Shyam Singha Roy Review: పునర్జన్మల కథగా 'శ్యామ్ సింగరాయ్'.. స్క్రీన్ ప్లేతో దర్శకుడి మ్యాజిక్..

Shyam Singha Roy Review: నాని సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్సెస్ లో మంచి క్రేజ్ ఉంటుంది. నేచురల్ స్టార్ గా తనకంటూ ఓ రూట్ క్రియేట్ చేసుకున్నాడు. కాకపోతే కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అయినా కంటిన్యూస్ గా మూవీస్ చేస్తోన్న నాని క్రిస్మస్ సందర్బంగా శ్యామ్ సింగరాయ్ తో వచ్చాడు. అతని కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఇంతకు ముందు ది ఎండ్, టాక్సీవాలా వంటి చిత్రాలతో ఆకట్టుకున్న రాహుల్ సంకృత్యన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ :
వాసుదేవ్(నాని) దర్శకుడు కావాలని ప్రయత్నాల్లో ఉంటాడు. ముందు ఓ షార్ట్ ఫిల్మ్ తీసి మెప్పిస్తే సినిమా ఇస్తానని ఓ నిర్మాత చెబుతాడు. ఇందుకోసం తను రాసుకున్న వర్ణం అనే షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటాడు. ఇందులో ప్రధాన పాత్రగా కీర్తి(కృతిశెట్టి)కి ఇష్టం లేకున్నా ఒప్పిస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. షార్ట్ ఫిల్మ్ పూర్తి చేసి నిర్మాతను మెప్పించి సినిమా చేయబోతోన్న టైమ్ లో కీర్తి .. వాసును అపార్థం చేసుకుని విడిపోతుంది. వాసు చేసిన సినిమా సూపర్ హిట్ అవుతుంది. అదే చిత్రాన్ని బాలీవుడ్ లోనూ చేయాలనుకుని అక్కడి నిర్మాతలు వాసునే దర్శకుడుగా ఎంచుకుంటారు. ఆ విషయాన్ని చెబుతూ.. ప్రెస్ మీట్ పెడితే.. అదే వేదికపై అనూహ్యంగా పోలీస్ లు వాసును శ్యామ్ సింగరాయ్ రాసిన కథను కాపీ కొట్టాడంటూ అరెస్ట్ చేస్తారు. విషయం కోర్ట్ కు వెళుతుంది. మరి వాసు ఆ కథను కాపీ కొట్టాడా..? అతనికీ పిల్లలు లేని శ్యామ్ సింగరాయ్ కి సంబంధం ఏంటీ..? వాసు తను కథను కాపీ కొట్టలేదని ఎలా నిరూపించుకున్నాడు అనేది శ్యామ్ సింగరాయ్ గా వాసు చెప్పే కథ.
విశ్లేషణ :
సింపుల్ గా ఒక్క ముక్కలో చెబితే శ్యామ్ సింగరాయ్ పునర్జన్మల కథ. ఈ నేపథ్యంలో మనకు చాలా సినిమాలే వచ్చాయి. తెలుగులోనూ మూగమనసులు నుంచి జానకి రాముడు, మగధీర వంటి సూపర్ హిట్ చిత్రాలు ఎన్నో చూశాం. అయినా శ్యామ్ సింగరాయ్ కథ కొంచెం కొత్తగానే ఉంటుంది. ముఖ్యంగా ఎంచుకున్న నేపథ్యాలు భిన్నమైనవి కావడంతో ప్రేక్షకులు కూడా కొత్తదనం ఫీలవుతారు.
భారత్ లో అప్పుడప్పుడే నక్సలిజం ప్రాణం పోసుకుంటోన్న వెస్ట్ బెంగాల్ నేపథ్యం.. దానికి సామాజిక మార్పును కాంక్షించే ఆలోచనాత్మక రచనా సృజన కలిగిన శ్యామ్ సింగరాయ్ అగ్రెసివ్ నెస్.. ఇవన్నీ మనకు సరికొత్తగా అనిపిస్తాయి. ముఖ్యంగా ఆ కాలంలో దేవదాసీ వ్యవస్థపై శ్యామ్ సింగరాయ్ సాగించిన పోరాటం.. వారికి కలిగించిన విముక్తి, ఆశ్రయం అన్నీ విప్లవాత్మకంగా కనిపిస్తాయి.
అలాంటి శ్యామ్ సింగరాయ్ అనూహ్యంగా సొంత అన్నల చేతే చంపించబడతాడు. దీనికి ఆ కాలపు కుల, మత ఛాందసవాదం ఒకటి బలంగా చూపించగలిగాడు దర్శకుడు. పైగా కన్విన్సింగ్ గా రాసుకున్న కథనం మెప్పిస్తుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో కథనం మరీ నెమ్మదిగా సాగుతుంది. కొన్ని చోట్ల మరీ నీరసంగా నడిపించాడు.
అలాగే శ్యామ్ సింగరాయ్ ని పవర్ ఫుల్ గా ఇంటర్ డ్యూస్ చేసిన దర్శకుడు.. తర్వాత ఆ పాత్రను డల్ చేయడంతో కథ గాడి తప్పుతున్నట్టు అనిపిస్తుంది. కానీ దేవదాసీని ప్రేమించడం.. ఆమె కోసం ఆ కాలపు ఈ వ్యవస్థను స్వార్థానికి వాడుకుంటోన్న మత గురువును చంపే సీన్ బావుంది. ఈ ఫైట్ కూడా నానికి తగ్గట్టుగా బాగా కంపోజ్ చేశారు.
ఇక మొదటి సగంలో కథలో మరీ కొత్తదనం ఏం కనిపించదు. షార్ట్ ఫిల్మ్ నుంచి వెండితెర అవకాశాన్ని అందుకునే హీరో పాత్ర, కథనం సోసోగా అనిపించినా.. ఇంటర్వెల్ కు ముందు అద్భుతమైన లాక్ వేశాడు దర్శకుడు. ఆ లాక్ ను విప్పుతూ కోర్ట్ రూమ్ డ్రామాగా పండించిన కథనం అంతా ఆకట్టుకుంటుంది.. ఆశ్చర్యపరుస్తుంది.
రెండు భిన్నమైన పాత్రల్లో నాని నటన ఎప్పట్లానే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా శ్యామ్ సింగరాయ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. కొన్ని చోట్ల రెగ్యులర్ నానిలా కనిపించినా.. మళ్లీ వెంటనే సర్ధుకుంటాడు. నాని తర్వాత సినిమాలో అత్యంత బలమైన పాత్రగా సాయిపల్లవి కనిపిస్తుంది. దేవదాసిగా తన నటన నెక్ట్స్ లెవల్లో ఉందంటే అతిశయోక్తి కాదు.
తన కెరీర్ లో బెస్ట్ రోల్స్ లో ఒకటిగా ఇదీ నిలిచిపోతుంది. కృతిశెట్టి రెగ్యులర్ పాత్రే. తన నటన ఇంకా ఇంప్రూవ్ కాలేదు. తర్వాత అభినవ్ గోమటం, లాయర్ పాత్రలో మడోనా సెబాస్టియన్ పాత్రలు బావున్నాయి. వాళ్లూ బాగా నటించారు. కొన్ని క్రూసియల్ రోల్స్ లో ప్రముఖ బెంగాలీ నటుల్నే తీసుకున్నారు. అది కూడా సహజత్వాన్ని తెచ్చింది. మొత్తంగా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో శ్యామ్ సింగరాయ్ ప్రత్యేకమైన కథగా ఆకట్టుకుంటుంది.
సినిమాకు సంబంధించి నిర్మాణ విలువలను మెచ్చుకుని తీరాల్సిందే. ముఖ్యంగా ఆర్ట్ వర్క్ బావుంది. 1970ల నాటి కోల్ కతాను రీ క్రియేట్ చేసేందుకు బాగా కష్టపడ్డారు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ పరంగా ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బావుండేది. పాటలు సిట్యుయేషనల్ గానే ఉన్నాయి. ఇక దేవదాసీలుగా నవరాత్రుల్లో వాళ్లు చేసిన డ్యాన్స్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. మాటలు ఓకే. దర్శకత్వ పరంగా రాహుల్ కు ఇది ఛాలెంజింగ్ వర్క్ అయినా మెప్పించాడు. ఓ సీనియర్ డైరెక్టర్ స్థాయిలో చాలా విషయాలు డీల్ చేశాడు. ఓవరాల్ గా శ్యామ్ సింగరాయ్ వీకెండ్ కు మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది.
తారాగణం : నాని, సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ
సంగీతం : మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ : సాను జాన్ వర్ఘిస్
కథా రచన : జంగా సత్యదేవ్
నిర్మాతలు : వెంకట్ బోయినపల్లి,
దర్శకత్వం : రాహుల్ సంకృత్యన్
- బాబురావు. కామళ్ల
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com