ఆ చిత్రంలో బాలు బ్రీత్‌లెస్ సాంగ్..

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూశారు. గత 40 రోజులుగా చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం ఎజిఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన అభిమానులు, సంగీత ప్రేమికులు తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయారు. కాగా ఎస్పీ బాలసుబ్రమణ్యం శకరాభరణం చిత్రంలో ఆయన క్లాసికల్ మ్యూజిక్‌పై చేసిన ప్రయోగాలను విమర్శకులు సైతం ప్రశంసించకుండా ఉండలేకపోయారు. అప్పటిదాకా మాస్, మెలోడీ సింగర్ అనే పేరు తెచ్చుకున్న బాలు... క్లాసికల్ సంగీతంలోనూ తిరుగులేదనిపించుకున్నారు. శంకరాభరణం ఎప్పటికీ సజీవ చిత్రమే. అందులోని పాటలు భావితరాల సంగీత కారులకు సైతం స్ఫూర్తినిచ్చేవే...
ఓ పాపా లాలి చిత్రంలో బాలు బ్రీత్‌లెస్ సాంగ్
బాలు పాటలు వింటుంటే ఆ మాధుర్యానికి నోట మాట రాదు. పండితులైనా... పామరులైనా బాలు సంగీతానికి మైమరచిపోవాల్సిందే. ఓ పాపా లాలి చిత్రంలో మాటేరాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు అనే పాట కూడా అలాంటిదే. బాలూ నటించి, ఆలపించిన ఆ బ్రీత్ లెస్ సాంగ్‌ను సంగీతాభిమానులు ఎప్పటికి మరిచిపోలేరు..
సినిమాలో నటించే నటుల స్వరానికి అనుగుణంగా పాటలు పాడే బాలు
కొత్తా దేవుడండీ పాటలో లెక్కలేనన్ని వేరియేషన్స్ చూపించిన బాలు
బాలు తన గాత్రంతో ఎన్నో గమ్మత్తులు చేశారు. సినిమాలో నటించే నటుల స్వరానికి అనుగుణంగా పాటలు పాడడం బాలు ప్రత్యేకత. రాజాధిరాజు చిత్రంలో కొత్తా దేవుడండీ పాట చూస్తుంటే అది నిజంగా నూతన్ ప్రసాద్ పాడాడా అనిపిస్తుంది. పాటలో అంతటి వేరియేషన్స్ చూపించడం ఒక్క బాలుకే సాధ్యమంటే అతిశయోక్తికాదు..
సందర్భానికి తగినట్లు పాటతో ప్రయోగం చేయడంలో బాలు దిట్ట
సందర్భానికి తగినట్లు పాటతో ప్రయోగం చేయడం బాలుకు కొత్త కాదు. దొంగ మొగుడు చిత్రంలో అద్దమ రేయి మద్దెల దరువండీ పాటనే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. చిరంజీవి, భానుప్రియ నటించిన ఈ చిత్రంలో చిరంజీవి పాడినట్లే ఫీలయ్యారు ఆ సినిమా చూసిన ప్రేక్షకులు. అంతగా పాటలో లీనమైపోయారంటే అదంతా బాలు గాత్ర మహత్యమే..
ఇంద్రుడు చంద్రుడులోని బాలు శృంగార గీతానికి విమర్శకుల ప్రశంసలు
బాలు చేసిన పాటల ప్రయోగాల్లో ప్రత్యేకంగా నిలిచే మరో పాట ఇంద్రుడు చంద్రుడు చిత్రంలోనిది. నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు అనే శృంగార గీతంలో బాలు మాడ్యులేషన్‌ను సంగీతాభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. కమల్ హాసన్ మేయర్‌గా నటించిన ఈ చిత్రంలో.. కమల్‌కు డబ్బింగ్‌కూడా చెప్పిన బాలూ.. అదే గరుకు గొంతుతో పాడిన పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com