ కారు కొన్నానని, లోపాలున్న వస్తువును ప్రచారం చేయడం ద్వారా వారు వినియోగదారులను తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా...దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. తాజాగా ఈ వ్యవహారం పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అడ్వికేట్ కీర్తి సింగ్. ఈ మేరకు ధర్మాసనం విచారణ చేపట్టింది.
సీనియర్ అడ్వకట్ కపిల్ సిబాల షారుక్ ఖాన్ తరపున వాదనలు వినిపించారు. ఈ కేసుతో తన క్లయింట్‌కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని, కారు తయారీలో ఉన్న లోపాలకు ఆయన బాధ్యత వహించరని తెలిపారు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ అనేది వస్తువుల తయారీ ప్రమాణాలకు బాధ్యత వహించదని ఆయన కోర్టుకు వివరించారు. అదేవిధంగా, దీపికా పదుకొణె తరపున అడ్వకేట్ మాధవ్ మిశ్రా వాదించారు. కార్ల ఉత్పత్తి, నాణ్యత నియంత్రణలో తన క్లయింట్‌కు ఎలాంటి పాత్ర లేదని పేర్కొన్నారు. బ్రాండ్ అంబాసిడర్ల ప్రకటనలు, వినియోగదారులను తప్పుదారి పట్టించాయని కీర్తి సింగ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణెతో పాటు మరో ఆరుగురిపై నమోదైన ఎఫ్ఐఆర్‌పై స్టే విధించింది. ఈ కేసులో వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. అనంతరం కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com