Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి

Super Star Krishna: తెలుగు లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్ధం పద్మాలయ స్టూడియోస్‌కు తరలించారు.కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తి చేసిన తరువాత కృష్ణ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.
కృష్ణ పార్థివదేహానికి.. పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తీపి గుర్తులను నెమరువేసుకుంటూ..కన్నీటిపర్యంతమయ్యారు. మహేశ్ బాబు కుటుంబాన్ని ఓదార్చారు. తమ అభిమాన హీరోకి కడసారి నివాళి అర్పించేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న కృష్ణ అభిమానులు తరి వస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కేసీఆర్, వెంకయ్యనాయడు, తెలంగాణ మంత్రులు.. ఇతర రాజకీయ ప్రముఖులతో పాటు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, వెంకటేశ్, మోహన్ బాబు, రామ్ చరణ్ .. సినీ రంగానికి చెందిన ఇతర హీరోలు, హీరోయిన్లు సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
అటు కృష్ణ మృతికి సంతాపంగా తెలుగు సినిమా పరిశ్రమ ఇవాళ బంద్ పాటించనుంది. సినిమా షూటింగ్ లను నిలిపివేస్తున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి నిర్ణయించింది. అంతేకాక తెలుగు రాష్ట్రాల్లో అన్ని సినిమా హాళ్లలో సినిమా ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్లు ఫిలిం ఛాంబర్ ప్రకటించింది.
సినీ అభిమానులు అందుకు సహకరించాలని కోరింది. కృష్ణ మృతికి సంతాపంగా ఇవాళ సినీ పరిశ్రమ కార్యకలాపాలు, షూటింగ్ లు రద్దు చేసుకోవాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన విజ్ఞప్తి మేరకే నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com