Siddu : జాక్ తో సిద్ధు జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొట్టాడా .. బోల్తా పడ్డాడా

Siddu  :  జాక్ తో సిద్ధు జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొట్టాడా .. బోల్తా పడ్డాడా
X

రివ్యూ : జాక్

ఆర్టిస్ట్స్ : సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ, రవి ప్రకాష్ తదితరులు

ఎడిటర్ : నవీన్ నూలి

సినిమాటోగ్రఫీ : విజయ్ కే చక్రవర్తి

సంగీతం : శ్యామ్ సిఎస్

నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్

దర్శకత్వం : బొమ్మరిల్లు భాస్కర్

ఏళ్లతరబడి ఇండస్ట్రీలో ఉన్నా.. డిజే టిల్లుతో ఓవర్ నైట్ తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆ క్రేజ్ ను వెంటనే డిజే టిల్లు స్క్వేర్ తో మరోసారి క్యాష్ చేసుకున్నాడు. ఈ మూవీ ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత వచ్చిన సినిమా జాక్. ఈ గురువారం విడుదలైన జాక్ ను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశాడు. బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్. మరి ఈ సినిమా ఎలా ఉందనేది చూద్దాం.

కథ :

పాబ్లో నెరూడా అలియాస్ జాక్ ( సిద్ధు) ఎలాగైనా ‘రా’ ఏజెన్సీలో జాయిన్ కావాలని ప్రయత్నిస్తుంటాడు. ఇంటర్వ్యూ అయిపోగానే వెంటనే రంగంలోకి దిగి సొంతంగా ఓ ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆయుధాలున్న ఓ కంటెయినర్ ఇండియాకు తెచ్చి నాలుగు ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించాలని కొందరు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ ను ఒరిజినల్ ‘రా’ టీమ్ కంటే ముందే హ్యాక్ చేసి తనే ఓ ఉగ్రవాదిని పట్టుకుంటాడు జాక్. ఈ క్రమంలో మరో ఉగ్రవాది కోసం వెళ్లి రా చీఫ్ మనోజ్ ను కూడా కిడ్నాప్ చేస్తాడు. మరోవైపు తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలియక తెలుసుకోవడం కోసం ఓ డిటెక్టివ్ ఏజెన్సీని అప్రోచ్ అవుతాడు అతని తండ్రి ( సీనియర్ నరేష్). ఆ డిటెక్టివ్ ఏజెంట్ కూతురు అప్షాన్ బేగమ్ భానుమతిగా జాక్ కు పరిచయం అవుతుంది. మరి అతనేం చేస్తున్నాడో అప్షాన్ తెలుసుకుందా.. ? మనోజ్ ను ఎవరైనా విడిపించారా..? జాక్ అనుకున్నట్టుగా రా ఏజెంట్ గా మారాడా లేదా అనేది మిగతా కథ.

ఎలా ఉంది..?

కొన్ని కథలు ఎంత సీరియస్ గా ఉంటే అంత ఇష్టపడతారు ప్రేక్షకులు. అలాంటి కథల్లో దేశాన్ని కాపాడేందుకు ప్రాణాలు కూడా ఇచ్చే ఏజెంట్స్, ఆర్మీవి ప్రధానంగా కనిపిస్తాయి. ఈ కథలను కామెడీ చేస్తే ఆడియన్స్ కు నచ్చదు. ఈ విషయం తెలియక దర్శకుడు భాస్కర్ జాక్ కథను రాసుకున్నాడో, తెలిసీ రాసుకున్నాడో కానీ.. జాక్ చూస్తున్నంత సేపూ కానిస్టేబుల్ ఉద్యోగం(అలాగని ఇది చిన్నది అనడం లేదు) కోసం చేసే ప్రయత్నంలా ఉంటుంది తప్ప రా ఏజెన్సీకి ఉంటే సీక్రెసీ కానీ, ఇంటెన్సిటీ కానీ, ఇంటెగ్రిటీ కానీ అస్సలు కనిపించదు. అదేమంటే హీరో క్యారెక్టరైజేషన్ అంతా జాలీగా ఉంటుంది.. ఓ ఎగ్జైట్మెంట్ ఉంటేనే అతను వర్క్ చేస్తాడు అనేలా అతని పాత్రను మలిచారు. అతని పాత్ర వరకూ ఓకే. కానీ ఉద్యోగం వేరు కదా. పైగా అతనికి అన్నీ తెలుసు.. కానీ ట్రెయినింగ్ ఇస్తే నేర్చుకోలేడు అంటూ ఓ చైల్డ్ హుడ్ ఫ్లాష్ బ్యాక్. అందులో అతని తల్లి ముంబై ఉగ్రదాడుల్లో చనిపోవడం అనే సింపతీ కార్డ్ ప్లే చేయాలని చూశారు. బట్ ఇది సిల్లీగా ఉంది. అతనికి కోచింగ్ లు ఇప్పిస్తూ హైదరాబాద్ లో ఉండే ఫ్యామిలీ.. సడెన్ గా ముంబై వెళ్లడం ఏంటో.. అతని తల్లి చనిపోవడం ఏంటో అర్థం కాదు.

ఇక ప్రేమకథ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అమ్మాయిని చీరలో చూడగానే హీరో పడిపోతాడు. పడిపోగానే ముద్దు అడిగేస్తాడు. ఓ డిటెక్టివ్ అయిన తను అయిష్టంగా ముద్దు పెట్టేస్తుంది. ఈ క్రమంలో వచ్చే ఓ మాంటేజ్ సాంగ్ మాత్రం చాలా బావుంది. సెకండ్ హాఫ కథ నేపాల్ లో సాగుతుంది. మనకు రా ఏజెంట్స్ అనగానే కనిపించే సీరియస్ నెస్ ఈ సినిమాలో అస్సలే మాత్రం కనిపించదు. పైగా హీరోకు అన్నీ అనుకూలంగానే ఉంటాయి. ప్రతిదీ కలిసొస్తుంది. దీంతో ఎక్కడా ఓ ఇంటెన్సిటీ ఉన్న మూవీ చూస్తున్నాం అన్న భావన కలగదు.

అలాగని కామెడీగా ఉందా అంటే అక్కడక్కడా సిద్ధు తరహా కామెడీ కనిపిస్తుంది. కానీ ఇది డిజే టిల్లుకు ఎక్స్ టెన్షన్ క్యారెక్టర్ లా ఉంది తప్ప కొత్తగా కనిపించదు. అందుకే అక్కడక్కడా జాక్ చూస్తున్నామా.. డిజే టిల్లు 3 చూస్తున్నామా అనే భావన కలిగితే ఆశ్చర్యం ఏం లేదు. లాజిక్ లు వెదక్కుండా, బుర్రకు పని చెప్పకుండా కామ్ గా చూస్తే సినిమా కొంత వరకూ ఎంటర్టైన్ చేస్తుంది. కానీ కథ, సీరియస్ నెస్ అంటూ వెళితే తలబొప్పి కడుతుంది.

నటన పరంగా సిద్ధు జొన్నలగడ్డకు ఇది డిజే టిల్లుకు ఎక్స్ టెన్షన్ లాంటి పాత్ర. అలవోకగా ‘డైలాగులు చెప్పుకుంటూ’ పోయాడు. ఎమోషన్ సీన్స్ లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. వైష్ణవి చైతన్యకు మంచి పాత్రే. తనూ బాగా చేసింది. ప్రకాష్ రాజ్ కు ఇలాంటి పాత్రలు ఎన్ని చేశాడో కూడా గుర్తుండి ఉండదు. అంత రొటీన్ రోల్. నరేష్, బ్రహ్మాజీ, రవి ప్రకాష్ లాంటి వాళ్లు ఉన్నారంటే ఉన్నారు అంతే.

టెక్నికల్ గా శ్యామ్ సిఎస్ మ్యూజిక్ బావుంది. పాటలు ఆకట్టుకున్నాయి. నేపథ్య సంగీతంతో అదరగొట్టాడు. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. డైలాగ్స్ ఓకే. దర్శకుడుగా బొమ్మరిల్లు భాస్కర్ రాసుకున్న కథేనా కాదా అనే అనుమానం చివర్లో కలిగితే ఆశ్చర్యం ఏం లేదు. అతని మార్క్ మేకింగ్, సెన్సిబుల్ రైటింగ్ అంటూ ఏం కనిపించలేదు. పోనీ కొత్తగా ట్రై చేశాడు అనుకుంటే ఇందులో రా ఏజెన్సీని అపహాస్యం చేయడం తప్ప కొత్తగా చేసిందేం లేదు.

ఫైనల్ గా : లాజిక్ లు వదిలేస్తేనే.. లేదంటే క్రాక్ తప్పదు

రేటింగ్ : 2.25/5

- బాబురావు కామళ్ల

Tags

Next Story