నింగికేగిన బాలు.. ప్రముఖుల నివాళులు

నింగికేగిన బాలు.. ప్రముఖుల నివాళులు

ఆయన మరణ వార్త విని.. నా గుండె పగిలింది : చిరంజీవి

ప్రపంచ సంగీతానికి ఇది చీకటి రోజు. ఎవరికీ సాటిరాని మ్యూజిక్‌ లెజెండ్‌ ఎస్పీ బాలు గారి మరణంతో ఓ శకం ముగిసింది. వ్యక్తిగతంగా చెప్పాలంటే... నా కెరీర్‌ విజయంలో బాలు గారి స్వరం పాత్ర ఎంతో ఉంది. ఆయన నా కోసం ఎన్నో మధురమైన గీతాలు ఆలపించారు. ఘంటసాల గారి తర్వాత ఈ సంగీత ప్రపంచాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారా? .. అనే తరుణంలో ఓ తారలా బాలు గారు మ్యూజిక్‌ గెలాక్సీలోకి అడుగుపెట్టారు. భాష, ప్రాంతం, హద్దులు.. అనేవి లేకుండా పలు దశాబ్దాలుగా ఆయన మధుర గాత్రం భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని అలరిస్తోంది. భవిష్యత్తులో మరో బాలసుబ్రహ్మణ్యం రాడు.. కేవలం ఆయన పునర్జన్మ మాత్రమే లోటును భర్తీ చేయగలదు. ఆయన మరణ వార్త విని, నా గుండె పగిలింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి బాలు గారు అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

ఎస్పీబీ మృతి పట్ల కేసీఆర్‌ సంతాపం

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు... భారతీయ ప్రజలందరికీ అభిమాని అయ్యా రని సీఎం అన్నారు. ఎస్పీ బాలు పాణాలను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమని అన్నారు. బాలసుబ్రమణ్యం లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని సీఎం కేసీఆర్‌ అన్నారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సినీ లోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి ఎస్పీ బాలు అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది : జూనియర్ ఎన్టీఆర్

సంగీత ప్రపంచంలో పాటల రారాజు ఎస్పీ బాలసుబ్రమణ్యం అస్తమించడం కలచివేసిందని అన్నారు జూనియర్ ఎన్టీఆర్.. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. అందులో ఇలా పేర్కొన్నారు.. 'తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసింది. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే' అని అన్నారు.

మా ఊరి 'బాలు'.. : వెంకయ్యనాయుడు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం బాలు మృతిపట్ల ట్విట్టర్ వేదికగా సానుభూతి తెలియజేశారు.. 'ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది. వారు కోలుకుంటున్నారని భావిస్తున్న సమయంలోనే ఇలా జరగడం విచారకరం. గాన గంధర్వుడైన శ్రీ ఎస్పీ బాలు మా ఊరివాడైనందున చిన్నప్పటినుంచి చాలా పరిచయముంది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.' అని అన్నారు.

పళనిస్వామి, తమిళనాడు ముఖ్యమంత్రి

ఐదు దశాబ్దాలకు పైగా లక్షలాది హృదయాలను తన గానంతో ఆకట్టుకున్న ఎస్పీ బాలు మరణం సంగీత, సినీ పరిశ్రమకు కోలుకోలేని విపత్తు అని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. బాలసుబ్రమణ్యం పరమపదించడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్న కుటుంబ సభ్యులు. అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. బాలు గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని స్పార్థిస్తున్నాను. అని అన్నారు.

కన్నడిగులను ఎంతో అభిమానించేవారు: యడియూరప్ప

ఎస్పీ బాలు తన అద్భుతమైన గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతకారులకు స్ఫూర్తిగా నిలిచారు. కర్ణాటక ప్రజల్ని ఆయన ఎంతో అభిమానించేవారు. అంతటి నిరుపమానమైన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ధైర్యం నింపాలని దేవుణ్ని వేడుకుంటున్నాను.

'శ్రీ తుంబుర నారద నాదామృతం' పాటను ఎప్పుడూ పాడుకుంటూనే ఉంటా : బాలకృష్ణ

16 భాషల్లో 40 వేలకిపైగా పాటలు పొడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి నిష్క్రమణ యావత్ సినీ, సంగీత ప్రపంచానికే తీరని లోటు. వ్యక్తిగతంగా నాకు బాలు గారితో ఎంతో అనుబంధం ఉంది. ఆయన పాడిన నాన్నగారి పాటలు, నా పాటలు వినని రోజంటూ ఉండదు. ముఖ్యంగా 'ఖైరవ ద్వీపంలో ఆయన ఆలపించిన 'శ్రీ తుంబుర నారద నాదామృతం' పాటను ఎప్పుడూ పాడుకుంటూనే ఉంటాను. అలా ప్రతి క్షణం ఆయన్ని తలుచుకుంటూనే ఉంటాను. అలాంటి గొప్ప గాయకుడు, గొప్ప వ్యక్తి మనతో లేకపోవడం ఎంతో విచారకరం. బాలు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

గాన గంధర్వుడు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది : సీఎం జగన్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను.

బాలసుబ్రహ్మణ్యంగారు ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్నా : టీడీపీ అధినేత చంద్రబాబు

కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదు. రేపో మాపో ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్న బాలసుబ్రహ్మణ్యంగారు ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉంది. ఆయన మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసింది. ఇది దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటు. బాలసుబ్రహ్మణ్యంగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

గొప్ప సుమధుర గాయకున్ని దేశం కోల్పోయింది : రాష్ట్రపతి

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు అస్తమయం దేశ సంగీత రంగానికి తీరని లోటు. గొప్ప సుమధుర గాయకున్ని దేశం కోల్పోయింది అని రాష్ట్రపతి ట్విటర్‌లో పేర్కొన్నారు. బాలు..ని పాటల జాబిల్లిగా అభిమానులు కీర్తిస్తారని గుర్తు చేశారు. పాటల ప్రపంచానికి బాలు సేవలకుగాను పద్మ భూషణ్‌, జాతీయ అవార్డులు, మరెన్నో పురస్కారాలు వరించాయని తెలిపారు.

బాలు మృతిపై ప్రధాని దిగ్భ్రాంతి

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు మృతి దురదృష్టకరమని ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. బాలు మరణంతో దేశ సాంస్కృతిక రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని అన్నారు. బాలు సుమధుర గొంతుక యావత్‌ భారతంలోని ప్రతి ఇంటికి సుపరిచితమని ప్రధాని వ్యాఖ్యానించారు. 'ఈ విషాద సమయంలో బాలు కుటుంబ సభ్యులకు, శేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి' అని మోదీ ట్వీట్‌ చేశారు.

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అకాల మృతిపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలు కుంటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


Tags

Read MoreRead Less
Next Story