Siddu Jonnalagadda: డిజె టిల్లు.. మల్కాజ్‌గిరి ఏరియా హీరో..

Siddu Jonnalagadda: రచయితకైనా, సినిమా డైరెక్టర్‌కి అయినా కొత్తగా కథలు ఎక్కడి నుంచి వస్తాయి. రోజూ చూసే సంఘటనలు, చుట్టూ ఉన్న పరిస్థితులే కథగా మారతాయి. సిద్దార్థ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న డిజె టిల్లు కథ కూడా అదే. మాల్కాజ్‌గిరి ఏరియాలో నివస్తున్న సిద్ధుకి విభిన్న మనస్తత్వాలున్న యువకులు తారసపడ్డారట.. వాళ్లను చూసే కథ రాసుకున్నానని చెబుతున్నాడు..
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. విమల్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది.. డిజె టిల్లుకి సంబంధించిన విశేషాలను విలేకరులతో పంచుకున్నాడు సిద్దు. హీరోనే కాదు.. కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణల్లోనూ సిద్ధూ పాత్ర ఉంది.
ప్రేమకథకు, ఓ చిన్న క్రైమ్ అంశాన్ని జోడించి చిత్రాన్ని తెరకెక్కించామని చెబుతున్నాడు. మల్కాజ్‌గిరిలో నివసిస్తున్న యువకులు తాగితే ఒకలా మాట్లాడతారు, మాములుగా ఉంటే ఒకలా మాట్లాడతారు.. వాళ్లకంటూ ఓ ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది.. డ్రెస్సింగ్ సెన్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది.
చేతిలో డబ్బులు లేకపోయినా అందరిలో ఓ స్వచ్ఛత ఉంటుంది. ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉంటారు.. వాళ్లే డిజె కథకు మూలం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటే దీనికి సీక్వెల్ కూడా తీస్తామంటున్నాడు సిద్ధు. ప్రముఖ సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చినా వద్దనుకున్నాడు.. ఉదయం నుంచి సాయింత్రం దాకా ఒకే దగ్గర కూర్చుని పని చేయడం అంటే సిద్ధూకి అస్సలు నచ్చదు. నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వచ్చాడట.
సిద్ధూ స్వతహాగా రచయిత కాకపోయినా అవకాశాలు రాక, ఏం చేయాలో తెలియక.. తన కథలు తానే రాసుకోవడం మొదలు పెట్టాడట. ప్రస్తుతం అతడు చేస్తున్న సినిమాలకు వేరు వేరు రచయితలు కథ, సంభాషణలు అందిస్తున్నారు. ఎప్పుడైనా తనను బాగా కదిలించే సంఘటన ఎదురుపడితే అప్పుడు మళ్లీ కథ రాస్తానంటున్నాడీ హైదరాబాదీ కుర్రాడు. ఇప్పటికే గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీలాతో ప్రేక్షకుల్ని మెప్పించిన సిద్ధు మరోసారి డిజె టిల్లుతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com