సూపర్ స్టార్ 'మహేష్'.. సరిలేరు నీకెవ్వరు.. బర్త్‌డే స్పెషల్..

సూపర్ స్టార్ మహేష్.. సరిలేరు నీకెవ్వరు.. బర్త్‌డే స్పెషల్..
HBD Mahesh Babu: మహేష్ బాబు బార్న్ విత్ సిల్వర్ స్క్రీన్. పెద్దగా కష్టపడకుండానే సినిమాల్లోకి వచ్చాడు.

HBD Mahesh Babu: మహేష్ బాబు బార్న్ విత్ సిల్వర్ స్క్రీన్. పెద్దగా కష్టపడకుండానే సినిమాల్లోకి వచ్చాడు. కానీ స్టార్డమ్ మాత్రం అంత ఈజీగా రాలేదు. స్టార్ వార్ లో ఎన్నో హర్డిల్స్ ని దాటుకుని సూపర్ స్టార్ అయ్యాడు. ఫ్లాప్స్ వచ్చినప్పుడు నిరాశ పడకుండా ఖలేజా ఉన్న కథలతో దూకుడు చూపించి టాప్ లేపేశాడు మహేష్ బాబు. సూపర్ స్టార్ తనయుడైనా.. తనూ సూపర్ స్టార్ అనిపించుకోవడానికి చాలాకాలం ఎదురుచూశారు. ఆ ఎదురుచూపుకు ఫలితం.. ఇప్పుడు మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోల్లో ముందు వరుసలో ఉన్నాడు. ఇవాళ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే.


సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. అన్నయ్య రమేష్ బాబు నీడ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత పోరాటం, బజారురౌడీ, ముగ్గురుకొడుకులు, గూఢఛారి117, కొడుకుదిద్దిన కాపురం, బాలచంద్రుడు లాంటి సినిమాలు చేశాడు మహేష్. అయితే సినిమాల వల్ల మహేష్ చదువు పాడవుతుందని, చదువు పూర్తయ్యాక మళ్లీ సినిమాల్లోకి వద్దువు అంటూ మహేష్ ని కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంచారు కృష్ణ



ఛైల్డ్ ఆర్టిస్ట్ గానే అదరగొట్టిన మహేష్ బాబు, రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రీతిజింటా హీరోయిన్ గా చేసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. మహేష్ కు నంది అవార్డు తెచ్చిపెట్టిన ఈ సినిమాతో కృష్ణ కొడుకు అదరగొట్టేశాడనే పేరొచ్చింది. ఇక అదే టైంలో రమేష్ బాబు స్లో అవ్వడంతో, కృష్ణ ప్లేస్ ని రీప్లేస్ చేసే బాధ్యతని మహేష్ కు అప్పగించారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.



ఫస్ట్ హిట్ లో బోల్డంత కిక్ ఉంటుంది. రాజకుమారుడు మహేష్ బాబుకు ఈ కిక్కే ఇచ్చింది. ఈ జోష్ లో వెరీ నెక్ట్స్ ఇయర్ యువరాజు, వంశీ సినిమాలు రిలీజ్ చేశాడు మహేష్. కానీ ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో సూపర్ స్టార్ అభిమానుల్లో ఆందోళన. అరె రమేష్ బాబు ఫెయిల్ అయినా, మహేష్ మా ఆశలు మోస్తాడు అనుకుంటే ఈ ఫెయిల్యూర్స్ ఏంటని కంగారు పడ్డారు. కానీ ఆ టెన్షన్ కొంతకాలమే. ఎందుకంటే ఆ వెంటనే కృష్ణ వంశీ డైరెక్షన్లో వచ్చిన మురారి సినిమా సూపర్ హిట్ అయ్యింది. కృష్ణ అభిమానులకు పండుగ తీసుకొచ్చింది.



కృష్ణ అంటే ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. సరికొత్త టెక్నాలజీని పరిచయం చెయ్యడంలో మాష్టర్. మరి మహేష్ బాబు ఇలాంటి రొటీన్ సినిమాలకే పరిమితం అయిపోతాడా? అనుకుంటోన్న టైంలో కృష్ణమార్క్ కౌ బాయ్ సినిమా టక్కరి దొంగ చేశాడు. జయంత్ సి ఫరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు రియల్ స్టంట్స్ తో ఆశ్చర్యపరిచాడు గానీ, సినిమా ఫెయిల్ అయ్యింది.



మహేష్ బాబు హిట్టు ఫ్లాపులతో సంబందం లేకుండా సినిమాలు చేస్తున్నాడు గానీ, చాక్లెట్ బాయ్ క్యారెక్టర్స్ తో మాస్ కి ఎక్కడం కష్టం. మాస్ ఆడియన్స్ లో ఫాలోయింగ్ లేకపోతే కృష్ణ వదిలిపెట్టిన ప్లేస్ ని రీప్లేస్ చెయ్యడం కష్టం అని సినీపెద్దలంతా మాట్లాడడం స్టార్ట్ అయ్యింది. మరి మాస్ అంటే ఏంటి? అందరినీ మెప్పించడమే కదా. యస్ ఒక్కడుతో ఆపని పర్ఫెక్ట్ గా చేశాడు మహేష్ బాబు.



మహేష్ బాబు కెరీర్ ని మలుపుతిప్పిన సినిమా ఒక్కడు. గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో ఛార్మినార్ సెట్టింగ్ ఓ హైలెట్ అయితే, మహేష్ బాబు పెర్ఫామెన్స్ మరో హైలెట్. కబడ్డి ప్లేయర్ లా యూత్ రిప్రజెంటేటివ్ గా కనిపించిన మహేష్ బాబు యాక్టింగ్ కు ఫుల్ మార్కులు పడ్డాయి. ఫిల్మ్ ఫేర్ అవార్డూ వచ్చింది. ఇక అప్పటి వరకు కృష్ణ అభిమానులే ప్రిన్స్ ఫ్యాన్స్ అన్న లైన్ పోయి, తనకంటూ సొంత ఫాలోయింగ్ ఏర్పడిందీ ఒక్కడు సినిమాతోనే.


మహేష్ బాబు ఎప్పుడూ ఛాలెంజెస్ ని ఫేస్ చెయ్యడానికే ఇష్టపడతాడు. ఒక్కడు తర్వాత వరుసగా మాస్ సినిమాలు చేసుంటే మహేష్ చాలా త్వరగా సూపర్ స్టార్ అయ్యేవాడు. కానీ రొటీన్ ఫార్ములాలో వెళ్లకుండా నిజం, నాని లాంటి సినిమాలతో ప్రయోగాలు చేశాడు. ఈ సినిమాలు మహేష్ కు కొత్త ఇమేజ్ తీసుకొచ్చినా, అభిమానులకు ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. కానీ ఈ ఫెయిల్యూర్స్ తో వెనుకబడ్డాడు మహేష్ బాబు. దీంతో మళ్లీ హిట్ కొట్టాలని ఒక్కడుతో తన ఇమేజ్ మార్చేసిన గుణశేఖర్ తో అర్జున్ సినిమా చేశాడు. కానీ ఈ సినిమా కూడా మహేష్ ని సాటిస్ ఫై చెయ్యలేదు.



మహేష్ కెరీర్ లో స్పెషల్ మూవీగా అతడు సినిమాని చెప్పొచ్చు. వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న టైమ్ లో వచ్చిన ఈ సినిమా మహేష్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కించడమే కాదు టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ లా నిలిచి మహేష్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. అంతంత మాత్రమే ఉన్న ఓవర్సీస్ మార్కెట్ కి అతడు సినిమా కొత్త జోష్ ని తెచ్చింది. అలాగే సూపర్బ్ పెర్ఫార్మెన్స్ తో మహేష్ అతడుకి నంది అవార్డ్ ని కూడా దక్కించుకున్నాడు.



హిట్స్ ఉన్నాయి. ఫ్లాప్స్ వచ్చినా అధైర్యపడకుండా దూసుకెళ్తున్నాడు. కానీ మహేష్ బాబు ఇంకేదో సాధించాలి. అభిమానులంతా గర్వపడేలా, స్టార్ వార్ లో దుమ్ముదులిపేలా ఓ హిట్ కావాలి. అది ఫలానా హీరోకి ఫలానా సినిమా ఉందే.. అలా అని అంతాఅనుకునేలా ఉండాలి అనుకుంటోన్న టైమ్ లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పోకిరి అభిమానుల ఆకలిని తీర్చింది. ఆ టైమ్ కు ఉన్న అన్ని రికార్డులను తిరగరాస్తూ మహేష్ ని టాప్ రేసులో నిలిపింది పోకిరి...



పోకిరి టాలీవుడ్ లో ఖాకీ కథలకు కొత్త స్టైల్ ని తీసుకొచ్చిన ట్రెండ్ సెట్టింగ్ మూవీ. ఎవడు కొడితే దిమ్మతిరిగిమైండ్ బ్లాంక్ అయిపోద్దో వాడే పండుగాడు అంటూ మహేష్ చేసిన రచ్చకు బాక్సాఫీస్ మొత్తం ఊగిపోయింది. కలెక్షన్ల రికార్డులు సృష్టించిందీ పోకిరి. ఈ హిట్ తో మహేష్ రేంజ్ పెరిగిపోయింది. మాస్ లో స్ట్రాంగ్ బేస్ క్రియేట్ అయ్యింది.




పోకిరి తర్వాత వచ్చిన సైనికుడు, అతిధి, ఖలేజా లాంటి సినిమాలు భారీ ఓపెనింగ్స్ సాధించాయి కానీ అంచనాలను మాత్రం అందుకోలేకపోయాయి. అయితే ఖలేజా సినిమా ఫ్లాప్ అయినా మహేష్ బాబుకు మాత్రం సరికొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. అప్పటివరకు లవర్ బాయ్, యాక్షన్ హీరోగానే కనిపించిన మహేష్ ఫస్ట్ టైం కామెడీ చేశాడు. పంచ్ లతో అదరగొట్టాడు. ఎలాంటి జానర్ సినిమా అయినా చెయ్యగల ఖలేజా ఉందని ఈ సినిమాతో నిరూపించాడు మహేష్.



ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఖలేజా ఫ్లాప్ అయితే, ఈసారి మాస్ ఎంటర్టైనర్ తో దూకుడు చూపించాడు. శ్రీనువైట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఎప్పుడూ ఒకే ఫార్మాట్లో వెళ్లడానికి ఇష్టపడని మహేష్ వెంటనే యాక్షన్ హీరోగా పూరీజగన్నాథ్ డైరెక్సన్లో బిజినెస్ మేన్ చేశాడు. మహేష్ బాబు అంతా తానై నడిపించిన ఈ సినిమా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చి, కలెక్షన్లు కురిపించింది. ఈ సక్సెస్ తో మహేష్ బాక్సాఫీప్ బిజినెస్ మేన్ లా మారిపోయాడు.



మహేష్ బాబు హీరోయిజాన్ని నమ్ముకుంది తక్కువ. స్టోరీనే నమ్మాడు. తన చుట్టే సినిమా అంతా తిరగాలని అనుకోలేదు. అందుకే వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు చేశాడు. టాలీవుడ్ లో 20ఏళ్ల తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.



హ్యాట్రిక్ హిట్స్ తో జోష్ లో ఉన్న మహేష్ బాబు ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో సైకలాజికల్ థ్రిల్లర్ వన్ నేనొక్కడినే చేశాడు. ఈ సినిమా మహేష్ లోని అత్యుత్తమ నటుడిని బయటకు తీసుకొచ్చి, విమర్శకులను మెప్పించింది కానీ కమర్షియల్ గా హిట్ అవ్వలేదు. వన్ తర్వాత వచ్చిన ఆగడు కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్సు పై ప్రత్యేక శ్రధ్ద తీసుకున్నాడు మహేష్ బాబు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొరటాల శివ డైరెక్షన్లో శ్రీమంతుడులా వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. 150కోట్లకు పైగా కలెక్షన్లతో టాలీవుడ్ లో వందకోట్ల క్లబ్ లో చేరిన రెండో హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు మహేశ్.



శ్రీమంతుడు తర్వాత భారీ హైప్స్ మధ్య వచ్చిన బ్రహ్మోత్సవం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన స్పైడర్ కూడా ఫ్లాప్ అయింది. ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ కోలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చాడు. బట్ రిజల్ట్ బ్యాడ్ గా ఉండటంతో అక్కడా పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో మరోసారి శ్రీమంతుడు దర్శకుడుతో జోడీ కట్టాడు. అలా వచ్చిన భరత్ అనే నేను వీరి కాంబినేషన్ లో ఉండే మ్యాజిక్ ని మళ్లీ రిపీట్ చేసింది.



ఏ హీరో కెరీర్ లో అయినా 25వ సినిమా అనేది ఫస్ట్ మైల్ స్టోన్ అని చెప్పాలి. ఆ మైల్ స్టోన్ ను మెమరబుల్ గా మార్చుకున్నాడు మహేష్ బాబు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షితో మరోసారి సత్తా చాటాడు. వీకెండ్ ఫార్మింగ్ అనే పాయింట్ ని టచ్ చేస్తూ వ్యవసాయం నేపథ్యంలో వచ్చిన మహర్షి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి.. మహేష్ కెరీర్ లో టాప్ మూవీస్ లిస్ట్ లో చేరిపోయింది.



శ్రీమంతుడు నుంచి వరుసగా ఒకే తరహాలో కనిపిస్తున్నాడు మహేష్ బాబు. ఆ విమర్శకు ఫుల్ స్టాప్ పెట్టిన సినిమా సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈమూవీతో మరోసారి తనలోని మాస్ అండ్ జోష్ యాంగిల్ ను చూపించాడు. మహర్షి వరకూ ఉన్న సీరియస్ లుక్ ను ఈ మూవీతో దింపేశాడు. అలాగే కర్నూలు కొండారెడ్డి బురుజు నేపథ్యంలోని ఫైట్ సీన్ మరోసారి మహేష్ కు తిరుగులేని హిట్ ఇచ్చింది. ఈ సినిమా 200ల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది.



ఇక ఇప్పుడు పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట అంటూ రాబోతున్నాడు. మైత్రీ మూవీస్, 14 రీల్స్ సంస్థల్లో ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఆల్ రెడీ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. సర్కారు వారి పాట తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్న మహేష్...ఆ తర్వాత రాజమౌళితో సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాలతో మహేష్ భారీ హిట్స్ అందుకోవాలని కోరుకుంటూ మరోసారి ఈ సూపర్ స్టార్ కి బర్త్ డే విషెస్ అందిస్తోంది టివి5. ఇదీ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే స్పెషళ్...మరో స్పెషల్ లో మళ్ళీ మీట్ అవుదాం.


-కామళ్ళ బాబురావు

Tags

Read MoreRead Less
Next Story