Sivakarthikeyan : దుమ్మురేపిన డబ్బింగ్ సినిమాలు

ఈ యేడాది టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల హవా పెద్దగా కనిపించలేదు. కానీ ఆకట్టుకున్న సినిమాలన్నీ కలెక్షన్స్ పరంగానూ, క్రిటిక్స్ ను మెప్పించడంలోనూ సూపర్ హిట్ అనిపించుకున్నాయి. రెండు తమిళ్, రెండు మళయాల మూవీస్ మనోళ్లను బాగా ఎంటర్టైన్ చేశాయి. ఈ సారి కన్నడ, హిందీ సినిమాలేవీ తెలుగు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అలాగే తమిళ్, మళయాలం నుంచి కూడా పెద్ద హీరోల సినిమాలు మెప్పించలేదు. మీడియం రేంజ్ మూవీస్ మాత్రమే మనోళ్ల మనసులు గెలుచుకున్నాయి.
కొన్నాళ్లుగా తెలుగు మార్కెట్ పై కన్నేసి ఆకట్టుకుంటోన్న హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిందనే చెప్పాలి. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రానికి తెలుగు ఆడియన్స్ పట్టం కట్టారు. కలెక్షన్ల వర్షం కురిసింది. చూసిన వారంతా దాదాపు ఎమోషనల్ గా బరస్ట్ అయిపోయారు. ఈ మూవీ తెలుగులోనే 30 కోట్లకు వరకూ వసూళ్లు సాధించి ఇండస్ట్రీని కూడా ఆశ్చర్యపరిచింది.
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మహరాజా మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఈ తరహా సినిమా ఇప్పటి వరకూ రాలేదేమో అన్నంత గొప్ప స్క్రీన్ ప్లేతో పాటు విజయ్ సేతుపతి అద్భుత నటనతో ఆద్యంత ఆకట్టుకుందీ మూవీ. సున్నిత మనస్కులను కాస్త కలచివేసినా.. క్లైమాక్స్ కు చాలామంది బాబోయ్ అనేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఇలా ఈ రెండు తమిళ్ సినిమాలు బలమైన కంటెంట్ తోనే తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి.
ఇక మళయాలం నుంచి వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ బ్లాక్ బస్టర్ అయింది. గుణ కేవ్స్ కు సరదాగా వెళ్లిన కొందరు మిత్రులు ప్రమాదం బారిన పడటం.. వారిని రక్షించడం అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ అన్ని భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఇతర భాషా ప్రేక్షకులకు పెద్దగా తెలిసిన మొహాలు లేకున్నా.. బలమైన కథ, కథనాలతోనే ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించింది.
మళయాలం నుంచే వచ్చిన ప్రేమలు మన యూత్ ను బాగా ఎంటర్టైన్ చేసింది. పైగా ఈ మూవీ హైదరాబాద్ నేపథ్యంగా సాగడం మరింత ఆకట్టుకుంది. వీళ్లూ కొత్త ఆర్టిస్టులే. అయినా మంచి ప్రేమకథ చూశాం అన్న అనుభూతికి గురయ్యారు ప్రేక్షకులు. ఈ మూవీ కూడా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. అలా డబ్బింగ్ పరంగా ఈ నాలుగు సినిమాలూ కమర్షియల్ సక్సెస్ లు చూడ్డమే కాక.. తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా మిగిలాయి.
ఇక తమిళ్ నుంచి విజయ్ గోట్, రజినీకాంత్ వేట్టయాన్, సూర్య కంగువా చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. విజయ్ సేతుపతి విడుదల 2 సైతం తేలిపోయింది. నిజానికి ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. వాటిని అందుకోవడంలో చతికిల పడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com