సుప్రీం సీరియస్.. ఏ ఒక్కరు మరణించినా కోటి పరిహారం..

సుప్రీం సీరియస్.. ఏ ఒక్కరు మరణించినా కోటి పరిహారం..
"రాష్ట్రానికి ఒక ద‌ృఢమైన ప్రణాళిక ఉండాలి. ఇది విద్యార్థుల జీవితాలతో ఆడుకునేలా ఉండకూడదు.

జూలై చివరి వారంలో 12 వ తరగతి పరీక్షను నిర్వహించాలని పట్టుబట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు వేసింది సుప్రీంకోర్టు. న్యాయస్థానం ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్స్‌పై ధర్మాసనం స్పందించింది.

"రాష్ట్రానికి ఒక ద‌ృఢమైన ప్రణాళిక ఉండాలి. ఇది విద్యార్థుల జీవితాలతో ఆడుకునేలా ఉండకూడదు. పరిస్థితి చాలా అనిశ్చితంగా ఉందని, జూలైలో పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలు మరింత ఆలస్యం అవుతాయని తెలిపింది.

బోర్డు పరీక్షకు సుమారు 5.20 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని, ప్రత్యామ్నాయ రోజుల్లో పరీక్షలు నిర్వహించడం, ఒక పరీక్షా కేంద్రంలో 15 నుంచి 18 మంది విద్యార్థులను మాత్రమే అనుమతించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది.

"మీ అఫిడవిట్ ప్రకారం చూస్తే, మీకు హాల్‌కు 15 మంది విద్యార్థులతో 34,634 పరీక్షా హాళ్లు అవసరం. దీనికి సంబంధించి మీరు ఒక ఫార్ములాను రూపొందించారా?అని న్యాయస్థానం ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

"మీరు ఒక్క విద్యార్థికైనా ప్రాణాపాయం లేకుండా పరీక్షలు నిర్వహించడానికి సన్నద్ధమయ్యారని మాకు నమ్మకం కుదరకపోతే, మేము మిమ్మల్ని పరీక్షలు నిర్వహించడానికి అనుమతించము" అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హాజరైన న్యాయవాదికి ధర్మాసనం తెలిపింది. పరీక్షలు నిర్వహించే సమయంలో ఏ ఒక్క విద్యార్థి అయినా కరోనాతో మరణిస్తే కోటి రూపాయలు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

లాజిస్టిక్స్, స్టాఫ్, సేఫ్టీ ప్రోటోకాల్స్‌కు సంబంధించిన అన్ని వివరాలను శుక్రవారం నాటికి అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. కోవిడ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని 12 వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) పై సుప్రీం కోర్టు పై విధంగా స్పందించింది. పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌లో పలువురు విద్యార్థులు పేర్కొన్నారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) మరియు ఐసిఎస్ఇ నిర్ణయించిన ప్రకారం జూలై 31 లోగా ఫలితాలను ప్రకటించాలని సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

Tags

Next Story