Super Star Krishna: పొలిటికల్‌ స్టార్‌గానూ మెప్పించిన సూపర్‌స్టార్..

Super Star Krishna: పొలిటికల్‌ స్టార్‌గానూ మెప్పించిన సూపర్‌స్టార్..
Super Star Krishna: సూపర్‌స్టార్‌ పొలిటికల్‌ కృష్ణగానూ మెప్పించారు. మొదట్లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి మద్దతు ఇచ్చినప్పటికీ.. ఆ తరువాత వచ్చి విభేదాలతో కంప్లీట్‌ అపోజిషన్‌గా మారారు.

Super Star Krishna: సూపర్‌స్టార్‌ పొలిటికల్‌ కృష్ణగానూ మెప్పించారు. మొదట్లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి మద్దతు ఇచ్చినప్పటికీ.. ఆ తరువాత వచ్చి విభేదాలతో కంప్లీట్‌ అపోజిషన్‌గా మారారు. ఏకంగా ఎన్టీఆర్‌ పాలనను వ్యతిరేకిస్తూ సినిమాలు కూడా తీశారు. రాజీవ్‌గాంధీ ప్రోత్సాహంతో ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. రాజీవ్‌ మరణం, గుంటూరు నియోజకవర్గం ఇవ్వకపోవడం, రెండోసారి పోటీలో ఏలూరు ఎంపీగా ఓడిపోవడంతో.. రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

సూపర్‌స్టార్‌ సూపర్‌ స్టారే. అది సిల్వర్‌ స్క్రీన్‌ అయినా.. పొలిటికల్‌ స్క్రీన్‌ అయినా. సినిమాల్లో టాప్‌ హీరోగా కొనసాగుతూనే.. రాజకీయ రంగంలోనూ అడుగు పెట్టారు. అక్కడా తనదైన ముద్ర వేశారు. 1972లో జైఆంధ్ర ఉద్యమానికి కృష్ణ మద్దతిచ్చారు. ఆ తర్వాత 1982లో విడుదలైన ఈనాడు సినిమా అప్పుడే రాజకీయ రంగప్రవేశం చేసిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు, ప్రచారానికి అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఎన్నికలు మూడువారాల్లో ఉన్నాయనగా.. విడుదలైన ఈ సినిమా తెలుగుదేశం ప్రభంజనానికి తనవంతు కృషిని అందించినట్లయ్యింది.

ఏమైందో గాని.. ఆ తర్వాత రామారావు, కృష్ణ మధ్య రాజకీయపరంగా విభేదాలొచ్చాయి. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెళ్ల భాస్కరరావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు నాదెళ్లను కృష్ణ అభినందిస్తున్నట్టు ఫుల్‌పేజీ ప్రకటన విడుదల కావడం.. ఈ సంఘటన కృష్ణకి, రామారావుకి మధ్య విభేదాలు తీసుకొచ్చింది. ఎన్.టి.రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ విభేదాలు రాజుకున్నాయి.

ఇక, 1984 అక్టోబరులో ఇందిరా గాంధీ దారుణహత్యకు గురైనప్పుడు.. కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లారు. ప్రధాన మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీని కలిశారు. ఇదే సమయంలో రామారావు మాస్‌ అప్పీల్‌ తెలుగుదేశం పార్టీకి ప్లస్‌ అవుతోంది. అలాంటి ప్రజాకర్షణ ఉన్న కృష్ణ కాంగ్రెస్ పార్టీకి ఉపకరిస్తాడని కాంగ్రెస్ నాయకులు భావించారు. ఆయన్ను పార్టీలో చేరాలని ప్రోత్సహించారు. అలా 1984లో కృష్ణ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

ఆ తర్వాత తెలుగునాట ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ సినిమాలు చేశారు. ఆ క్రమంలో వచ్చినవే మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి సినిమాలు. కృష్ణ 80వ దశకంలో పలు రాజకీయ నేపథ్యంలోని సినిమాలు చేయడం వెనుక కారణం కూడా ఇదే. నా పిలుపే ప్రభంజనం సినిమా పూర్తిస్థాయి విమర్శగా తీశారు. రాజకీయంగా తిరుగుబాటు రావడం ఈ సినిమాలో క్లైమాక్స్. ఈ సినిమాపై అప్పట్లో ఎన్నో చర్చలు జరిగాయి.

1989లో కృష్ణ కాంగ్రెస్ తరపున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎంపీగా గెలిచారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం కోరుకున్నా.. పార్టీ మాత్రం తిరిగి ఏలూరులోనే పోటీచేయించింది. ఆ ఎన్నికల్లో కృష్ణ ఓడిపోయారు. ఆ తర్వాత.. తనకు సన్నిహితుడు, రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యతో పాటు.. తాను కోరిన గుంటూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందారు. ఏలూరులో ఓటమి, ఇతరత్రా కారణాలతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయడం విరమించుకున్నారు. అయినా..2009లో ఎన్నికల్లో వైఎస్‌ కోరిక మేరకు కృష్ణ కుటుంబం కాంగ్రెస్‌కు నైతిక మద్దతు తెలిపింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్‌ టీడీపీలో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story