P Susheela: తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సంగీతం.. 50 వేల పాటలతో రికార్డ్..

P Susheela (tv5news.in)

P Susheela (tv5news.in)

P Susheela: 1952లో విడుదయిన తమిళ సినిమా ‘పెట్రా థాయ్’ చిత్రం ద్వారా రేడియో నుండి వెండితెరవైపు సుశీలమ్మ అడుగులు పడ్డాయి.

P Susheela: కొందరు వ్యక్తులు మనకు పరిచయం లేకపోయినా, వారి టాలెంట్ వల్ల మనం పొందుతున్న ఆనందం వారిని మనకు దగ్గర చేస్తుంది. అలా ఎక్కువగా జరిగేది సినీ సెలబ్రిటీలతోనే. సినిమా అనే మాధ్యమం వల్లే ఎంతోమంది నటీనటులు మాత్రమే కాదు.. సింగర్స్, డైరెక్టర్స్‌ను కూడా మనం సొంత మనుషుల్లాగా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా అప్పట్లోని సింగర్స్, నటీనటులు.. ప్రేక్షకుల్లో బలమైన ముద్రను వేశారు. అలాంటి వారిలో ఒకరు సింగర్ సుశీల. ప్రేక్షకులు ముద్దుగా సుశీలమ్మ అని పిలుచుకునే సింగర్ పుట్టినరోజు నేడు.



సుశీలమ్మ జీవితంలో ఎన్నో అవార్డులను, ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అందుకే ఆమెకు ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పాత పాటలను అమితంగా ఇష్టపడేవారు సుశీలమ్మ పాటలను ప్రత్యేకంగా అభిమానిస్తారు. అలాంటి సుశీలమ్మ జీవితం గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు..

సుశీలమ్మ జీవితం రేడియోలో ప్రైవేట్ ప్రొగ్రామ్స్‌లో మొదలయ్యింది. అప్పటినుండి ఎవరికీ కనిపించకపోయినా.. తన గాత్రంతో అందరినీ అలరిస్తూనే ఉన్నారు సుశీల. 1952లో విడుదయిన తమిళ సినిమా 'పెట్రా థాయ్' చిత్రం ద్వారా రేడియో నుండి వెండితెరవైపు ఆమె అడుగులు పడ్డాయి. కానీ సుశీలమ్మకు సింగర్‌గా మంచి పేరు తీసుకొచ్చింది మాత్రం 1955లో ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్, సావిత్రి నటించిన 'మిస్సమ్మ'.


ఇన్నేళ్ల సుశీలమ్మ కెరీర్‌లో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. మొదటగా ప్లే బ్యాక్ సింగర్‌గా నేషనల్ అవార్డు అందుకున్న రికార్డ్ కూడా సుశీలమ్మకే సొంతం. వివిధ భాషల్లో 50,000 పాటలు పాడిన సుశీలమ్మకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా దక్కింది. ఆమె లైఫ్‌టైమ్ అచ్చీవ్‌మెంట్‌గా మొత్తం అయిదు నేషనల్ అవార్డులను దక్కించుకున్నారు. 2008లో సుశీలమ్మను పద్మభూషణ్‌తో సత్కరించారు.


సుశీలమ్మ తల్లిదండ్రులు సంగీత ప్రియులు కావడంతో తమ కూతురుకు కూడా సంగీతం నేర్పించాలని నిర్ణయించుకుని ద్వారం వెంకట స్వామి నాయుడు, ద్వారం భవ నారాయణల దగ్గర చేర్చారు. విజయనగరంలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టినా కూడా సుశీలమ్మను ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మిలాంటి సింగర్‌ను చేయాలని ఆమె తల్లిదండ్రుల కోరిక. తాను సంగీతాన్ని నేర్చుకుంటున్న క్రమంలో మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో చేరారు. అదే సుశీలమ్మ లైఫ్‌లో టర్నింగ్ పాయింట్.


మొదటిసారి వినగానే నిర్మాత కేఎస్ ప్రకాశ్ రావుకు సుశీలమ్మ స్వరం బాగా నచ్చడంతో తాను నిర్మిస్తున్న 'కన్నతల్లి' సినిమాలో ఒక డ్యూయట్ పాడే అవకాశం ఇచ్చారు. 'తోడి కోడళ్లు' సినిమాలో మెయిన్ సింగర్‌గా పాడిన తర్వాత సుశీలమ్మ జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికీ, ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే ఒక సింగర్ సుశీలమ్మ.

Tags

Read MoreRead Less
Next Story