Sonu Sood : సామాన్యుడి కల నెరవేర్చిన సోనూసూద్.. మరోసారి మానవత్వం చాటుకున్న దానశీలి
రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న మానవతామూర్తి, దానశీలి సోనూసూద్.. ఇప్పటికే తన దయా హృదయాన్ని ఎన్నోసార్లు చాటుకున్నారు. ఎంతో మంది జీవితాలను మార్చి.. వారి జీవితాల్లో వెలుగులు నింపిన బాలీవుడ్ హీరో.. ఇప్పుడు పైలట్ కావాలనుకున్న ఒక సామాన్యుడి కలను సాకారం చేశారు. ఆ వ్యక్తి ప్రస్తుతం పైలట్‌గా ఏవియేషన్ అకాడమీలో గ్రౌండ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడు. సోనూ సూద్ అంటే ఏంటో మరోసారి ఈ సామాన్యుడి ద్వారా ప్రపంచానికి తెలిసింది.
పేదరికంలో జన్మించిన ఈ వ్యక్తి అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. పైలెట్ కావాలన్న తన కలను ఎలాగైనా నెరవేర్చుకోవాలని మనుసులో ఆశ, పట్టుదల ఉన్నా.. అది అసంభవం అని ఎప్పుడూ తన పేదరికం తనకు గుర్తు చేస్తూ ఉండేది. ఆ సమయంలోనే తన జీవితానికి ఓ వెలుగులా వచ్చాడు సోనూసూద్. తన ఆలోచన తప్పు అని నిరూపించాడు. ఆ అపోహలన్నీ కేవలం అపోహలేనని రుజువు చేశాడు.
ఎయిర్‌లైన్‌లో హెల్పర్‌గా, క్లీనర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత, అతని జీవితంలోకి ఊహించని వ్యక్తి వచ్చాడు. అతనే దేశం గర్వించదగ్గ నటుడు, సామాజికవేత్త సోనూసూద్. "సోనూ సూద్ నాకు సహాయం చేశాడు. సోనుసూద్ స్ఫూర్తితో ఆయన ఫౌండేషన్ ను అభ్యర్థించిన వెంటనే నేను ఆర్థిక సహాయం పొందాను" అని అతను వివరించాడు. అది అతని జీవిత ఆశయానికి పునరుజ్జీవం ఇచ్చింది. అతని ఆకాంక్షలకు రెక్కలనిచ్చింది. చివరికి అతను కల కలలను సాకారం అయ్యేలా చేసింది. అదే అతన్ని చివరికి పైలెట్ ను చేసింది.
సోనూ సూద్ వెలిగించిన దీపం లాంటివాడు. తాను వెలుగుతూనే ఎందరికో వెలుగునిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన నింపిన ఒక స్ఫూర్తి దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది. ఆయన వ్యక్తి కాదు ఒక సామూహిక శక్తి అని అందరూ చెప్పుకుంటున్నారు. "సోనూ సూద్‌ను విమానంలో ఎక్కించుకోవాలనేది నా కల. ఆ క్షణం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు, నన్ను ఎన్నో యూట్యూబ్ ఛానెళ్లు ఇంటర్వ్యూ చేస్తున్నాయి. నిజంగా రియల్ హీరో సోనూ సూద్ స్వయంగా నా విషయంలో గర్వపడుతున్నానని చెప్పడం నా జీవితానికి అత్యుత్తమ పురస్కారంగా భావిస్తున్నాను. ఆయన ప్రోత్సాహం నా జీవితాన్నే కాదు చాలా మంది జీవితాలను కూడా మార్చేసింది. నా యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత, చాలామంది ప్రజలు నాలాగే పైలట్‌లు కావాలని కోరుకుంటున్నట్టు నన్ను కలిసి చెప్పడం సంతోషంగా ఉంది. సోనుసూద్ అందించిన ఈ ప్రోత్సాహం అత్యంత పేదవాడు కూడా పైలట్ కాగలడని ప్రజల హృదయాల్లో ఆశ నెలకొంది. సోనూ సూద్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ పైలట్ కథ సామాన్యుల్లో ఆశను చిగురింపచేస్తోంది. రియల్ హీరో సోనూసూద్ తలుచుకుంటే తలరాతను మార్చిన ఈ కథనం నిదర్శనంగా నిలుస్తోంది. సమయానికి ప్రతిభావంతులకు నిజమైన హీరోలు చేయూతగా నిలిస్తే అద్భుతాలు సృష్టిస్తారు అనడానికి ఈ కథ నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com