Sirivennela Sitarama Sastry: నా పాట.. నా భార్య ఎప్పుడూ బోర్ కొట్టవు
Sirivennela Sitarama Sastry: ఎవరైనా తామెంచుకున్న రంగంలో ఎదగాలంటే జీవితభాగస్వామి సహకారం ఎంతైనా అవసరం.. ఒడిదుడుకులను, ఆటుపోట్లలను తట్టుకుని నిలబడాలంటే అన్నీ తానై చూసుకునే భాగస్వామి దొరకడం అదృష్టమనే చెప్పాలి. అందులో తాను విజయవంతమయ్యానని ఒకింత గర్వంగా చెప్పుకునే వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.
ఒకరు పాటకు పదాలల్లితే, మరొకరు పాటంటే చెవి కోసుకుంటారు.. వారిద్దరికీ జోడీ కుదిరితే ఆ సంపారంలో సరిగమలకు కొదవేముంది. వారి దాంపత్యం అన్యోన్యంగా సాగేందుకు పాటే సహకరించింది. పెళ్లికి ముందే పద్మకు పాటంటే ప్రాణం.. స్కూలు నుంచి వచ్చి రేడియోలో వచ్చే పాటలు వినేది. పాటలు రాసే వ్యక్తితో జీవితాన్ని పంచుకోబోతున్నానని తెలిసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆయన దొరకడం ఆమె అదృష్టంగా భావిస్తే.. పద్మ భార్యగా దొరకడం తన అదృష్టం అని సిరివెన్నెల పలు సందర్భాల్లో పంచుకున్నారు. గాయని జానకి గారు కూడా తన జీవితానికి నిజమైన సిరివెన్నెల పద్మ అని అన్న మాటలు అక్షరాలా నిజమని అనేవారు సీతారామశాస్త్రి.
నన్ను, నా కుటుంబాన్ని చూసుకుంటూ, అందరి బాధ్యతలు నిర్వరిస్తూ చాలా ఆనందాలను కోల్పోయింది. నన్ను నా ప్రోఫెషన్‌కి అంకితమయ్యేలా చేసింది .. అలాంటి పద్మ నాకు బెటర్ హాఫ్ కాదు.. బెటర్ త్రీ ఫోర్త్ అని అనేవారు సిరివెన్నెల.
ఓ ఇంటర్వ్యూలో పద్మ మాట్లాడుతూ.. ఇంటి బాధ్యతల్లో ఆయన ఎప్పుడూ జోక్యం చేసుకునేవారు కాదు.. మా అత్తగారి సలహాలతో అన్నీ నేనే చూసుకునేదాన్ని. శాస్త్రి గారు ఎప్పుడూ ఏదో ఒకటి రాసుకుంటూ, చదువుకుంటే ఉండేవారు. ఆయన రాసిన ప్రతి పాటకు మొదటి శ్రోతను నేనే.. ఆయన రాసిన పాటలతో ఇంట్లో ఒక లైబ్రరీని ఏర్పాటు చేసాను అని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com