HBD Raviteja : హ్యాపీ బర్త్ డే మాస్ మహారాజా..!

HBD Raviteja : హ్యాపీ బర్త్ డే మాస్ మహారాజా..!
HBD RaviTeja : కృషితో నాస్తి దుర్భిక్షం.. అనే మాటకు అక్షరాలా సరిపోయే హీరో రవితేజ. సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత స్వయంకృషికి బ్రాండ్ అంబాసిడర్

HBD RaviTeja : కృషితో నాస్తి దుర్భిక్షం.. అనే మాటకు అక్షరాలా సరిపోయే హీరో రవితేజ. సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత స్వయంకృషికి బ్రాండ్ అంబాసిడర్ అంటే రవితేజనే చెప్పాలి. అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా మొదలై, చిన్నచిన్న వేషాలతో గుర్తింపు తెచ్చుకుని.. తర్వాత స్టార్ హీరోగా ఎదిగిన విధానం.. రవితేజ పడ్డ కష్టాన్ని తెలియజేస్తుంది. అతను సలహాల్ని కాకుండా శ్రమనే నమ్ముకుని ఈ స్థాయికి చేరాడు. టాలీవుడ్‌‌లో మాస్ హీరోకు కొత్త భాష్యం చెప్పి మాస్ మహరాజ్ అనిపించుకున్న ఈ ఖిలాడీ బర్త్ డే ఇవాళ.

రవితేజ పుట్టింది తూర్పుగోదావరి జిల్లా జగ్గం పేట అయినా.. పెరిగింది భారతదేశమంతటా. తండ్రి చేసే పని వల్ల అతను డిగ్రీకి వచ్చేంత వరకూ ఉత్తరభారతదేశమంతటా కుటుంబంతో కలిసి తిరిగాడు. అందుకే రవితేజ కు నార్ట్ కు సంబంధించిన చాలా భాషలు పూర్తిగా మాట్లాడలేకపోయినా చాలా వరకూ తెలుసు. చిన్నప్పటి నుంచి అమితాబ్ కు వీరాభిమాని కావడంతో తనూ నటుడు కావాలనే కోరికతో ఉండేవాడు. విజయవాడలో డిగ్రీ పూర్తి చేసి పూర్తిస్థాయిలో నటుడయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

తొలినాళ్లలో చాలా సినిమాల్లో హీరో ఫ్రెండ్ గానో, లేక ఇతర గుంపుల్లోనో ఒకడిగా కనిపించాడు రవితేజ. అయితే కొత్త టాలెంట్ ను ఈజీగా క్యాచ్ చేసే కృష్ణవంశీ పరిచయం రవితేజ కెరీర్ ను మలుపు తిప్పింది. కృష్ణవంశీ రెండో సినిమా సిందూరంలో ఇద్దరు హీరోల్లో ఒక పాత్రకు తీసుకున్నాడు. ఈ సినిమాతోనే రవితేజలోని ఈజ్ ఏంటో అందరికీ అర్థమైంది.సిందూరం తర్వాత వరుసగా హీరో ఛాన్సులు వస్తాయనుకున్నారు చాలామంది. కానీ అలా జరగలేదు.

దీంతో మళ్లీ నలుగురిలో ఒకడిగా నటించడం స్టార్ట్ చేశాడు. తర్వాత పాడుతా తీయగా, మనసిచ్చి చూడు, ప్రేమకు వేళాయరా చిత్రాల్లో నటించాడు. కానీ అవన్నీ హీరో తర్వాత పాత్రలే. నటుడిగా రవితేజ అంటే ఏంటో అందరికీ అప్పటికే తెలిసిపోయింది. కానీ అవకాశాలివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఓ కొత్త దర్శకుడు ఇతన్ని నమ్మాడు. అతని ఒరిజినల్ స్టైల్ కు భిన్నంగా రవితేజను ప్రెజెంట్ చేయాలనుకున్నాడు. అందుకు అతని ఆహార్యం కూడా సరిపోయింది. దీంతో రవితేజ మళ్లీ హీరో అయ్యాడు. ఆ సినిమా నీకోసం. ఆ దర్శకుడు శ్రీను వైట్ల. కానీ ఈ సినిమాకు ప్రశంసలు వచ్చాయి కానీ పెట్టుబడి రాలేదు.

నీకోసం తర్వాత రవితేజ ఇక హీరోగా పనికిరాడు అనేవారు పెరిగిపోయారు. అయితే అతను మాత్రం బయటి వారి కామెంట్స్ కంటే తనలోని కసినే ఎక్కువగా నమ్ముకున్నాడు. అందుకే ఎంతమంది ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా.. సహనంగా సర్ధకుపోయాడు. వచ్చిన ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయాడు. ఇలా నీకోసం తర్వాత దాదాపు పది సినిమాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రల్లో నటించాడు. కొన్నిటికి బాగా పేరొచ్చినా.. మళ్లీ హీరోను చేసేందుకు భయపడ్డారు చాలామంది.

ఈ టైమ్ లో ఓ మ్యాజికల్ కాంబినేషన్ కు స్క్రిప్ట్ రెడీ అయింది. ఓ హిట్ మరో ఫ్లాప్ తో కెరీర్ ఊగిసలాటలో ఉన్న పూరీ జగన్నాథ్ తో రవితేజ పరిచయం టాలీవుడ్ లో ఓ సెన్షేషన్ కు కారణమౌతుందని.. వీళ్లిద్దరూ కలిసి.. బాక్సాఫీస్ ను రూల్ చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. వీరి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న తొలి సినిమా ''ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం''. హీరోగా రవితేజకు తొలి సూపర్ హిట్.. దర్శకుడిగా పూరీకి రెండో హిట్. ఇలాంటి ఈజ్ ఉన్నవారితో ఈజీగా సినిమాలు చేసే సీనియర్ డైరెక్టర్ వంశీకి రవితేజ బాగా నచ్చాడు. దీంతో చాలాకాలం తర్వాత ఆయనా ఓ మంచి స్క్రిప్ట్ రాసుకుని రవితేజ హీరోగా ''ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు'' చేశాడు. ఇదీ సూపర్ హిట్. అటు వంశీ మార్క్ చాలా రోజుల తర్వాత కనిపించిందనే కమెంట్స్ సినిమాకు మరింత ఉపయోగపడ్డాయి.. అలా ఎన్నాళ్లో వేచిన ఉదయం రవితేజ దగ్గరకు రాసాగింది.

ఇదే టైమ్ లో మళ్లీ పూరీతో సినిమా. ఇడియట్. ఈ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో చెప్పలేం. తీసేటప్పుడు వాళ్లూ ఊహించలేదు. అప్పటి వరకూ నెగెటివ్ టైటిల్ లో హీరోను చూపించిన వారు లేరు. కానీ వీళ్లు ఆ సాహసం చేశారు. ఆ సాహసానికి బాక్సాఫీస్ షేక్ అయింది. ఎంటైర్ యూత్.. రవితేజలో తమను తాము చూసుకున్నారు. తమలోని ఫీలింగ్స్ అన్నిటికి ఈ ఇడియట్టే ప్రతినిధి అన్నంతగా వాళ్లు రవితేజను ఓన్ చేసుకున్నారు. అలా మొదలైన రవితేజ జర్నీ ఇప్పటి వరకూ పవర్ ఫుల్ గానే సాగుతోంది.

ఎన్నో ఏళ్ల నిర్విరామ కృషి, పట్టుదల తర్వాత రవితేజ అనుకున్నది సాధించాడు. లక్ష్యం వైపే గురిపెట్టిన వాడికి నిరాశ ఉండకూడదు అన్నమాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. . సిందూరంతో తనలోని హీరోను చూసిన కృష్ణవంశీ చేసిన ఖడ్గంలో రవితేజ తన జీవితాన్నే వెండితెరపై ఆవిష్కరించాడా అన్నంతగా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. అందుకే ఆ సినిమాకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్ అందుకున్నాడు. ఇదంతా రాత్రికి రాత్రే వచ్చిన స్టార్డమ్ కాదు.. అతని కృషికి, సహనానికి కాలం కట్టబెట్టిన కిరీటం.

మళ్లీ పూరీ జగన్నాథ్ తోనే చేసిన అమ్మా నాన్నా తమిళ అమ్మాయి రూపంలో మరో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్. తర్వాత కెరీర్ లో కొన్ని ఎత్తు పల్లాలుండొచ్చేమో కానీ, ఇప్పటి వరకూ రవితేజ ఏనాడూ వెనుతిరిగి చూడలేదు. కొన్నిసార్లు ఈ అబ్బాయి మంచోడు అనిపించుకోవాలని చూసినా.. వద్దు రవితేజ ఇడియట్ లా ఉంటేనే ఇష్టమన్నారు ఆడియన్స్. దీంతో దొంగోడు, వీడే, వెంకీ వంటి సినిమాలతో కంప్లీట్ మాస్ మహరాజ్ గా మారాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసినవాడు కాబట్టి, అతను కొన్ని కథలను బాగా ఇష్టపడ్డాడు. నమ్మాడు. కానీ తను ప్రేమించిన కథల్లో ప్రేక్షకులు తనను ప్రేమించలేరని తెలుసుకోవడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. అవి చంటి, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమాలు. ఆటోగ్రాఫ్ లో అతని నటన కన్నీళ్లు పెట్టించినా.. ఇమేజ్ అడ్డంకిగా మారి.. అద్భుత విజయాన్ని అడ్డుకుంది.

ఇక మళ్లీ రూట్ మార్చకుండా పాత రూట్ లోనే వెళ్లాడు. భద్ర, విక్రమార్కుడు, ఖతర్నాక్, దుబాయ్ శీను, కృష్ణ అంటూ తనకే సొంతమైన మాసిజంతో చెలరేగిపోయాడు. రవితేజ ఎలా ఉంటే ఆడియన్స్ కు నచ్చుతుందో అలాగే ఉండక తప్పలేదు. అందుకే కొన్ని ప్రయోగాత్మక సినిమాలు చేయాలనిపించినా..ఎక్కడ మళ్లీ ఆటోగ్రాఫ్ రిజల్ట్ రిపీట్ అవుతుందో అని... మాస్ హీరోకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిపోయాడు. కృష్ణ, కిక్ తర్వాత విజయాల పరంగా కొంత వెనకబడ్డాడు రవితేజ. అయినా అతని ఇమేజ్ కారణంగా బయ్యర్స్ పెద్దగా నష్టపోయింది లేదు. అసలు రవితేజ అంటే మినిమం గ్యారెంటీ హీరో కదా. ఆ ట్యాగ్ చాలా ఫ్లాపుల వరకూ అతన్ని కాపాడింది. తర్వాత డాన్ శీను, మిరపకాయ్ వంటి హిట్స్ తో మళ్లీ గాడిలో పడ్డా.. తర్వాత మళ్లీ ఎప్పుడూ లేనంతగా అతన్ని ఫ్లాపులు చుట్టుముట్టి కొంతకాలం ఉక్కిరిబిక్కిరి చేశాయి.

ఎక్కువగా తింటే గారెలు కూడా చేదుగా ఉంటాయంటారు. మిరపకాయ్ తర్వాత రవితేజ విషయంలోనూ ఇదే జరిగింది. ఒకప్పుడు ఆడియన్స్ తనను ఎలా చూడాలనుకున్నారో ఇప్పుడు అలా వద్దన్నారు. కానీ ఆ విషయం రవితేజకు పూర్తిగా తెలిసే సరికి.. అరడజను ఫ్లాపులు పడ్డాయి. వీటిలో భారీ అంచనాలతో వచ్చినవీ ఉన్నాయి.. క్రేజీ కాంబినేషన్ లో వచ్చినవీ ఉన్నాయి. మరోవైపు వయసు కూడా తెలిసిపోతోంది. కొత్త హీరోల పోటీ పెరిగింది. ఇన్ని దాటుకుని ఇక రవితేజ మళ్లీ లేవడం కష్టమనే అనుకున్నారంతా..

జీరో నుంచి స్టార్ హీరో అయిన వాడు కదా.. మళ్లీ బాక్సాఫీస్ కు తన బలుపు చూపించి తనపై వచ్చిన రూమర్స్ కు సమాధానం చెప్పాడు. కొంత వాయిస్ మేనేజింగ్ తో మళ్లీ పవర్ చూపించి రెచ్చిపోయాడు. ఈ రెండు సినిమాలతో తనింకా బరిలోనే ఉన్నానని బయ్యర్లకూ నిరూపించాడు. తర్వాత మళ్లీ రెండు ఫ్లాపులు ..ఆపై రాజా ది గ్రేట్ తో మరోసారి సూపర్ హిట్. చాలా రోజుల తర్వాత రాజాది గ్రేట్ తో హిలేరియస్ గా ఎంటర్టైన్ చేశాడు.

రాజా ది గ్రేట్ వంటి ట్రెమండస్ హిట్ తర్వాత వరుసగా నాలుగు ఫ్లాపులు పడ్డాయి. దీంతో ఇక రవితేజ పని ఐపోయింది అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారడం బెటర్ అన్నారు. మళ్లీ బౌన్స్ బ్యాక్ కావడం అసాధ్యం అనీ వినిపించింది. ఇలాంటివి రవితేజ పట్టించుకోడు. పని మాత్రమే చేస్తాడు. ఆ పనే క్రాక్ రూపంలో కమర్షియల్ హిట్ గానిలిచింది. క్రాక్ తో మళ్లీ సూపర్ హిట్ కొట్టాడు. 2021టాలీవుడ్ కే కొత్త ఊపునిచ్చింది క్రాక్.

ప్రస్తుతం ఖిలాడీతో డ్యూయొల్ రోల్ లో రాబోతున్నాడు. దీంతో పాటు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు రవితేజ. రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర వంటి చిత్రాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. వీటిలో నాలుగు సినిమాలు ఈ యేడాదే విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ మూవీస్ అన్నీ మంచి విజయాలు సాధించాలని మాస్ రాజా మనల్ని మరింత ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ.. ఈ ఖిలాడీ హీరోకు మరోసారి బర్త్ డే విషెస్ చెబుదాం.

Tags

Next Story