Trivikram Srinivas : కథ,పంచ్ లు, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్..

Trivikram Srinivas :  కథ,పంచ్ లు, దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్..
X

త్రివిక్రమ్ శ్రీనివాస్.. తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. సినిమా డైలాగ్ అంటే పేరాల కొద్దీ అన్నమాటను చెరిపేసి అతి చిన్న పదాలతో పెద్ద భావాల్ని పలికిస్తాడు. అలతి పదాల మాటలతోనే మంత్రముగ్ధులను చేస్తూ మాటల మాంత్రికుడయ్యాడు. అతను రాస్తే సందేశం గుండెలను తాకుతుంది. సన్నివేశం సరికొత్తగా మారుతుంది. అందుకే అతని సినిమా సక్సెస్ కు చిరునామా అయింది. రాతతో మొదలుపెట్టి.. తీతలో తిరుగులేదనిపించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే ఇవాళ.



త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టింది భీమవరంలో. అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్. ముందుగా అతని పెదనాన్న ఇతనికి త్రివిక్రమ్ అనే పేరు పెడదామన్నారట. కానీ ఫైనల్ గా శ్రీనివాస్ సెట్ అయింది. అందుకే పెదనాన్న కోసం తన కలం పేరును త్రివిక్రమ్ గా మార్చుకున్నాడు శ్రీనివాస్. ఇప్పుడు అదే పేరుతో అంతులేని పేరు తెచ్చుకుని వరుస విజయాలతో అగ్రదర్శకుడుగా దూసుకుపోతున్నాడు.

న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ అయిన శ్రీనివాస్ కు కాలేజ్ రోజుల నుంచి సెకండ్ షోలకు వెళ్లే అలవాటు బాగా ఉండేది. కానీ సినిమాల్లోకి వెళ్లాలని, వెళ్తానని ఎప్పుడూ చెప్పేవాడు కాదట. లక్ష్యాన్ని మనసులో పెట్టుకుని ఇంట్లో జాబ్ కోసం అని చెప్పి 1996లో హైదరాబాద్ వచ్చేశాడు. హోమ్ ట్యూషన్స్ చెబుతూ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అప్పుడాయన రూమ్మేట్ గా సునిల్.. డ్రీమ్ మేట్స్ గా ఇంకా చాలామంది ఉండేవారు.

ఓ రోజు హాస్యనటుడు గౌతంరాజుతో పరిచయం అయింది. ఆయన సలహాతో ఓ టివిలో స్క్రిప్ట్ రైటర్ గా కుదిరాడు. తర్వాత రోడ్డు అనే కథతో ఫేమస్ రైటర్ కొమ్మనాపల్లి గణపతిరావును కలిశాడు. కథ నచ్చిన ఆయన ఓ పత్రికకు పంపితే అది అచ్చయింది. తర్వాత మెరుపు అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. శాలరీ లేకున్నా 4గంటల వరకూ షూటింగ్ లో ఉండి తర్వాత ఇంటికి వచ్చి మళ్లీ ట్యూషన్స్ చెప్పడానికి వెళ్లేవాడట.

హైదరాబాద్ లో తనలాగే వెండితెర కలలతో ఉన్న ఎందరో మిత్రులతో కలిసి గంటలకొద్దీ చర్చలు నడిపేవాడు. అయితే పాఠ్యపుస్తకాలే కాక ప్రపంచ పుస్తకాలూ విరివిగా చదవడంతో శ్రీనివాస్ మాటల్లో ఏదో తెలియని డెప్త్ ను ఆ రోజుల్లోనే మిత్రులు గమనించారు. ఒక్కరికి అవకాశం వచ్చినా ఒక్కొక్కరుగా సెటిల్ కావాలని అప్పుడే డిసైడ్ చేసుకున్నారు. వీరిలో చాలా త్వరగా బిగ్ స్టార్ అయింది త్రివిక్రమ్.


రచయిత పోసాని పరిచయంతో మాటల రచయితగా మారాడు త్రివిక్రమ్. అప్పటికే ఫేమస్ రైటర్ అయిన పోసాని వద్ద ‘ముద్దుల మొగుడు’ సినిమాకోసం కొన్ని డైలాగ్స్ రాశాడు. కానీ అప్పటికి సినిమా కోసం మాటలు ఎలా రాయాలో తెలియదట త్రివిక్రమ్ కు. అయితే పోసాని స్నానానికి వెళ్లి వచ్చే లోపు అక్కడి ఫైల్స్ లో మాటలు చూసి ఎలా రాయాలో అవగాహన పెంచుకున్నారట. అలా.. స్క్రిప్ట్ రాయడంలో మెలకువలు నేర్చుకున్నారు త్రివిక్రమ్.

వేణు అనే ఓ కొత్త కుర్రాడు, మరికొంత మంది మిత్రులు కలిసి ఓ సినిమా చేద్దామనుకున్నారు. అంతా సెట్ అయింది. ఆ మాటల మధ్యలోనే మాటలు త్రివిక్రమ్ తో రాయించాలనే నిర్ణయం కూడా పూర్తయింది. అందుకోసమే వేచిచూస్తోన్న అతను ఆ చిత్రానికి కథ, మాటలు అందించాడు. అదే స్వయంవరం. సినిమా సూపర్ హిట్ అయింది. స్వయంవరంతో అందరికంటే ఎక్కువగా త్రివిక్రమ్ కే పేరొచ్చింది. దీంతో కొంతమంది ఆయన్ని అప్రోచ్ అయ్యారట. కానీ త్రివిక్రమ్ మాత్రం ఎవరికీ చెప్పకుండా భీమవరం వెళ్లి కొన్నాళ్లుండి వచ్చేశాడట.

భీమవరం నుంచి వచ్చిన తర్వాత రాసిన నువ్వేకావాలి సినిమాతో త్రివిక్రమ్ ప్రభంజనం మొదలైంది. పొట్టి డైలాగ్స్ తో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. సిల్వర్ స్క్రీన్ పై పేజీల కొద్దీ మాటల స్థానంలో పంచ్ లు నేర్పాడు. నువ్వేకావాలి సినిమా విజయంలో సింహభాగం మాటలదే.. అంటే కాదనేదెవరు..?

‘నువ్వేకావాలి’ కంటే ముందు నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య కాంబినేషన్ లో వచ్చిన నిన్నేప్రేమిస్తా కు మాటలు అందించాడు. తర్వాత ‘చిరునవ్వుతో, నువ్వునాకు నచ్చావ్, వాసు’ వంటి చిత్రాలతో అద్భుతమైన రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు త్రివిక్రమ్. అంటే 1999లో వచ్చిన ‘స్వయంవరం‘తో రచయితగా ప్రస్థానం మొదలుపెడితే, 2002వరకే స్టార్ రైటర్ గా మారిపోయాడు. చాలా సినిమాల్లో దర్శకుడి ప్రతిభ కంటే త్రివిక్రమ్ మాటల తూటాలకే ఎక్కువ పేరొచ్చిందనేది అందరికీ తెలిసిందే.


అయితే త్రివిక్రమ్ కాలేజ్ రోజుల్లో సెకండ్ షోలకు వెళుతున్నప్పుడే దర్శకుడు కావాలనే కోరికతో ఉండేవాడు. అందుకే రచయితగా వచ్చిన పేరును దర్శకుడిగా మారేందుకు వాడుకున్నాడు. అప్పట్లో లవర్ బాయ్ గా ఫామ్ లో ఉన్న తరుణ్ తో నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలోని మాటలు నాటి యూత్ పై మంత్రాల్లా పనిచేశాయంటే ఆశ్చర్యమేమీ లేదు. ప్రేమలోని కొత్త కోణాన్ని తనదైన శైలిలో ఆవిష్కరించి దర్శకుడిగానూ మంచి మార్కులు సంపాదించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

రచయిత దర్శకుడైతే తను అనుకున్న సన్నివేశాన్ని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరపై ఆవిష్కరిస్తాడు. అయితే త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన ‘నువ్వే నువ్వే’లో లవ్ ఫీల్ కంటే డైలాగ్స్ డామినేషన్ ఎక్కువగా ఉందనే కామెంట్స్ కూడా వచ్చాయి. దీంతో కొంత టైమ్ తీసుకుని ‘అతడు’చేశాడు. మహేష్ లోని మరో యాంగిల్ ను అద్భుతంగా చూపిన సినిమా ఇది. కూల్ గా ఉంటూ ఖూనీలు చేసే పాత్రలో మహేష్ మెస్మరైజ్ చేస్తే.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో బంచ్ ల కొద్దీ పంచులతో ఆడేసుకున్నాడు త్రివిక్రమ్.


అతడు సినిమా చూస్తున్నప్పుడు దర్శకుడిగా త్రివిక్రమ్ పెన్ పవర్ తో పాటు అతని విజన్ కూడా క్లియర్ గా అర్థమౌతుంది. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలోని అన్ని పాత్రలకూ ఎంతో కొంత ప్రాధాన్యం కనిపిస్తుందీ చిత్రంలో. అందుకే ఇప్పటికీ టివిలో ఆల్ టైమ్ టాప్ రేటింగ్ మూవీగా నిలుస్తోంది అతడు.

‘అతడు‘ కంటే ముందు ‘మన్మథుడు, మల్లీశ్వరి‘ చిత్రాలకు కథ, మాటలు అందించాడు. దీంతో పాటు రవితేజ హీరోగా నటించిన ‘ఒక రాజు ఒకరాణి‘ చిత్రంలోని అన్ని పాటలను శ్రీనివాసే రాశాడు. సినిమా పోవడంతో ‘ఒకరాజు ఒకరాణి‘ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. మళ్లీ మన్మథుడు, మల్లీశ్వరి సినిమా విజయాల్లో ఇతని పెన్ దే పెద్ద స్థానం.

కొన్ని పరిచయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అతడు తర్వాత చాలామంది హీరోలు త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయాలనుకున్నారు. అతను మాత్రం ఒకే హీరోతో చేయాలనుకున్నాడు. అతనే పవన్ కళ్యాణ్. అతి కష్టం మీద పవన్ అప్పాయింట్ మెంట్ తీసుకుని కలిసి చెప్పిన కథ జల్సా. ఆ తర్వాత వీరి ప్రయాణం సినిమా మనుషులుగానే కాక ఆత్మీయులుగానూ కొనసాగుతోంది.


త్రివిక్రమ్ ఎప్పుడూ హీరోల కోసం కథలు రెడీ చేసుకోలేదనే విషయం ఆయన సినిమాలు చూసినప్పుడు అర్థం అవుతుంది. అందుకే అందరు స్టార్ హీరోల వెంట పడలేదతను. కానీ మహేష్ తో వైవిధ్యమైన ప్రయత్నంగా చేసిన ఖలేజా ఆడలేదు. కానీ ఇప్పుడు టివిల్లో వస్తే మాత్రం నవ్విస్తుంది. నిజానికి మహేష్ బాబులోని కామెడీ యాంగిల్ ను ఫస్ట్ టైమ్ చూపిన సినిమా ఖలేజా.

త్రివిక్రమ్ శ్రీనివాస్.. స్వయంకృషితో స్వయంవరం ప్రకటించుకుని.. కష్టాలను కూడా చిరునవ్వుతో ఫేస్ చేసి.. తనదైన ప్రతిభతో పరిశ్రమలో ఎందరో నిర్మాతలు, హీరోల చేత నువ్వే కావాలి అనిపించుకుని.. జల్సాగా పని చేసుకుంటూ ప్రతి సినిమాకూ ఖలేజా చూపుతూ.. జులాయిగా బాక్సాఫీస్ వద్ద జూలు విదుల్చుతూ.. అత్తారింటితో అన్నిరికార్డులనూ తుడిచేసి.. సన్నాఫ్ సత్యమూర్తితో సత్తా చాటి.. అల వైకుంఠపురములోతో ఆల్ టైమ్ రికార్డ్స్ కొట్టిన అతడు.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడు.


త్రివిక్రమ్ సినిమాల్లో ఇమేజ్ ల కోసం పెట్టే సీన్స్ ఉండవు. ట్రెండ్ ను ఫాలో అయ్యే రొటీన్ సన్నివేశాలు కనిపించవు. అందుకే అతడులో మహేష్ చేత ముక్తసరి డైలాగ్స్ చెప్పించినా.. జల్సాలో కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా అంటూ పవన్ చేత పేజీ డైలాగ్స్ చెప్పించినా అవన్నీ కథానుసారమే కానీ, హీరోల ఇష్టానుసారం కాదు. అందుకే త్రివిక్రమ్ సినిమాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్స్.. కాసేపు అంతా కలిసి ఎంజాయ్ చేసేందుకు వీలుగా ఉండే మంచి కుటుంబ కథా చిత్రాలు.

అయితే ఎంతో టాలెంట్ ఉండీ... ఎందరి టాలెంట్ నో చూపించగలిగి ఉండీ కొందరు హీరోలకే పరిమితమవుతాడు అనే విమర్శ కూడా ఉంది త్రివిక్రమ్ పై. కానీ తనకు కంఫర్ట్ గా ఉండేవాళ్లే కాదు, తన కథకు కుదిరే వారితో పని చేస్తే తప్పేంటీ అనేది అతని వెర్షన్. తన కథకు సెట్ అయ్యే హీరో ఎవరైనా సరే హిట్ కొడతానని ‘అ..ఆ..‘ తో ప్రూవ్ చేశాడు. నితిన్, సమంతలతో ‘మీనా’ నవల, సినిమా ఆధారంగా ‘అ..ఆ’ని డైరెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు.

హీరో ఇమేజ్ ని పూర్తిగా మార్చేసే త్రివిక్రమ్ శ్రీనివాస్, మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడనగానే.. చాలా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అజ్ఞాతవాసిగా వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మరింత కసిగా ఫస్ట్ టైమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేశాడు. ‘అరవింద సమేతవీరరాఘవ’గా వచ్చిన ఈ మూవీ మంచి హిట్ గా గెలిచింది.

ఎందుకో ఇతర హీరోలకంటే బన్నీతో త్రివిక్రమ్ బాండింగ్ బాగా కుదిరింది. వీరి కాంబోలో వచ్చిన జులాయి. సన్నాఫ్ సత్యమూర్తి సూపర్ హిట్స్. ఇక అర్జున్ ఫ్లాప్ తో ఉన్నప్పుడు త్రవిక్రమే గుర్తొచ్చాడు. ఆ గుర్తు గ్నాపకంగా మార్చాడు త్రివిక్రమ్. అల వైకుంఠపురములో అంటూ వచ్చిన ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసింది.

అల వైకుంఠపురములో తర్వాత మహేష్ బాబు తో ‘గుంటూరు కారం’సినిమా చేశాడు త్రివిక్రమ్. ఈ ఏడాది సంక్రాంతి బరిలో వచ్చిన ‘గుంటూరు కారం’ కమర్షియల్ గా ఫర్వాలేదనిపించినా.. ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేకపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ మరో మూవీకి సిద్ధమవుతున్నాడు మాటల మాంత్రికుడు. బన్నీ-త్రివిక్రమ్ కలయికలో నాల్గవ చిత్రంగా రూపొందే ఈ సినిమాని హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందే ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ మూవీతో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని కోరుకుంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు బర్త్ డే విషెస్ చెప్పేద్దాం..


- Kamalla. Babu Rao

Tags

Next Story